తెలంగాణలో బలమెంత?.. పవన్‌ ప్రకటనలు వింటే ఏమనిపిస్తుందంటే..

25 Jan, 2023 11:07 IST|Sakshi

వెనుకటికి ఒక సామెత ఉంది. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానందట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు అలాగే ఉంది. ఆయన కార్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్. ఆయన ఇచ్చే నినాదం జై తెలంగాణ. ఏపీలో గత ఎన్నికలలో జనసేన సాధించింది ఒక సీటు. స్వయంగా ఆయనే పోటీ చేసి రెండు చోట్ల ఓటమి చెందారు. కాని ఇప్పుడు తెలంగాణ శాసనసభలో పది సీట్లలో జనసేన గెలవాలని ఆయన చెబుతున్నారు. ఏడు నుంచి పద్నాలుగు ఎంపీ సీట్లలో, 25 నుంచి నలభై అసెంబ్లీ సీట్లలో  పోటీ చేస్తారట. ఏపీలో కన్నా తెలంగాణలో పాలన బెటర్‌గా ఉందట. బీజేపీతో తెలంగాణలో పొత్తు ఉండదట .కాని మద్దతు ఇస్తారట. ఎవరైనా ముందుకు వస్తే తెలంగాణలో పొత్తు పెట్టుకుంటారట.

ఈ ప్రకటనలు వింటే ఏమనిపిస్తుంది. పవన్ కళ్యాణ్‌లో  రాజకీయ పరిజ్ఞానం శూన్యం అని అనిపించదా! జనసేన తెలంగాణలో పోటీ చేయదలిస్తే ఇక్కడ ఏమి చేయదలిచిందో, ఇక్కడి ప్రభుత్వం ఎలా ఉందో, ఎందుకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌కు ఓటు వేయరాదో చెప్పాలి కదా! ఊహూ! తెలంగాణలో కూడా ఏపీ ప్రభుత్వంపైనే విమర్శ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, బీఆర్ఎస్‌ పైన విమర్శలు చేయాలంటే పవన్ కళ్యాణ్ గడగడలాడుతున్నారన్న సందేహం రాదా!

ఆయన మిత్ర పక్షమైన బీజేపీ తెలంగాణలో కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పైన తీవ్ర విమర్శలు చేస్తుంటే పవన్ కల్యాణ్ మాత్రం పాలనకు సర్టిఫికెట్ ఇస్తున్నారు. మంచిదే. నిజంగా ఆయన నమ్మి అలాగే భావిస్తే తెలంగాణలో బీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తున్నానని చెప్పవచ్చు. ఆ మాట కూడా అనలేదు. తెలంగాణలో సొంతంగా అయినా పోటీ చేయడానికి రెడీ అవుతారట. ఈయనకు ఉన్న బలం ఎంత? అసలు ఈయనకు ఉన్న లోకల్ స్టాండింగ్ ఎంత అన్న ప్రశ్నలు వస్తాయి.

టీడీపీతో పొత్తు కుదిరితే బహుశా 20 నుంచి 30 సీట్లతో సరిపెట్టుకోవడానికి పవన్ అంగీకరించవచ్చన్న భావన ఉంది. ఏపీలోనే ఆ పరిస్థితి ఉంటే తెలంగాణలో నలభై సీట్లలో పోటీచేస్తామని చెప్పి ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు! గతంలో  కేసీఆర్, కవిత వంటి నేతలు పవన్ పై చేసిన ఘాటైన విమర్శలను గుర్తుకు తెచ్చుకుని ఉండవచ్చు. అందుకే వారి జోలికి వెళ్లకుండా పవన్ జాగ్రత్తపడ్డారనుకోవాలి. ఏపీలో కులాల గీతల మధ్య పనిచేయవలసి వస్తోందని ఆయన చెప్పారు.ఇందులో ఆయన బాధ్యత లేదా!

కులాల గురించి ఒక్కోసారి ఒక్కో రకంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సుద్దులు చెబితే ఎవరు నమ్ముతారు! తెలంగాణ నుంచి స్పూర్తి పొందితే ఇక్కడ రాజకీయం చేయకుండా ఏపీకి ఎందుకు వెళుతున్నట్లు? అక్కడ అశాంతి సృష్టించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నట్లు! చెప్పులు చూపడం గొప్ప అనుకుంటున్నారు. పైగా తెలంగాణ స్పూర్తి అని ఇక్కడ సెంటిమెంట్‌ను కూడా ఆయన అగౌరవవరుస్తున్నారు. ఇదంతా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేయమన్నట్లే చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.

