పార్టీ కార్యకర్తలే దేవుళ్లు.. విపక్షాల గూడుపుఠాణీ సాగదు

14 Feb, 2021 02:22 IST|Sakshi

పథకాల అమలులో కార్యకర్తల భాగస్వామ్యం పెంచుతాం  

సభ్యత్వ నమోదు సమావేశంలో మంత్రి హరీశ్‌రావు

సాక్షి, సిద్దిపేట: ‘టీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ ఏర్పాటు కోసం పుట్టింది. ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటుంది. ఎన్నో త్యాగాలు, లాఠీ దెబ్బలు, ఆత్మబలిదానాల పునాదులతో ఏర్పడిన పార్టీ మాది. ఇంత అంకితభావం ఉన్న పార్టీ దగ్గర విపక్షాల గూడుపుఠాణీ, కుమ్మక్కు రాజకీయాలు చెల్లవు..’అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా శనివారం సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని పార్టీలు నూటా అరవై ఏళ్లు.. మరికొన్ని నలభై ఏళ్ల చరిత్ర ఉందని గొప్పలు చెప్పుకొంటూ ప్రజలకు మాయమాటలు చెబుతున్నాయని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఏ పార్టీ కూడా నోరు విప్పలేదన్నారు.

మంత్రి పదవులు, ఎంపీ, ఎమ్మెల్యేల పదవులను గడ్డిపోచలా భావించి రాజీనామా చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ పార్టీకి ఉందన్నారు. 2001లో గులాబీ జెండా పట్టుకున్న తమ నాయకుడు కేసీఆర్‌ను చూసి తెలంగాణ తెస్తారా..? అని ఎద్దేవా చేసిన నాయకులు ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందు మొసలికన్నీరు కారుస్తున్నారన్నారు. రాష్ట్ర సాధనకోసం రోడ్లపైకి వచ్చి.. ధర్నాలు, రాస్తారోకోలు చేసి, అరెస్టులు, లాఠీ దెబ్బలు తిన్నది టీఆర్‌ఎస్‌ నాయకులన్నారు. నాటి నుంచి నేటి వరకు పార్టీ కార్యకర్తలే దేవుళ్లుగా పనిచేస్తున్న పార్టీ టీఆర్‌ఎస్‌ అన్నారు. పార్టీకి పునాది రాళ్లు అయిన కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటామన్నారు.

రాష్ట్రంలో ప్రతీ ఇంటిని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఫలాలు తలుపు తట్టాయని వివరించారు. సంక్షేమ పథకాల అమలులో పార్టీ కార్యకర్తల భాగస్వామ్యాన్ని పెంచుతామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రతీ కార్యకర్తకు సభ్యత్వం ఇవ్వాలని సూచించారు. నియోజకవర్గానికి 50 వేల సభ్యత్వాలకు తగ్గకుండా చేయాలన్నారు. సభ్యత్వ నమోదును ఉద్యమంలా చేపట్టి జిల్లాను అగ్రభాగాన నిలపాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. 

చదవండి: (ఫిబ్రవరి 20 నుంచి పాదయాత్ర చేస్తా: కోమటిరెడ్డి)

మరిన్ని వార్తలు