నిత్యం కాల్పులతో ములుగు ప్రాంతం వణికిపోయేది.. హరీష్‌ రావు కీలక వ్యాఖ్యలు

28 Sep, 2023 14:41 IST|Sakshi

సాక్షి, ములుగు: తెలంగాణ మంత్రి హరీష్‌ రావు ములుగు జిల్లాలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి శంకుస్థాపన చేశారు. రూ.183 కోట్లతో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్‌ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ములుగు నియోజకవర్గంలోనే 14 వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. 

ఈ క్రమంలో మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. ములుగు జిల్లాలోనే నక్సలైట్ల ఉద్యమం పుట్టింది. నిత్యం కాల్పులతో ములుగు ప్రాంతం వణికిపోయేది అభివృద్ధి ఫలాలను సీఎం కేసీఆర్‌ ప్రతీ ఒక్కరికీ అందిస్తున్నారు. కాంగ్రెస్‌ పాలనలో కాల్పులు, ఎన్‌కౌంటర్లు, రైతులకు అప్పులు కరెంట్‌ బాధలు, ఎరువుల కొరతలు, తాగు నీటి కష్టాలు ఉండేవి. కేసీఆర్‌ లేకుంటే ములుగు జిల్లా ఏర్పడేదా?. కల్యాణ లక్ష్మి పథకానికి ములుగు జిల్లా స్ఫూర్తినిస్తోంది. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. 

కేసీఆర్ హయాంలో పోడు భూములకు పట్టాలు, ప్రతి గ్రామానికి రోడ్లు, ప్రతి ఇంటికి తాగునీరు, ప్రతి పెళ్లికి కళ్యాణ లక్ష్మి, ప్రతి బిడ్డకు కేసిఆర్ కిట్టు, ప్రతి రైతుకు 24 గంటల కరెంటు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి మానస పుత్రిక కల్యాణ లక్ష్మి పథకం. రాజకీయాలకు అతీతంగా పేదింటి ఆడపిల్లకు కళ్యాణ లక్ష్మి ద్వారా ఆర్థిక సాయం చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. గత ప్రభుత్వం మూడు లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలిస్తే కేసీఆర్ ప్రభుత్వం 4 లక్షల 6 వేల ఎకరాలకు పోడు పట్టాలిచ్చింది. ములుగు నియోజకవర్గంలోనే 14 వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చాం.

76.8% ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీలు అవుతున్నాయి. ప్రభుత్వ వైద్య వ్యవస్థ ఎంత బాగుపడిందో అనడానికి ఇది నిదర్శనం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 87% డెలివరీలతో రాష్ట్రంలోనే ములుగు జిల్లా రెండవ స్థానంలో ఉంది. గిరిజనేతరుల పోడు భూముల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: ‘రాష్ట్రంలో ఏ పార్టీకీ గెలిచే బలం లేదు. నేను బీజేపీలోనే ఉంటా’

మరిన్ని వార్తలు