ఐప్యాక్‌ నివేదిక.. దిద్దుబాటు చర్యలపై టీఆర్‌ఎస్‌ ఫోకస్‌.. ‘సోషల్‌’గా వెళ్లాల్సిందే!

14 Aug, 2022 02:24 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా వారియర్లకు శిక్షణ

119 నియోజకవర్గాల నుంచి ఒక్కో ప్రతినిధి హాజరు

పార్టీ సోషల్‌ మీడియా విభాగాన్ని బలోపేతం చేసేందుకు కసరత్తు

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ అనుబంధ సోషల్‌ మీడియా విభాగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ కసరత్తు చేస్తోంది. ఇందులోభాగంగా కరడుగట్టిన సోషల్‌ మీడియా వారియర్స్‌ (సామాజిక మాధ్యమ ప్రచారకర్తలు)ను తయారు చేసుకోవడంపై దృష్టిపెట్టింది. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో సోషల్‌ మీడియా వేదికల ద్వారా చాపకింద నీరులాగా బీజేపీ చేసిన ప్రచారం నష్టం కలిగించిందని ఐప్యాక్‌ బృందం గతంలోనే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు నివేదించింది. టీఆర్‌ఎస్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రతికూల ప్రభావంపై అంచనాకు వచ్చిన టీఆర్‌ఎస్‌ కొంతకాలంగా దిద్దుబాటు చర్యలపై కసరత్తు చేపట్టింది.

ఈక్రమంలో శనివారం హైదరాబాద్‌లో సోషల్‌ మీడియా వారియర్లకు ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఒక్కో ప్రతినిధి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పార్టీ సోషల్‌ మీడియా రాష్ట్ర కన్వీనర్లు మన్నె క్రిషాంక్, వై.సతీష్‌రెడ్డి, పాటిమీది జగన్మోహన్‌రావు, దినేశ్‌ చౌదరితోపాటు ఐప్యాక్‌ బృందం సభ్యులు ఈ శిబిరంలో ప్రసంగించారు. బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలు, సంస్థలు, వ్యక్తులు టీఆర్‌ఎస్‌పై చేస్తున్న ప్రతికూల ప్రచార సరళి తదితరాలపై శిక్షణ ఇచ్చారు. 

కింది స్థాయి వరకు వెళ్లాలి
అంతర్జాతీయ స్థాయి నుంచి గ్రామస్థాయి దాకా జరిగే ప్రతీ అంశాన్ని ప్రధాని మోదీ, బీజేపీ ఘనతగా చాటేందుకు లేదా విపక్షాల వైఫల్యంగా చిత్రీకరించేందుకు ఆ పార్టీ సోషల్‌ మీడియా విభాగం సృష్టిస్తున్న పోస్టులపై ఈ శిబిరంలో విశ్లేషించారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో బీజేపీ వారియర్స్‌ ఏ తరహా గ్రూప్‌లు, ఖాతాలను సృష్టిస్తున్నారు, వాటి ద్వారా ఏ తరహా కంటెంట్‌ను తయారు చేస్తున్నారనే అంశాలపై చర్చించారు.

కాంగ్రెస్‌ చేసే విమర్శలను తిప్పికొట్టడంతోపాటు బీజేపీ సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా జరుగుతున్న అవాస్తవ ప్రచారాన్ని ఎదుర్కోవడంపై పలు సూచనలు చేశారు. పార్టీ సోషల్‌ మీడియా విభాగం నుంచి వచ్చే కంటెంట్‌ను కింది స్థాయి వరకు వెళ్లేలా చూడాలని ఆదేశించారు. దుబ్బాక, హుజూరాబాద్‌ తరహాలో మునుగోడు ఉపఎన్నికలోనూ టీఆర్‌ఎస్‌ లక్ష్యంగా ప్రతికూల ప్రచారం పెద్దఎత్తున జరిగే అవకాశమున్నందున.. దాన్ని తిప్పికొట్టడంలో అలసత్వం వహించరాదన్నారు. తెలంగాణపై పూర్తి పేటెంట్‌ టీఆర్‌ఎస్‌దే అనే కోణంలో గట్టిగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. నెలాఖరులోగా అన్ని జిల్లాల్లోనూ శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
చదవండి: 50 మంది ఎమ్మెల్యేలు  రాజీనామాకు సిద్ధం

మరిన్ని వార్తలు