దళిత బంధును ఆపింది బీజేపీనే..

21 Oct, 2021 03:07 IST|Sakshi

రుజువు చేస్తా.. మంత్రి హరీశ్‌రావు

హుజూరాబాద్‌: ఎన్నికల కమిషన్‌కు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి లేఖ రాసింది నిజమని, దాని వల్లే దళిత బంధు ఆగిందని తాను రుజువు చేస్తానని, ఏ బీజేపీ నేత వస్తారో రండని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు సవాల్‌ విసిరారు. బుధవారం జమ్మికుంటలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హుజూరాబాద్‌లో నడమంత్రపు ఓట్లు వచ్చాయని, ఓటు ఎవరికి వేయాలో.. ఓటు వేస్తే ఏం జరుగుతదో ప్రజలు కొద్దిగా ఆలోచించాలని సూచించారు.

రూ.200 ఉన్న పెన్షన్‌ను రూ.2,016 చేసుకున్నామని, కన్నకొడుకు చూడకపోయినా పెద్ద కొడుకు కేసీఆర్‌ పింఛన్‌ పంపుతున్నాడని ప్రతీ అవ్వ అంటోందని హరీశ్‌ చెప్పారు. బీజేపీ వాళ్లు ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చెప్తూ మనసులు కరాబు చేస్తారని, వాళ్లు ప్రజలకు ఏం చేస్తరో మాత్రం చెప్పడం లేదని అన్నారు. బీజేపీ పాలనలో 21 రోజుల్లో 16 సార్లు పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరిగాయని, దీంతో రవాణా చార్జీలు పెరిగి ఉప్పు, పప్పు, కూరగాయలు, నూనె ధరలు పెరిగాయని, ఇన్ని ధరలు పెంచిన బీజేపీలో చేరిన రాజేందర్‌ తనకు ఓటు వేయండని అంటున్నారని ఎద్దేవా చేశారు.

ధరలు పెంచిన బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. తన స్వార్థం కోసం ఈటల రాజీనామా చేసిండని, రాజేందర్‌ గెలిస్తే బీజేపీకి లాభమని, గెల్లు గెలిస్తే ఇక్కడి ప్రజలకు లాభమని తెలిపారు. భూముల పంచాయితీలు పెట్టుకుని ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరారని, వ్యక్తిగత పంచాయితీని ఇప్పుడు హుజూరాబాద్‌ ప్రజల పంచాయితీగా మాట్లాడుతున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. 

మరిన్ని వార్తలు