మరోసారి సంచలనాలకు వేదికగా హుజూరాబాద్‌

10 Dec, 2022 15:53 IST|Sakshi

హుజూరాబాద్‌ నియోజకవర్గం మరోసారి సంచలనాలకు వేదికగా మారబోతోంది. అదీ గులాబీ పార్టీలోనే పోటీ తీవ్రమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఆ సీటును గులాబీ పార్టీలో ముగ్గురు ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న సిటింగ్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు పోటీ ఏ స్థాయిలో ఉండబోతోంది?

ఈటల మారారు, సీన్‌ మారింది
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని అధికార పార్టీలో మూడు ముక్కలాట నడుస్తుందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో హుజూరాబాద్ లో గులాబీ కోట బీటలు వారింది. టీఆర్ఎస్‌లో అక్కడ ఈటలకు ప్రత్యామ్నాయ నేత ఇంకా తయారు కాలేదనే అనిపిస్తోంది. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటల బీజేపీలో చేరి తిరిగి అసెంబ్లీకి ఎన్నికై తన బలాన్ని చూపించుకున్నారు. ఈ ఎఫెక్ట్ కూడా అక్కడ ఎక్కువే ఉంది. అయితే నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు గులాబీ పార్టీ కేడర్‌లో ఒకింత గందరగోళానికి దారితీస్తున్నాయి. ఇద్దరు ముగ్గురు నేతలు హుజూరాబాద్  టికెట్ కోసం పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పెద్దల సభ వద్దు.. శాసనసభ ముద్దు..!
2018లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన కౌశిక్ రెడ్డి ఆ తరవాత జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. కాంగ్రెస్‌ నుంచి వెళ్ళిపోతున్నారని ఊహాగానాలు వచ్చినా.. తానే టీఆర్‌ఎస్ నుంచి పోటీలో ఉండబోతున్నట్టు ఆడియోలు బయటకు వచ్చినా.. మారిన సమీకరణాలు వ్యూహ ప్రతి వ్యూహాల నేపథ్యంలో ఉప ఎన్నికలకు ముందు కారెక్కారు. కానీ టిక్కెట్ దక్కలేదు. గులాబీ దళపతి ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఎమ్మెల్సీ ఇచ్చినా కౌశిక్‌రెడ్డి మాత్రం సంతృప్తి చెందలేదు. ఇటీవల ఒక కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా ఉన్నాయంటున్నారు. ఎమ్మెల్సీ పదవి తృప్తిగా లేదు తనను ఎమ్మెల్యేగా గెలిపించండి అని కౌశిక్ వ్యాఖ్యానించారు. అందరూ తనను ఆశీర్వదించాలని కోరారు.

ముచ్చటగా ముగ్గురి పోటీ
మరోవైపు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఈటల మీద ఓడిపోయిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా తానేం తగ్గేదెలే అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్‌ నుంచి  పోటీ చేసేది తానే అని ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. ఇక మునుగోడుతో రాష్ట్రంలో పొడిచిన కొత్త పొత్తుల్లో హుస్నాబాద్‌ నియోజకవర్గంలో కూడా పరిణామాలు మారే అవకాశాలున్నాయి. పొత్తు కుదిరితే కనుక ఆ సీటు సీపీఐకి వెళ్తుంది.

అప్పుడు సిట్టింగ్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సతీష్ బాబు సొంత నియోజకవర్గం అయిన హుజూరాబాద్‌కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సతీష్‌బాబు కూడా సొంత నియోజకవర్గానికి వస్తే హుజూరాబాద్‌ కోరుకునే వారి సంఖ్య మూడుకు చేరుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ టిక్కెట్ ఎవరికి అన్న ప్రశ్న తలెత్తుతోంది. కొత్త వారు కూడా ఈ సెగ్మెంట్‌ను  కోరుకునే ఛాన్స్ ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది.

హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి. ఆయన్ను తట్టుకుని నిలబడే వారు అక్కడ గానీ చుట్టుపక్కల గానీ గులాబీ పార్టీలో కనిపించరనే టాక్ నడుస్తోంది. టీఆర్ఎస్ నుంచి ముగ్గురు పోటీ పడే పరిస్తితి వస్తే అది ఈటలకే ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. టీఆర్ఎస్ టిక్కెట్‌ను కేసీఆర్ ఎవరికి ఇస్తారో చూడాలి.

- పొలిటికల్‌ ఎడిటర్‌, సాక్షి డిజిటల్‌
feedback@sakshi.com

మరిన్ని వార్తలు