కాంగ్రెస్‌పై కుమారస్వామి ఫైర్‌

15 Oct, 2020 08:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో గతంలో భాగస్వామ్య పక్షాలుగా వ్యవహరించిన జేడీఎస్‌, కాంగ్రెస్‌లు కత్తులు దూస్తున్నాయి. బెంగళూర్‌లోని రాజరాజేశ్వరినగర్‌ అసెంబ్లీ స్ధానానికి ఇరు పార్టీలు అభ్యర్దులను బరిలో దింపి పరస్పర ఆరోపణలకు దిగాయి. ఇటీవలి బెంగళూరు అల్లర్లను ప్రస్తావిస్తూ జేడీఎస్‌ చీఫ్‌, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ పార్టీతో బెంగళూర్‌లో భద్రత కరవవుతుందని వ్యాఖ్యానించారు. బెంగళూర్‌ అల్లర్లపై బీజేపీ సైతం కాంగ్రెస్‌ లక్ష్యంగా విమర్శలతో విరుచుకుపడుతున్న క్రమంలో కుమారస్వామి సైతం కాంగ్రెస్‌ లక్ష్యంగా విమర్శల దాడి పెంచారు.

పార్టీ అభ్యర్థి వి కృష్ణమూర్తి నామినేషన్‌ వేసిన అనంతరం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ బెంగళూరు అల్లర్ల వెనుక ఏం జరిగిందో ఇప్పుడు వెల్లడవుతోందని అన్నారు. రాష్ట్ర పౌరులను కాంగ్రెస్‌ నేతలు కాపాడలేరని, బెంగళూర్‌ దాడులకు వారే కుట్రదారులని కుమారస్వామి కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ చేతిలో బెంళూర్‌ నగర ప్రజలు సురక్షితంగా ఉండలేరని ఈ ఎన్నికల్లో ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారని అన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ సైతం ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కుసుమను పార్టీ అభ్యర్ధిగా బరిలో దింపి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. చదవండి : శివకుమార్‌పై సీబీఐ కేసు

బెంగళూర్‌ అల్లర్లు పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు.ఇక  ప్రత్యర్ధులైన జేడీఎస్‌, కాంగ్రెస్‌లు 2018లో కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి రాకుండా నిరోధించేందుకు విభేదాలను పక్కనపెట్టి జట్టుకట్టాయి. ఆపై పలువురు ఎమ్మెల్యేలు సంకీర్ణ సర్కార్‌ను వీడటంతో యడ్యూరప్స సారథ్యంలో బీజేపీ సర్కార్‌ కొలువుతీరింది. తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేసి ప్రభుత్వాన్ని కూల్చివేసిందని అప్పట్లో జేడీఎస్‌, కాంగ్రెస్‌లు కాషాయ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు.

మరిన్ని వార్తలు