కుప్పం టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు

17 Jul, 2022 05:22 IST|Sakshi
వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ నేతలతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డెప్ప తదితరులు

వైఎస్సార్‌సీపీ కండువాలు కప్పి ఆహ్వానించిన మంత్రి పెద్దిరెడ్డి

సాక్షి, చిత్తూరు: ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నుంచి 234 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు శనివారం వైఎస్సార్‌సీపీలో చేరారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు భరత్‌ నేతృత్వంలో వారంతా వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. కుప్పం మండలం మల్లనూరుకు చెందిన 156 మంది, గుడుపల్లె మండలం గుడుపల్లి, వోయన పుత్తూరు, కుప్పిగానిపల్లి, కొడతనపల్లికి చెందిన 78 మంది ఉన్నారు.

వైఎస్సార్‌సీపీలో చేరిన వారిలో టీడీపీ తరఫున మల్లనూరు ఎంపీటీసీగా పోటీ చేసిన నారాయణస్వామి, మాజీ ఉప సర్పంచ్‌ పీవీ సెల్వం, వార్డు సభ్యుడు కుప్పన్, గ్రామ పెద్ద సత్తి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న పథకాలకు అనేక మంది వైఎస్సార్‌సీపీ వైపు ఆకర్షితులవుతున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ మరింత బలపడిందని అన్నారు. యువ నాయకుడు భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపించాలని మంత్రి పిలుపునిచ్చారు. చిత్తూరు జెడ్పీ చైర్మన్‌ గోవిందప్ప శ్రీనివాసులు, ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, పార్టీ కుప్పం కన్వీనర్‌ మురుగేష్‌ పాల్గాన్నారు. 

మరిన్ని వార్తలు