ఓర్వలేకే దేశంపై నిందలు

19 Mar, 2023 03:57 IST|Sakshi

రాహుల్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ధ్వజం

న్యూఢిల్లీ: భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని బ్రిటన్లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ తూర్పారబట్టారు. ఇండియాటుడే సదస్సులో మాట్లాడిన ఆయన రాహుల్‌ పేరు ప్రస్తావించకుండా దుయ్యబట్టారు.

‘‘భారత ప్రజాస్వామ్యం సాధిస్తునప్రగతిని, ఘన విజయాలను కొందరు ఓర్చుకోలేకపోతున్నారు. అందుకే దేశంపై నిందలేస్తున్నారు. మాటల దాడులు చేస్తున్నారు’’ అంటూ విమర్శలు గుప్పించారు. ‘‘దేశంలో ఆత్మవిశ్వాసం నిండుగా తొణికిసలాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా నాయకులు, మేధావులు, ఆర్థికవేత్తలు అందరూ భారత్‌పై ఎంతో విశ్వాసం కనబరుస్తున్నారు. ఇలాంటి వేళ ప్రతికూల వ్యాఖ్యలతో దేశాన్ని తక్కువ చేసే, ప్రజల స్థైర్యాన్ని దెబ్బ తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శుభ సందర్భాల్లో దిష్టిచుక్క పెట్టడం మన సంప్రదాయం.

ఇలాంటి వ్యక్తులు తమ చేష్టల ద్వారా బహుశా అలా దిష్టిచుక్క పెట్టే బాధ్యత తీసుకున్నట్టున్నారు’’ అంటూ చురకలంటించారు. ఇలాంటి కురచ ప్రయత్నాలను పట్టించుకోకుండా దేశం ప్రగతి పథంలో దూసుకుపోతూనే ఉంటుందన్నారు. ‘‘గత పాలకుల హయాంలో అవినీతి, కుంభకోణాలే నిత్యం పతాక శీర్షికల్లో ఉండేవి. ఇప్పుడేమో అలాంటి అవినీతిపరులంతా వారిపై ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా ఒక్కటవుతున్న వార్తలు హెడ్‌లైన్స్‌గా మారుతున్న విచిత్ర పరిస్థితిని మనమంతా చూస్తున్నాం’’ అంటూ ఎద్దేవా చేశారు. 

మరిన్ని వార్తలు