బీజేపీని ఓడిద్దాం రండి

4 Sep, 2022 05:25 IST|Sakshi

ప్రతిపక్షాలకు బిహార్‌ సీఎం నితీశ్‌ పిలుపు

విభేదాలు పక్కనపెట్టి చేతులు కలపాలి  

దేశ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు  

ప్రతిపక్షాల ఐక్యత కోసం పనిచేయడమే లక్ష్యమని వెల్లడి

పట్నా:  కేంద్రంలో బీజేపీని ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ ఒక్కటి కావాలని జనతాదళ్‌(యునైటెడ్‌) సీనియర్‌ నాయకుడు, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. దేశ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. పార్టీలన్నీ తమ మధ్యనున్న విభేదాలను పక్కనపెట్టి, ప్రజా సంక్షేమం కోసం చేతులు కలపాలని అన్నారు. శనివారం బిహార్‌ రాజధాని పాట్నాలో జేడీ(యూ) జాతీయ కార్యవర్గ సమావేశంలో నితీశ్‌ ప్రసంగించారు.

ప్రతిపక్షాల ఐక్యత కోసం పనిచేయాలన్నదే తన ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. బీజేపీయేతర పార్టీలను ఉమ్మడి వేదికపైకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు. విపక్షాలన్నీ కలిసి పోరాడితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని కేవలం 50 సీట్లకే పరిమితం చేయొచ్చని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేయాల్సిన బాధ్యతను నితీశ్‌కు అప్పగిస్తూ జేడీ(యూ) జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

అలాగే కాషాయ పార్టీ పాలనలో దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందని, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ప్రభుత్వ విధానాలు నచ్చకపోతే అసమ్మతి తెలియజేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని తీర్మానంలో ఉద్ఘాటించారు. అసమ్మతి తెలిపినవారిపై దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారని విమర్శించారు. మతోన్మాద బీజేపీకి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘‘మైనార్టీలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సమాజంలో అసహనం, తీవ్రవాదం పెరిగిపోతున్నాయి. దళితులు, గిరిజనులు వేధింపులకు గురవుతున్నారు’’ అని జేడీ(యూ)  ఆందోళన వ్యక్తం చేసింది.
 

మోదీకి ప్రత్యామ్నాయం నితీశ్‌
జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ నేతగా బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ను తెరపైకి తీసుకొచ్చేందుకు బిహార్‌లో అధికార కూటమిలోని జేడీ(యూ) ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. పార్టీ జాతీయ కార్యవర్గ, జాతీయ మండలి సమావేశాలు శనివారం పాట్నాలో ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరుగున్న ఈ భేటీల్లో తొలిరోజు కీలక అంశాలపై చర్చించారు. నితీశ్‌ను ప్రధాని అభ్యర్థిగా అభివర్ణిస్తూ వేదిక వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘దేశ్‌ కా నేత కైసా హో.. నితీశ్‌ కుమార్‌ జైసా హో’ అంటూ జేడీ(యూ) కార్యకర్తలు నినదించారు.

రేపటి నుంచి నితీశ్‌ ఢిల్లీ పర్యటన!  
2024 ఎన్నికల్లో బీజేపీ ఢీకొట్టడానికి విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా నితీశ్‌ ఈ నెల 5 నుంచి మూడు రోజులపాటు ఢిల్లీలో పర్యటించే అవకాశముంది. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సహా విపక్ష నాయకులతో ఆయన భేటీ కానున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రివాల్, హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్‌ చౌతాలాతోపాటు కమ్యూనిస్ట్‌ నేతలతోనూ ఆయన సమావేశమవుతారని జేడీ(యూ) వర్గాలు తెలిపాయి. బిహార్‌లో బీజేపీతో తెగతెంపుల తర్వాత నితీశ్‌కు ఇదే తొలి ఢిల్లీ పర్యటన.
మణిపూర్‌లో జేడీ(యూ)కు షాక్‌

బీజేపీలోకి ఐదుగురు ఎమ్మెల్యేలు జంప్‌  
పట్నా/ఇంఫాల్‌:  జేడీ(యూ)కు మణిపూర్‌లో పెద్ద షాక్‌ తగిలింది. ఆరుగురు ఎమ్మెల్యేలకు గాను, ఏకంగా ఐదుగురు శుక్రవారం అధికార బీజేపీలో చేరారు. వారి విలీనానికి స్పీకర్‌ ఆమోదం కూడా తెలిపారని అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. ఆ ఎమ్మెల్యేలకు సాదర స్వాగతం పలుకుతున్నట్టు ముఖ్యమంత్రి ఎన్‌.బీరేన్‌ సింగ్, బీజేపీ రాష్ట్ర చీఫ్‌ ఎన్‌.శారదాదేవి సాదర పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలో విందు కార్యక్రమంలో సదరు ఎమ్మెలోయేలతో వారు భేటీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పట్ల ప్రజల విశ్వాసానికి, ప్రేమకు ఎమ్మెల్యేల చేరిక సూచిక అని బీరేన్‌సింగ్‌ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. 60 సీట్లున్న మణిపూర్‌ అసెంబ్లీలో తాజా చేరికలతో బీజేపీ బలం 37కు పెరిగింది.

ఎమ్మెల్యేలను కొనడమే పనా: నితీశ్‌
తాజా పరిణామాలపై జేడీ(యూ) నేత, బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొనేయడం రాజ్యాంగబద్ధమేనా అని బీజేపీని నిలదీశారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బుట్టలో వేసుకోవడమే పనిగా పెట్టుకుందని బీజేపీపై ధ్వజమెత్తారు. 2024 ఎన్నికల్లో అన్ని పార్టీలూ బీజేపీకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. బీజేపీలో చేరిన తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మణిపూర్‌ జేడీ(యూ) అధ్యక్షుడు కుశ్‌ బీరేన్‌ చెప్పారు. వారి తీరు రాజ్యాంగ ఉల్లంఘనే అన్నారు.

మరిన్ని వార్తలు