గెల్లును గెలిపించండి

3 Oct, 2021 02:29 IST|Sakshi
పైప్‌డ్‌ గ్యాస్‌ ప్రారంభించిన అనంతరం  స్టవ్‌ వెలిగిస్తున్న మంత్రి హరీశ్‌రావు 

హుజూరాబాద్‌ అభివృద్ధి బాధ్యత మాదే: హరీశ్‌రావు

కేంద్రం తీరుతో పేదలు కన్నీరు పెడుతున్నారని విమర్శ

సిద్దిపేటలో ఇంటింటికీ గ్యాస్‌లైన్‌ ప్లాంట్‌ ప్రారంభించిన మంత్రి

హుజూరాబాద్‌/ సిద్దిపేట: హుజూరాబాద్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపించాలని, హుజూరాబాద్‌ అభివృద్ధి బాధ్యత తమదని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం హుజూరాబాద్, సిద్దిపేటలో మంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

సింగాపూర్‌లో పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన పలువురు టీఆర్‌ఎస్‌ చేరగా, వారికి హరీశ్‌రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆరుసార్లు ఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌కు చేసిందేమీ లేదని, నాలుగు వేల ఇళ్లు సీఎం కేసీఆర్‌ ఈ నియోజకవర్గ ప్రజల కోసం మంజూరు చేస్తే ఒక్క ఇల్లు కూడా ఈటల కట్టలేదని విమర్శించారు. 

ఏడేళ్లలో 21సార్లు ధరలు పెంచిన కేంద్రం 
కేంద్ర ప్రభుత్వం తీరుతో వంటింట్లో మహిళల కం ట్లో కన్నీరు వస్తోందని, అడ్డూఅదుపూ లేకుండా పెరిగిపోతున్న గ్యాస్‌ సిలిండర్‌ ధరలు సామాన్య ప్రజలకు, నిరుపేదలకు గుదిబండగా మారుతున్నాయని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ది పేట జిల్లా కేంద్రంలో పేదల డబుల్‌ బెడ్రూం (కేసీఆర్‌ నగర్‌) కాలనీలో ఇంటింటికి పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ సరఫరాకోసం ప్లాంట్‌ ప్రారంభం, 360 డబుల్‌ బెడ్రూం ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాలు, బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం గడిచిన ఏడేళ్లలో 21 సార్లు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్‌ సిలిండర్ల ధరలను పెంచి ప్రజల నడ్డి విరిచిందని విమర్శించారు. జిల్లాలోని తన ఇంటికి, జిల్లా కలెక్టర్‌ ఇంటికి కూడా పైప్‌లైన్‌ గ్యాస్‌ సరఫరా లేదని, మొదటిసారిగా పేదల ఇళ్లకు ఈ అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో సిద్దిపేట పట్టణంలో ఇప్పటికే 1,976 డబుల్‌ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేశామని, మరో వెయ్యి ఇళ్ల పంపిణీ కోసం త్వరలో లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు