Himachal Pradesh Election 2022: మంచుకొండల్లో ఎన్నికల వేడి

17 Oct, 2022 04:23 IST|Sakshi

హిమాచల్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ నువ్వా నేనా!

హిమాచల్‌ప్రదేశ్‌. పర్యాటకులకు స్వర్గధామం. సాహస క్రీడలకు కేరాఫ్‌ అడ్రస్‌. రాష్ట్రంలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల క్రీడ కూడా ఉత్కంఠ రేపుతోంది. మంచుకొండల్లో రాజకీయ వేడి రాజేస్తోంది. దశాబ్దాలుగా ఏ పార్టీకి వరుసగా రెండోసారి అధికారం కట్టబెట్టని హిమాచల్‌ ఓటర్ల నాడి తెలుసుకోవడం ఈసారి కష్టంగా మారింది. ఆప్‌ రంగప్రవేశంతో ఓట్లు చీలి బీజేపీ అధికారం నిలబెట్టుకుని చరిత్ర సృష్టిస్తుందా, ఉప ఎన్నికల విజయోత్సాహాన్ని కాంగ్రెస్‌ కొనసాగిస్తుందా అన్నది ఆసక్తి పెంచుతోంది...

హిమాచల్‌ ప్రదేశ్‌తో దేశంలో ఎన్నికల జాతర ప్రారంభం కానుంది. ఇప్పటికే షెడ్యూల్‌ రావడంతో ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెట్టాయి. 68 అసెంబ్లీ స్థానాలున్న అసెంబ్లీకి నవంబర్‌ 6న పోలింగ్‌ జరగనుంది. డిసెంబర్‌ 8న ఫలితాలు వెలువడతాయి. చిన్న రాష్ట్రమే అయినా ప్రతి ఐదేళ్లకూ ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం 40 ఏళ్లుగా కొనసాగుతున్నందున ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. 2017లో 44 సీట్లు నెగ్గిన బీజేపీ అధికార వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.

ఉప ఎన్నికలతో మారిన రాజకీయం
గతేడాది రాష్ట్రంలో ఒక లోక్‌సభ, మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ క్లీన్‌ స్వీప్‌ చేయడంతో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలి అప్పటి నుంచి బీజేపీ అగ్ర నాయకత్వం రాష్ట్రంపై బాగా దృష్టి సారించింది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తరచూ రాష్ట్రంలో పర్యటిస్తూ అ«భివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. మనాలి–లేహ్‌లను కలిపే అటల్‌ టన్నల్‌ ప్రారంభంతో ప్రజల ఇబ్బందులు ఎంత తొలిగిపోయాయో విస్తృతంగా ప్రచా రం చేస్తున్నారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ నినాదాన్ని ప్రధానాస్త్రంగా మలచుకున్నారు. సీఎం జైరాం ఠాకూర్‌ కూడా నెల రోజుల్లోనే ఏకంగా రూ.4,000 కోట్లకు పైగా ప్రాజెక్టులు ప్రారంభించారు.

నిరుద్యోగమే ఎన్నికలాంశం
నిరుద్యోగమే ఈ ఎన్నికల్లో ప్రధానాంశం కానుంది. బీజేపీకి ఇదే సవాలుగా మారుతోంది. రాష్ట్రంలో 15 లక్షల నిరుద్యోగులున్నారు. వారికి ఉపాధి కల్పనలో బీజేపీ విఫలమైందంటూ కాంగ్రెస్‌ దుయ్యబడుతోంది. ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు కూడా ప్రచారాంశంగా మారుతున్నాయి. అయితే మాజీ సీఎం వీరభద్ర సింగ్‌ మరణంతో కాంగ్రెస్‌ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. ఆయన భార్య ప్రతిభా సింగ్‌ మండి ఎంపీగా, కుమారుడు విక్రమాదిత్యసింగ్‌ సిమ్లా రూరల్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రలో ఉండటంతో ప్రచార బాధ్యతలు ప్రియాంక గాంధీ చూస్తున్నారు.

ఆప్‌కి చోటుందా?  
ఆమ్‌ ఆద్మీ పార్టీ హిమాచల్‌లోనూ అడుగు పెట్టాలని వ్యూహాలు పన్నుతోంది. ఢిల్లీ మోడల్, పంజాబ్‌ ఫలితాలు ఇక్కడా ప్రభావం చూపుతాయని ఆశ పడుతోంది. కానీ రాష్ట్రంలో మూడో పార్టీకి ప్రజల్లో ఆదరణ కనిపించలేదు. 2012లో బీజేపీ రెబెల్‌ నేతలు హిమాచల్‌ లోక్‌హిత్‌ పార్టీ పెట్టి ఊపు ఊపినా ఎన్నికల్లో దానికి 4 శాతం ఓట్లే వచ్చాయి. ఈసారి ఆప్‌కు 6 శాతం దాకా ఓట్లు రావచ్చని సర్వేల్లో తేలింది. ఆప్‌ చివరికి కాంగ్రెస్‌ ఓట్లను చీల్చి బీజేపీ లాభపడుతుందన్న విశ్లేషణలూ ఉన్నాయి. అదే జరిగితే 1985 తర్వాత రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకున్న తొలి పార్టీగా బీజేపీ చరిత్ర సృష్టిస్తుంది.                        

రెండు పార్టీలు–రెండు కుటుంబాలు  
హిమాచల్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ముఖాముఖి పోరు జరుగుతుంది. జనాభాలో 33 శాతమున్న రాజ్‌పుత్‌లు, 18 శాతమున్న బ్రాహ్మణులే రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నారు. 25% ఉన్న దళిత, 14 శాతమున్న ఓబీసీ ఓట్లు కూడా కీలకమే. అగ్రవర్ణాలు కాస్త బీజేపీ వైపు మొగ్గితే ఇతర కులాలు కాంగ్రెస్‌కు అండగా ఉంటున్నాయి. అలా రెండు పార్టీలూ చెరో ఐదేళ్లు అధికారాన్ని పంచుకుంటూ వస్తున్నాయి. గతేడాది మరణించిన కాంగ్రెస్‌ మాజీ సీఎం వీరభద్ర సింగ్‌ కుటుంబం, బీజేపీకి చెందిన ప్రేమ్‌కుమార్‌ ధుమాల్‌ కుటుంబం కొన్నేళ్లుగా రాష్ట్ర రాజకీయాలపై పట్టు చూపిస్తున్నాయి. 2017 ఎన్నికల్లో ధుమాల్‌ ఓడినా ఆయన కుమారుడు అనురాగ్‌ ఠాకూర్‌ కేంద్ర మంత్రిగా కీలకంగా ఉన్నారు. ఈసారి బీజేపీ గెలిస్తే సీఎం రేసులో కూడా ఉన్నారు.  

  –సాక్షి, నేషనల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు