సీఎం కేసీఆర్‌కు మాజీ ప్రధాని ఫోన్‌.. రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌

15 Feb, 2022 19:56 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : బీజేపీపై ప్రతిపక్ష పార్టీల నేతలు, ప్రాంతీయ పార్టీల నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల నేతలు ఏకమవుతున్నారు. యుద్ధానికి సిద్ధమంటూ ముఖ్యమంత్రులు హెచ్చరికలు పంపుతున్నారు. గత కొన్ని రోజులుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు ముప్పెట దాడి చేస్తున్నారు. బీజేపీ పాలన, విధానాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సీఎం కేసీఆర్‌.. సెప్టెంబరు 2019లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్‌పై కేంద్ర ప్రభుత్వం నుంచి రుజువు కోరిన విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం భారత మాజీ ప్రధాని, హెచ్‌డీ దేవెగౌడ.. సీఎం కేసీఆర్‌కు ఫోన్‌ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  

ఈ క్రమంలోనే కేసీఆర్‌ మీకు అభినందనలు.. మీరు పెద్ద యుద్ధానికి దిగారు. ఈ యుద్ధంలో మేమంతా మీకు తోడుగా ఉన్నాం. మనమంతా మతతత్వ శక్తుల నుంచి దేశాన్ని రక్షించాలని సీఎంకు దేవెగౌడ చెప్పినట్టు తెలంగాణ సీఎం కార్యాలయం ట్విట్టర్‌ వేదికగా తెలిపింది. అయితే, కేంద్రంపై కేసీఆర్‌ ఆరోపణలు చేసిన మరుసటి రోజే మాజీ ప్రధాని ఆయనకు ఫోన్‌ చేయడం రాజకీయంగా చర్చకు దారితీసింది. 

అంతకు ముందు సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సర్జికల్ స్ట్రైక్స్ పై నరేంద్ర మోదీ ప్రభుత‍్వం తప్పడు ప్రచారం చేస్తోందన్నారు. అందుకే తాను, ప్రజలు రుజువులు అడుగున్నారని పేర్కొన్నారు. సరిహద్దుల్లో ఆర్మీ జవాన్‌ చనిపోతే ఆ క్రెడిట్‌ భారత ఆర్మీకి వెళ్లాలి కానీ.. బీజేపీకి కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంలోనే కర్నాటకలో హిజాబ్‌ వివాదంపై సీఎం కేసీఆర్‌.. ప్రధాని మోదీ, బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. హిజాబ్ వివాదాన్ని రేకెత్తించి కర్నాటకలోని మహిళలు, బాలికలను వేధిస్తూ..‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’ను ‘కాశ్మీర్ వ్యాలీ’గా మార్చారని విమర్శించారు. 

ఇదిలా ఉండగా బీజేపీపై పోరుకు ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమ్మేళనాన్ని హైదరాబాద్‌లో నిర్వహించేందుకు కేసీఆర్ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌, కేసీఆర్‌ ఇప్పటికే ఫోన్‌లో మాట్లాడుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు