కేసీఆర్ కిట్‌లో కేంద్రానిది నయా పైసా లేదు: మంత్రి

30 Oct, 2020 15:05 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతల అసత్య ప్రచారాలపై ఆర్థికశాఖ మంత్రి హరీష్‌ రావు నిప్పులు చెరిగారు. దుబ్బాకలో బీజేపీ పార్టీ జూటా మాటలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ జూటా మాటలు ప్రజలకు తెలియజేసేందుకే ఈ రోజు(శుక్రవారం) మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. వెనుకటికి వేయి అబద్దాలు ఆడిన ఒక పెళ్లి చేయాలని అనే వారని, ఇప్పుడు బీజేపీ వాళ్ళు వేయి అబద్దాలు ఆడైన ఒక ఎన్నిక గెలవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్దాలే ఆయుధంగా చేసుకుని,  అబద్ధాల పునాదుల మీద దుబ్బాకలో బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారన్నారు. బీజేపీ నేతలు సత్యమేవ జయతే అనే నానుడిని మార్చి అసత్యమేవ జయతేగా మార్చివేశారని విమర్శనాస్త్రాలు సంధించారు.చదవండి: దుబ్బాక ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తుకు నాంది

బీడీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ పుర్రె గుర్తును బహుమతిగా ఇస్తే, బీజేపీ వాళ్ళు 18 శాతం జీఎస్టీని కానుకగా ఇచ్చారని మంత్రి ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీడీ కార్మికులను మోసం చేస్తే, కేసీఆర్ పెన్షన్ ఇచ్చి వారిని ఆదుకున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ కిట్ పథకంలో బీజేపీ ప్రభుత్వ వాటా ఉందని బీజేపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారన​‍్నారు. కేసీఆర్ కిట్‌లో కేంద్రానిది నయా పైసా లేదని స్పష్టం చేశారు. గొర్రెల యూనిట్లలో 50 వేలు బీజేపీ ప్రభుత్వం ఇస్తుందని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని అన్న మంత్రి హరీష్‌రావు గొర్రెల యూనిట్లలో నూటికి నూరు శాతం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని పేర్కొన్నారు. చేగుంటలో మంజూరైన ఈఎస్‌ఐ ఆసపత్రిని గజ్వేల్‌కు తరలించారని బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. బీజేపీ నేతలకు నిజంగా దమ్ముంటే చేగుంటకు మంజూరు ఆయునట్లు ఆధారాలు చూపాలని సవాల్‌ విసిరారు. చదవండి: దుబ్బాక ఎన్నికలపై కేంద్రానికి కాంగ్రెస్‌ ఎంపీ లేఖ

‘ఆఖరికి ప్రజలు తినే అన్నం పైన బీజేపీ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. రేషన్ బియ్యంపై  కేంద్రం 29 రూపాయలు  ఇస్తుంటే, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇస్తోందని ప్రచారం చేస్తున్నారు. కేంద్రం కేవలం సగం కార్డులకే సబ్సిడీ ఇస్తే మిగతా సగం కార్డులకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. దుబ్బాకలో మంజూరైన  పాలిటెక్నిక్ కాలేజ్‌ను సిద్దిపేటకు తరలించారని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. అసలు దుబ్బాకకు పాలిటెక్నిక్ కళాశాలనే మంజూరు కాలేదు. కేసీఆరే బోరు మోటార్లకు మీటర్ పెడుతుందని ఉల్టా ప్రచారం చేస్తున్నారు. చదవండి: దుబ్బాక ఎన్నికపై కేసీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

వరి ధాన్యం మద్దతు ధర కోసం రూ. 5,500 కోట్లు కేంద్రం విడుదల చేసిందని పచ్చి అబద్దాలు ఆడుతున్నారు.  కేంద్రం ఒక్క రూపాయి విడుదల చేయలేదు. డబ్బులు దొరికిన ఇల్లు మా వాళ్లది కాదంటున్న బీజేపీ అభ్యర్థి పోలీసులు తనిఖీలు చేస్తున్నారు అని తెలియగానే  ప్రచారం ఆపేసి ఎందుకు ఆగమేఘాల మీద పరుగెత్తుకు వచ్చిండు? హడావుడి ఎందుకు చేసిండు?  దుబ్బాకలో రఘునందన్ రావు అసత్యాలు ప్రచారం చేసే జూటా స్టార్‌గా మారాడు.  దుబ్బాక ప్రజలు బీజేపీ నేతల మాటలు విని మోసపోవద్దు’. అని మంత్రి బీజేపీ ప్రచారం చేస్తున్న అబద్దాలపై నిప్పులు చెరిగారు.

>
మరిన్ని వార్తలు