Huzurabad Bypoll 2021: ప్రత్యేక ఆకర్షణగా ‘హుజూరాబాద్‌’!

10 Aug, 2021 14:08 IST|Sakshi

అన్ని పార్టీల దృష్టీ ఈ నియోజకవర్గంపైనే

ఉప ఎన్నిక షెడ్యూల్‌ సంకేతాలతో సందడి

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ దూకుడు

దళిత బంధుకు రూ.500 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

16న కరీంనగర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాక

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: హుజూరాబాద్‌.. ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న నియోజకవర్గం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఇక్కడే దృష్టి పెట్టాయి. ఉప ఎన్నికకు తెరలేపిన హుజూరాబాద్‌ రాజకీయాలు జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశమయ్యాయి. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ ఏ క్షణమైనా వెలువడవచ్చన్న సంకేతాలు అందడంతో పార్టీలు ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. 
 
పకడ్బందీ వ్యూహంతో టీఆర్‌ఎస్‌ 

గత వారం రోజులుగా అన్ని పార్టీలు ఎన్నికల కసరత్తులో మరింతగా మునిగిపోయాయి. అభ్యర్థుల అన్వేషణలో తీరిక లేకుండా ఉన్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్‌ఎస్‌ దూకుడు మరింత పెంచింది. పకడ్బందీ వ్యూహంతో పావులు కదుపుతోంది. ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదనే గట్టి పట్టుదలతో వ్యవహరిస్తోంది. నియోజకవర్గంపై దృష్టి కేంద్రీకరించిన ప్రభుత్వం ఉప ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పలు చర్యలు చేపడుతోంది. ‘దళిత బంధు’పథకానికి శ్రీకారం చుట్టడమే కాకుండా పైలట్‌ ప్రాజెక్టుగా హజూరాబాద్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా సోమవారం కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ ఖాతాలోకి ఇందుకోసం రూ.500 కోట్లు విడుదల చేసింది. మరోవైపు ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు నాయకులను వారు కలలో కూడా ఊహించని పదవులు వరిస్తున్నాయి. రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్‌ టీఎస్‌ ఎస్‌సీడీసీఎల్‌ చైర్మన్‌ కాగా, ఇటీవలే కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ అయ్యారు.  


సీఎం రాకతో మరింత ఊపు

ముఖ్యమంత్రి, అధికార పార్టీ అధినేత కేసీఆర్‌ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. నిజానికి దళితబంధు పథకం ఈ నెల 16న హుజూరాబాద్‌ వేదికగా ప్రారంభం కావాలి. కానీ.. బుధవారం వాసాలమర్రి దళితవాడను సందర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎవరూ ఊహించని విధంగా అక్కడే పథకాన్ని ప్రారంభించారు. దీని కొనసాగింపుగా సోమవారం రూ.500 కోట్లను కరీంనగర్‌ కలెక్టర్, ఎస్పీ కార్పొరేషన్‌ ఈడీల ఖాతాలకు ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల అవుతుందనే సంకేతాలు అందడమే ఇందుకు కారణమనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరీంనగర్‌కు రానుండగా, ఈ సందర్భంగా దళిత బంధుపై సమీక్ష, లబ్ధిదారుల ఎంపిక, పంపిణీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవచ్చని అధికార వర్గాలు ఇదివరకే ప్రకటించాయి.  


రంగంలో అతిరథ మహారథులు 

మరోవైపు పార్టీ ముఖ్య నేతలు పలువురిని టీఆర్‌ఎస్‌ రంగంలోకి దింపింది. హుజూరాబాద్‌లో పార్టీ సమన్వయంపై దృష్టి పెట్టిన మంత్రి హరీశ్‌రావు పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌లు, పాత వరంగల్, కరీంనగర్‌ జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా హుజూరాబాద్‌ నియోజకవర్గంలోనే మకాం వేశారు. కేడర్‌లో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తూ, ప్రభుత్వ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు అందుతున్నాయో లేదో పరిశీలిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు.  


ఈటలకు గెలుపు తప్పనిసరి 

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు కూడా ఈ ఎన్నిక మరింత కీలకంగా మారింది. రాజకీయాలలో మనుగడ సాగించాలంటే గెలుపు తప్పనిసరి అయ్యింది. తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికపై ఈటల సీరియస్‌గా దృష్టి పెట్టారు. వ్యక్తిగతంగా నియోజకవర్గంలో తనకున్న ఇమేజ్‌ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాదీవెన యాత్ర పేరిట మొన్నటి వరకు నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. మోకాలికి శస్త్రచికిత్సతో తాత్కాలికంగా పాదయాత్రకు బ్రేక్‌ ఇచ్చిన ఈటల నియోజకర్గ నేతలు, కార్యకర్తలతో నిరంతర సమావేశాలు, సంప్రదింపులతో బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు కూడా హుజూరాబాద్‌పై దృష్టి కేంద్రీకరించి ఉప ఎన్నిక వ్యూహాలకు పదును పెడుతున్నాయి.    

Poll
Loading...
మరిన్ని వార్తలు