కాంగ్రెస్‌కు మరో సీనియర్ నేత గుడ్‍బై! బీజేపీ గూటికి కుల్‌దీప్ బిష్ణోయ్!

10 Jul, 2022 12:44 IST|Sakshi

హరియాణా కాంగ్రెస్ సీనియర్ నేత కుల్‌దీప్ బిష్ణోయ్‌ హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఆదివారం కలవడం చర్చనీయాంశమైంది.ఇప్పటికే కుల్‌దీప్‌ కమలం పార్టీలో చేరుతారనే ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో నడ్డాతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‍కు పాల్పడినందుకు కుల్‌దీప్‌ బిష్ణోయ్‌ను పార్టీలోని అన్ని పదవుల నుంచి కాంగ్రెస్ పార్టీ తొలగించింది.  ఆయన బీజేపీ మద్దతు తెలిపిన స్వతంత్ర అభ్యర్థి కార్తికేయ శర్మకు ఓటు వేసినందుకు ఈ నిర్ణయం తీసుకుంది. 

అయితే మాజీ సీఎం దీపిందర్ సింగ్ హుడా అనుచరుడిని హరియాణా కాంగ్రెస్ చీఫ్‌గా నియమించడంపై బిష్ణోయ్ అధిష్ఠానం పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి అజయ్ మాకెన్‌కు ఓటు వేయలేదు. తన మనస్సాక్షి చెప్పిన వ్యక్తికే ఓటు వేశానని ఎన్నికల అనంతరం ప్రకటించారు. అంతేకాదు పార్టీ తన ఒక్కడిపైనే చర్యలు తీసుకోవడాన్ని తప్పుబట్టారు. 2016లో కూడా  ఇలా జరిగిందని, కానీ పార్టీ అప్పుడు ఇంత వేగంగా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కొంతమంది వ్యక్తుల విషయంలో మాత్రమే చర్యలకు ఉపక్రమిస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు బిష్ణోయ్ తమ పార్టీలో చేరాలనుకుంటే కచ్చితంగా ఆహ్వానిస్తామని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు.


చదవండి: ఉద్ధవ్‌కు దెబ్బ మీద దెబ్బ .. ప్రశ్నార్థకంగా మారిన శివసేన పార్టీ మనుగడ  

మరిన్ని వార్తలు