Huzurabad Bypoll: అలసత్వం వద్దు

21 Aug, 2021 08:03 IST|Sakshi

హుజూరాబాద్‌ నియోజకవర్గంపై

సీఎం కేసీఆర్‌ దిశా నిర్దేశం 

మంత్రులు, నేతలతో సుదీర్ఘ సమీక్ష 

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో మనం మెరుగైన స్థితిలో ఉన్నాం. రోజురోజుకూ మన బలం పెరుగుతున్నట్లు సర్వే నివేదికలు చెప్తున్నాయి. అయినా అలసత్వం వహించకుండా పార్టీ ఇన్‌చార్జీలు ఉప ఎన్నిక ముగిసేంత వరకు బాధ్యతలు అప్పగించిన చోట ఎక్కడివారక్కడే పనిచేయాలి. ప్రధానంగా పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రతి గడపకూ వెళ్లి వివరించాలి’ అని సీఎం  కేసీఆర్‌.. మంత్రులు, ఇతర నేతలకు దిశా నిర్దేశం చేశారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులపై శుక్ర వారం ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించినట్లు విశ్వసనీయ సమాచారం. మంత్రులు హరీశ్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తో పాటు ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, హుజూరాబాద్‌లో పార్టీ ఇన్‌చార్జీలుగా పనిచేస్తున్న పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. 

దళితబంధుపై ఏమంటున్నారు? 
ఉప ఎన్నిక షెడ్యూల్‌ ఎప్పుడు వెలువడుతుందనే అంశంపై స్పష్టత లేకున్నా అలసత్వం వహించొద్దని కేసీఆర్‌ పదే పదే హెచ్చరించినట్లు తెలిసింది. హుజూరాబాద్‌లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సెప్టెంబర్‌ 10వ తేదీలోగా పూర్తయ్యేలా చూడాలని మంత్రులను ఆదేశించారు. ఇటీవల నియోజకవర్గంలో ప్రారంభించిన దళితబంధుపై స్థానిక ప్రజలు ఏమనుకుంటున్నదీ తీశారు. ఏ ఒక్కరినీ వదలకుండా అందరికీ లబ్ధి జరిగేలా చూస్తామనే అంశాన్ని దళితుల్లోకి బలంగా  తీసుకెళ్లాలని సూచించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మరికొన్ని సూచనలు చేసిన ముఖ్యమంత్రి.. అవసరమైతే మరోమారు హుజూరాబాద్‌లో పర్యటిస్తానని చెప్పినట్లు తెలిసింది. 
 

మరిన్ని వార్తలు