కేంద్ర మంత్రి రాజీవ్‌చంద్రశేఖర్‌పై కేసు: మంత్రి కౌంటర్‌ ట్వీట్‌

31 Oct, 2023 13:00 IST|Sakshi

కేరళ వరుస పేలుళ్ల నేపథ్యంలో వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించేలా ప్రకటనలు చేశారన్న ఆరోపణలపై కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై కేసు నమోదైంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై మంగళవారం (అక్టోబర్ 31న) కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) డిజిటల్ మీడియా సెల్ కన్వీనర్ సరిన్ పి ఈ ఫిర్యాదులు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

సెక్షన్ 153 (ఉద్దేశంతో రెచ్చగొట్టడం) కింద ఎర్నాకుళం సెంట్రల్ పోలీస్ స్టేషన్‌లో మంత్రిపై రెండు ఎఫ్‌ఐఆర్‌లను  దాఖలు చేశారు. పాలస్తీనాకు  సీపీఎంతో మద్దతుతో కలమసేరి పేలుళ్లను ముడిపెట్టి, ద్వేషాన్ని వ్యాప్తి చేశారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన  మర్నాడు  ఈ పరిణామం చోటు చేసుకుంది. 

అటు పినరయి విజయన్ ప్రభుత్వం చర్యను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఈ కేసును రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటామని  పేర్కొంది.  విచ్ఛిన్నకర, అతివాద శక్తులను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని  బీజేపీ కేరళ చీఫ్ కె సురేంద్రన్ ఆరోపించారు. దేశాన్ని ప్రేమించే వారిని కాదని, దేశానికి వ్యతిరేకంగా ఉన్నవారిని ప్రసన్నం చేసుకునేందుకే కేంద్ర మంత్రిపై కేసు నమోదు చేశారని బీజేపీ నేత  ఆరోపించారు.

కేసుతో బెదిరించాలని చూస్తున్నారు
అటు తనపై నమోదైన కేసుపై రాజీవ్‌ చంద్రశేఖర్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు.  రాహుల్‌ గాంధీ, ఇండియా కూటమి  ఏకమై తనపై కేసు నమోదు చేశారని మండిపడ్డారు. హమాస్‌పై  వారి వైఖరిని బహిర్గతం చేసినందుకే ఈ కేసుతో బెదిరించాలని  చూస్తున్నారన్నారు.  SDPI, PFI,హమాస్ వంటి విషపూరిత రాడికల్ హింసాత్మక సంస్థలకు నిర్లజ్జగా మద్దతిస్తున్నాయనీ,  వీరి  బుజ్జగింపుల కారణంగా కొన్ని దశాబ్దాలుగా జమ్మూ కశ్మీర్‌, పంజాబ్‌ నుంచి కేరళ వరకు తీవ్రవాదానికి కారణమయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఫలితంగా  అనేక మంది అమాయక ప్రజలు, భద్రతా దళాలు  బలయ్యారంటూ ట్వీట్‌ చేశారు.

కాగా ఆదివారం నాటి వరుస పేలుళ్లపై స్పందించిన రాజీవ్‌ చంద్రశేఖర్‌​  సోషల్‌ మీడియా ద్వారా కేరళ సీఏంపై తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన ముఖ్యమంత్రి పినరయి నీచ సిగ్గుమాలిన బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారన్నారు.ఢిల్లీలో కూర్చొని ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ జిహాద్‌ కోసం బహిరంగ పిలుపులిస్తున్నటెర్రరిస్ట్‌ హమాస్‌ కేరళలో అమాయక క్రైస్తవులపై దాడులు, బాంబు పేలుళ్లకు కారణమవుతున్నారని ట్వీట్‌ చేశారు. దీంతో కేరళ సీఎం, కేంద్ర మంత్రి మధ్య మాటల  యుద్ధం జరిగింది. పచ్చి అబద్దాల  కోరు, తీవ్రమైన విషం చిమ్ముతున్నాడంటూ ముఖ్యమంత్రి రాజీవ్‌పై ధ్వజమెత్తారు. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర మంత్రులు అనే తేడా లేకుండా  చట్టాన్ని వ్యతిరేకంగా, విద్వేషంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని సీఎం చెప్పారు.

మరిన్ని వార్తలు