హస్తం నేతలు అవకాశాన్ని వాడుకుంటారా? ఆధిపత్య పోరాటాలతో జార విడుచుకుంటారా?

24 Dec, 2022 12:46 IST|Sakshi

వార్ రూమ్ ఇష్యూ టీ.కాంగ్రెస్‌కు మేలు చేస్తుందా? కీడు చేస్తుందా? వార్ రూమ్‌లో సోదాలు చేసి తెలంగాణ సర్కార్‌... కాంగ్రెస్‌కు ఆయుధం తానే ఇచ్చిందా? వచ్చిన ఆయుధాన్ని హస్తం పార్టీ నేతలు వాడుకుంటారా? తమ ఆధిపత్య పోరాటాలతో జార విడుచుకుంటారా? వార్ రూమ్‌ ఆందోళనలో టీ.కాంగ్రెస్ నేతలంతా ఎందుకు పాల్గొనలేదు?

చేయి కాలుతూనే ఉంది
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటినుంచీ తెలంగాణ కాంగ్రెస్‌కు సానుకూలంగా వార్తలు రావడం అరుదైన అంశంగా మారిపోయింది. పార్టీ బాగు మరచి కొట్టుకుంటున్న నాయకులు..ఒకరిపై ఒకరు ఫిర్యాదులు..మీడియాలో ఒకరి మీద ఒకరి విమర్శలతో గాంధీభవన్‌ హోరెత్తిపోయేది. గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోవడం.. రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా నియమిస్తే వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేయడం వంటి ఎన్నో అంశాలు తెలంగాణ కాంగ్రెస్‌కు నెగిటివ్‌గా మారాయి. కొంతకాలం నుంచి కారు, కమలం పార్టీల మధ్య నడుస్తున్న వార్‌..రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అన్న సందేహాన్ని కూడా ప్రజల్లో కలిగిస్తోంది.

అయితే రేవంత్‌ రెడ్డి పీసీసీ చీఫ్‌గా వచ్చాక పార్టీ వ్యూహకర్తగా సునీల్ కనుగోలును నియమించుకున్నారు. సునీల్ టీమ్‌ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ సైబరాబాద్‌ పోలీసులు ఆయన కార్యాలయం అయిన కాంగ్రెస్ వార్‌ రూమ్‌ మీద దాడి చేసి కంప్యూటర్లు, హార్డ్‌ డిస్క్‌లు స్వాధీనం చేసుకుని అక్కడి సిబ్బందిని అరెస్ట్‌ చేశారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ భగ్గుమంది. రాష్ట్ర మంతా కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకోలు, ధర్నాలు చేశారు.

ఒక్క రోజే హడావిడా?
పార్టీ వ్యూహకర్తగా పనిచేస్తున్న సునీల్‌ కనుగోలు కార్యాలయంపై పోలీసుల దాడిని టీ.కాంగ్రెస్ సకాలంలో సక్రమంగానే ఉపయోగించుకోగలిగింది. అందివచ్చిన అవకాశాన్ని జార విడుచుకోకూడదనే యాంగిల్‌లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు నాయకులు. దాడి జరిగిన రోజు రాత్రంతా సునీల్ ఆఫీస్ లో షబ్బీర్ అలీ, మల్లురవి, హైదరాబాద్ నగర నాయకులు పోలీసుల తీరుపై ఆందోళన చేసారు. బుధవారం ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలతో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. చాలా కాలంగా మీడియాలో పాజిటివ్‌ వార్తలే లేని కాంగ్రెస్‌ పార్టీకి ఈ అంశం బాగా ఉపయోగపడింది. ఆ రోజంతా మీడియాలో కాంగ్రెస్ నిర్వహించిన నిరసన వార్తలు కనిపించాయి.

ఇంట్లోనే పెద్ద వార్‌
ఇక కొందరు నేతలు మినహా మిగతా వారంతా కాంగ్రెస్ వార్ రూమ్‌లో పోలీసుల సోదాలను తీవ్రంగా ఖండించారు. జగ్గారెడ్డి లాంటి నేతలు బయటకు వచ్చి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అప్పటి వరకు కమిటీల ఏర్పాటు గురించి పార్టీలో రచ్చ జరుగుతున్న నేపథ్యంలో సునీల్ అంశం తెరపైకి వచ్చి కాంగ్రెస్‌కు మేలు చేసింది. అయితే కొందరు నేతలు అసలు విషయాన్ని పక్కన పెట్టి సునీల్ అంశాన్ని ఎత్తుకున్నారంటూ కొందరు అప్పుడే పెదవి విరుస్తున్నారు. అసలు సునీల్ ఎవరు అంటూ కొందరు.. వార్ రూమ్ అయితే గాంధీ భవన్ లో ఉండాలి కానీ బయట ఎందుకు ఉందని ఇంకొందరు.. కమిటీల ఏర్పాటులో జరిగిన తప్పులు చర్చకు రాకుండా చేయడానికే అని మరికొందరు నేతలు అభిప్రాయ పడుతున్నారు. వార్ రూమ్‌పై పోలీసులు జరిపిన దాడిని ఒక అంశంగానే కొందరు నేతలు పరిగణించకపోవడం విశేషం.

అర చేతికి అయిదు వేళ్లు, ఏ ఒక్కరికి కలవని దారులు
ఒక సీరియస్ విషయంలోనే విభిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఇక ముందైనా కలిసి పనిచేస్తారా అనే సందేహాలు కలుగుతున్నాయి. గతంలో ఇలాగే పలు అంశాలపై నాయకులంతా ఏకమైనా...అది తాత్కాలికమే అని నిరూపించారు. పార్టీ ఒకటైనా ఎవరి వ్యవహారం వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వార్ రూమ్‌ ఇష్యూని కాంగ్రెస్ నేతలు ఏమేరకు తమకు అనుకూలంగా మలుచుకుంటారో చూడాలి.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

మరిన్ని వార్తలు