హుజురాబాద్‌లో బీజేపీకి డిపాజిట్‌ కూడా రాదు: హరీశ్‌ రావు

26 Aug, 2021 15:51 IST|Sakshi
మంత్రి హరీశ్‌రావు

సాక్షి, కరీంనగర్‌: హుజురాబాద్‌లో బీజేపీకి డిపాజిట్‌ కూడా రాదని మంత్రి హరీశ్‌ రావు ధ్వజమెత్తారు. హుజురాబాద్‌ నియోజకవర్గంలోని వీణవంక మండలంలో గురువారం  మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వంలో అచ్చేదిన్‌ కాదు సచ్చేదిన్‌ వచ్చిందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం తప్ప కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. బీజేపీ అమ్మకానికి రూపమైతే టీఆర్‌ఎస్‌ నమ్మకానికి రూపమని పేర్కొన్నారు. రైళ్లు, రోడ్లు అమ్మితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని నిలదీశారు.  ప్రజలు బాగుపడాలా ? ఈటల రాజేందర్‌ బాగుపడాలా? ఆలోచించాలని ప్రజలకు సూచించారు.

‘మీ సహకారంతో గెల్లు శ్రీనును.. గెలుపు శ్రీనుగా సీఎం కేసీఆర్‌కు బహుమతిగా ఇద్దాం. వీణవంకలో 2-3 రోజుల్లో 24/7 పనిచేసేలా ఆస్పత్రి, పోస్ట్ మార్టం కేంద్రం మంజూరుకు కృషి చేస్తా. బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, వివేక్, సంజయ్ ఇక్కడి వాళ్లా… అసహనంతో ఈటెల ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు.  చావు నోట్లో తలపెట్టి ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్. 24 గంటల కరెంటు ఇస్తామంటే కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఇవాళ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్నాం. కాళేశ్వరం పూర్తవుతదా అన్నారు.  రైతులు వద్దనే రీతిలో నీళ్లు వస్తున్నాయి. నీటి తీరువా రద్దు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం’ అని తెలిపారు.
చదవండి: పదిసార్లు తిరిగినా.. కళ్లకు కనిపిస్తలేనా.. పింఛన్‌ ఎందుకివ్వరు?

మరిన్ని వార్తలు