మోదీతో 25 ఏళ్ల పరిచయం.. అయినా వెనక్కి తగ్గను

9 Nov, 2022 17:59 IST|Sakshi

సిమ్లా: ప్రధాని స్వయంగా ఫోన్‌ చేసినా వెనక్కి తగ్గేది లేదని తెగేసి చెప్పారు బీజేపీ మాజీ ఎంపీ కృపాల్ పర్మార్. హిమచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఫతేపూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. బీజేపీ తనకు టికెట్‌ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. 

గతేడాది జరిగిన ఫతేపూర్‌ ఉప ఎన్నికలో తనకు అవకాశం ఇవ్వకపోవడంతో అప్పటి నుంచి ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాజా ఎన్నికల్లోనూ మొండిచేయి చూపడంతో తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ‘నేను పోటీలో ఉన్నాను. బీజేపీ అధికారిక అభ్యర్థిని కాదు. ఇది నాకు, కాంగ్రెస్ అభ్యర్థికి మధ్య జరుగుతున్న పోటీ​’ అని వ్యాఖ్యానించారు. 

తనకు టికెట్‌ రాకపోవడానికి పాఠశాలలో తనతో కలిసి చదువుకున్న ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కారణమని పర్మార్‌ ఆరోపించారు. 15 ఏళ్లుగా తనను నడ్డా అవమానిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీతో చెప్పినట్టు వెల్లడించారు. పర్మార్‌తో ఫోన్‌లో మోదీ మాట్లాడిన ఆడియో కాల్‌ వైరల్‌ అయింది. ఈ ఫోన్‌ కాల్‌ను బీజేపీ, ప్రధాని కార్యాలయం ధ్రువీకరించలేదు. 

అక్టోబర్‌ 30న తనకు ప్రధాని మోదీ ఫోన్‌ చేశారని కృపాల్ పర్మార్ వెల్లడించారు. ‘మోదీతో 25 ఏళ్లుగా పరిచయం ఉంది. హిమచల్‌ప్రదేశ్‌ ఇన్‌ఛార్జ్‌గా ఆయన ఉన్నప్పుడు, నేను ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. మేమిద్దరం కలిసి రాష్ట్రమంతా పర్యటించాం. ఆయనతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. మోదీని నేను దేవుడిగా భావిస్తాను. స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నానని ఆయనతో చెప్పాను. ఒక్కరోజు ముందుగా ఫోన్‌ చేసినా పోటీ నుంచి తప్పుకునే వాడినని ఆయనతో చెప్పాన’ని 63 ఏళ్ల పర్మార్‌ వివరించారు. 

68 స్థానాలున్న హిమచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీకి నవంబర్‌ 12న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్‌ 8న ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీకి రెబల్స్‌ బెడద ఎక్కువగా ఉంది. దాదాపు 30 మంది తిరుగుబాటు అభ్యర్థులు బరిలో ఉన్నారు. (క్లిక్: అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆమే' కీలకం.. హామీల వర్షం కురిపిస్తున్న పార్టీలు)

మరిన్ని వార్తలు