'బీజేపీ అడుగడుగునా తెలంగాణకు అన్యాయం చేస్తోంది'

1 Nov, 2020 10:55 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట : గత ఆరేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడుగడుగునా తెలంగాణకు అన్యాయం చేస్తోందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు.  బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన తోట క‌మ‌లాక‌ర్ రెడ్డి ఆదివారం మంత్రి స‌మ‌క్షంలో టీఆర్ఎస్‌లో చేశారు. ఈ సంద‌ర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ.. 'బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి నిజాయతీ, చిత్తశుద్ధి ఉంటే ఈ 18 ప్రశ్నలకు సమాధానం చెప్పి బీజేపీ చిత్త శుద్ధిని నిరూపించుకోవాలి. బీజేపీ నాయకులకు నైతిక విలువలు ఉన్నాయా..?. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టులను రద్దు చేసి తీరని అన్యాయం చేసింది. మేం తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉంటాం. మీరు మాత్రం మా పల్లకి మోయాలన్నట్లు ఉన్నది బీజేపీ వైఖరి. వ్యక్తిగత ఘర్షణలు, దూషణలకు బీజేపీ నేతలు పాల్పడుతున్నారు. 

తెలంగాణ ఏర్పడగానే 7 మండలాలను ఆంధ్రలో కలిపింది అన్యాయం కాదా..?. సీలేరు పవర్ ప్రాజెక్టు ను ఆంధ్రలో కలపడం ద్వారా ఏటా 500 కోట్ల నష్టం మీ వల్ల కాదా..?. బయ్యారం, ఐటీఐఆర్ రద్దు చేసింది మీరు కాదా..?. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రద్దు మీ పాపం కాదా ?. నీటి కేటాయింపుల్లో అన్యాయం చేయడం లేదా ?. తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు ఎందుకు ఇవ్వరు. పోలవరంకు ఇచ్చి కాళేశ్వరానికి ఎందుకు ఇవ్వరు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సూచిస్తే ఎందుకు ఇవ్వలేదు.   (వారి తిప్పలన్నీ నాలుగు ఓట్ల కోసమే)

తెలంగాణకు 3,155 కిలోమీటర్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి 1,300 కే పరిమితం చేయలేదా..?. బీజేపీ ప్రభుత్వం వరంగల్ విమానాశ్రయాన్ని ఎందుకు పునరుద్దరించడం లేదు. దేశంలోని టెక్స్‌టైల్ పార్కులకు సాయం చేస్తున్న కేంద్రం వరంగల్ టెక్స్ టైల్ పార్కుకు ఎందుకు సాయం చేయదు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో అన్యాయం చేయడం లేదా..?. తెలంగాణలో జిల్లాకో నవోదయ పాఠశాలలు ఎందుకు ఇవ్వడం లేదు.  గంగ, నర్మదా నదుల ప్రక్షాళన చేస్తున్న కేంద్రం మూసి ప్రక్షాళనకు ఎందుకు నిధులు ఇవ్వదు. కేంద్రం నుంచి 12 వేల కోట్లు రావాల్సి ఉంది. అది ఎందుకు ఇవ్వరు. తెలంగాణ ప్రజలపై సంజయ్‌కి ప్రేమ ఉంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినవి సాధించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి' అంటూ 18 ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సమాధానం చెప్పాలని కోరారు. 

మరిన్ని వార్తలు