కొంతకాలం క్రితం చంద్రబాబు తెలంగాణలో ఒక సభ పెట్టి తనకు బలం ఉందని చెప్పుకునే యత్నం చేశారు. అయినా బీజేపీ మనసు కరగలేదు. దాంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ను ప్రయోగించినట్లుగా ఉంది. పవన్ వచ్చి బీజేపీని, బిఆర్ఎస్‌ను, చివరికి కాంగ్రెస్‌ను కూడా విమర్శించకుండా వైసీపీని విమర్శించడం ద్వారా అచ్చం చంద్రబాబులాగే వ్యవహరించారని అర్దం అవుతుంది.

ఇదంతా బీజేపీని బ్లాక్ మెయిల్ చేయడానికి చంద్రబాబు, పవన్‌లు కలిసి చేస్తున్న ప్రయత్నంగా ఎవరైనా అనుకుంటే తప్పు ఏమి ఉంటుంది! తెలంగాణలో తమకు బలం ఉందని, ఇక్కడ తమ మద్దతు పొందాలంటే ఏపీలో టీడీపీతో కలవాలని పరోక్షంగా చెబుతున్నారు. ఈ విషయాలు బీజేపీకి తెలియనివి కావు. అందుకే టీడీపీతో ఉన్న చేదు అనుభవం, చంద్రబాబు చేసిన పరాభవం అన్నిటిని మర్చిపోలేని బీజేపీ ఆ పార్టీతో పొత్తుకు సిద్దపడడం లేదు. అయినా పవన్ కళ్యాణ్ తన వంతు ప్రయత్నం మానడం లేదు.

ఒక పక్క ఓట్లు చీలనివ్వను అని ఏపీ గురించి చెబుతున్నారు. మరో పక్క పొత్తు కుదరకపోతే ఒంటరిగా పోటీ చేస్తానంటున్నారు. ఆయన కావాలని గందరగోళంగా మాట్లాడుతున్నారా! లేక ఆయనలోని అయోమయం అలా మాట్లాడిస్తోందా అన్న సంగతి తెలియదు. తెలంగాణ తనకు పునర్జన్మ ఇచ్చిందని చెబుతున్న ఆయన, జై తెలంగాణ అంటున్న ఆయన ఎప్పుడైనా జై ఆంధ్రప్రదేశ్ అని అన్నారా?పైగా ఏపీపై విద్వేషాన్ని వెదజల్లుతున్నారు. అక్కడ ఈయనకు తిరిగే స్వేచ్చ ఇవ్వలేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే రణస్థలంలో బహిరంగ సభ నిర్వహించి మరోసారి చెప్పుచూపుతానని హెచ్చరించారు.

ఆయనకు ఎంత వాక్ స్వాతంత్రం అనుభవించకపోతే ముఖ్యమంత్రి జగన్‌ను, అధికార వైసీపీపై తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు. తనను ఏపీలో రెండు చోట్ల ఓడించారన్న కోపంతో పవన్ కళ్యాణ్ ఏదేదో చేస్తున్నారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పిన ఆయన 2014 నుంచి 2019 మధ్య ఆ పని చేయకపోగా, ఇప్పుడు ఏపీలో వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతుంటే ఓర్వలేకపోతున్నారు.
చదవండి: అక్షరక్షరంలో పైత్యం నిండిన రాతలు.. మీ బాబూ మళ్లించారు రామోజీ!

నిర్మాణాత్మక విమర్శలు చేయలేకపోతున్నారు. అధమ స్థాయిలో విమర్శలకు దిగి ప్రజలను రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారు. అయినా ఇవేవి పని చేస్తాయన్న నమ్మకం లేదు. అందుకే ప్రస్తుతం నరసింహస్వామి క్షేత్రాలను సందర్శిస్తున్నారట.ఇందుకు కూడా తెలంగాణలోని ఆలయాలతోనే పర్యటన ఆరంభించారు. ఓట్లు ఏమో ఆంధ్రవారివి కావాలి. భక్తి మాత్రం తెలంగాణ మీద చూపుతున్నారు.ఈ విషయాన్ని ప్రజలు గమనించలేరని అనుకుంటే పవన్ కళ్యాణ్ భ్రమపడుతున్నట్లే!
-హితైషి 

మరిన్ని వార్తలు