4 నెలల తర్వాత ఇంటిదారి..

28 Oct, 2021 04:02 IST|Sakshi

హుజూరాబాద్‌లో ప్రచారం ముగియడంతో తిరిగి వెళ్లిన నాయకులు, కార్యకర్తలు 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:  హుజూరాబాద్‌లో ప్రచారం ముగియడంతో అన్నిపార్టీలకు చెందిన ఇతర ప్రాంతాల నేతలు, కార్యకర్తలు ఇంటిముఖం పట్టారు. నియోజకవర్గ ప్రజలు మినహా స్థానికేతరులంతా వెళ్లిపోవాలంటూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పోలీసులు, అధికారులు నియోజకవర్గం వ్యాప్తంగా నేతలు బస చేసిన ఇళ్లు, హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, ఫంక్షన్‌హాళ్లలో తనిఖీలు నిర్వహించారు.

బయటి ప్రాంతాల వారు వెళ్లిపోవాలని సూచించారు. కిందిస్థాయి నేతలు, కార్యకర్తలు బుధవారం మధ్యాహ్నం నుంచే ఇంటిదారి పట్టారు. ముఖ్య నేతలు సాయంత్రం 7 గంటల వరకు కూడా ప్రచారం నిర్వహించి అక్కడి నుంచి బయలుదేరారు. ఈటల రాజేందర్‌ జూన్‌ 12న రాజీనామా చేయడంతో హుజూరాబాద్‌లో వేడి మొదలైంది. అప్పటి నుంచి బుధవారం వరకు 130 రోజులకుపైగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు చెందిన వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు హుజూరాబాద్‌లో మకాం వేశారు.

చాలా మంది మధ్యలో పండుగలు, ఇతర అత్యవసర సమయాల్లో తప్ప.. అక్కడే గడిపి ప్రచారంలో పాల్గొన్నారు. ఇంత సుదీర్ఘంగా గడపడంతో చాలా మంది నేతలు, కార్యకర్తలకు హుజూరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని అంటున్నారు. నాలుగు నెలలకుపైగా ఇక్కడే ఉండి, అందరితో కలిసి పోయామని.. హుజూరాబాద్‌ను వీడుతున్నందుకు బాధగా ఉందని మంత్రి గంగుల కమలాకర్‌ వ్యాఖ్యానించారు. మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మరికొందరు నేతలు కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు