Huzurabad Bypoll: ఆట మొదలైంది.. ఎవరూ తగ్గడం లేదు

29 Sep, 2021 09:01 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: రెండు తెలుగు రాష్ట్రాలు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) హుజూరాబాద్‌ ఉప ఎన్నిక షెడ్యూలు విడుదల చేసింది. షెడ్యూలు విడుదలతో జిల్లాలో అసలైన రాజకీయ ఆట మొదలైంది. ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌ స్థానానికి రాజీనామా చేసిన దాదాపు నాలుగునెలల సుదీర్ఘ సమయం తరువాత షెడ్యూల్‌ రావడంతో నేతల నిరీక్షణకు తెరపడింది. ఇక అసలైన కదనరంగంలోకి కొదమసింహాల్లా దూకనున్నారు.

వాస్తవానికి రాజేందర్‌ రాజీమానాతోనే జిల్లాలో ఉపఎన్నిక వాతావరణం మొదలైంది. రెండు ప్రధాన పార్టీలు ఈ ఉపఎన్నికను ప్రతిష్టాకంగా తీసుకోవడంతో ఎవరూ ఎక్కడా తగ్గడం లేదు. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా అత్యంత పకడ్బందీగా నిర్వహించ తలపెట్టిన ఈ ఎన్నిక నిర్వహణను అధికారులు సైతం సవాలుగా తీసుకున్నారు. కాగా.. హుజూరాబాద్‌ ఓటర్ల సంఖ్య 2.36,283గా అధికారులు తేల్చారు. గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు 10 వేల మంది ఓటర్లు పెరగడం గమనార్హం. నామినేషన్ల ప్రక్రియ ముగిసేనాటికి స్వల్ప మార్పులు చోటుచేసుకోవచ్చని అధికారులు వివరించారు.

విమర్శలు– ప్రతివిమర్శలు..
► రాజేందర్‌ రాజీనామా అనంతరం హుజూ రాబాద్‌ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టాలన్న ఆలోచనతో కేసీఆర్‌ తన మాస్టర్‌ప్లాన్‌ను అనుకున్నట్లుగానే అమలు చేస్తున్నారు. 
►  దళితబంధు పథకం అమలుకు చకచకా రూ.2000 కోట్లు విడుదల చేశారు. లబ్ధి దారుల సర్వే కూడా అంతే వేగంగా పూర్తయింది. 10 మందికిపైగా లబ్ధిదారులకు యూనిట్ల గ్రౌండింగ్‌ జరిగిపోయింది.
►  మరోవైపు మంత్రి హరీశ్‌రావు, జిల్లా మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌లతో కలిసి రాజేందర్‌ విమర్శలకు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లింది వ్యవహారం. ఒకదశలో వ్యక్తిగత దూషణలకు దిగిన సందర్భాలూ ఉన్నాయి.
► టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలు, సీఎం కేసీఆర్, హరీశ్‌రావులను టార్గెట్‌ చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు. అదే సమయంలో హరీశ్‌రావు కూడా దీటుగానే ప్రత్యారోపణలు చేస్తున్నారు. 
►  బీజేపీ విధానాలను, పెట్రో ధరల పెంపును, ప్రైవేటీకరణ, ప్రభుత్వాస్తుల విక్రయం తదితర విషయాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. 
డబుల్‌ డోస్‌ లేకుంటే అంతే.. 
► కేంద్రం ఎన్నికల సంఘం ఉపఎన్నికల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ డబుల్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి చేసింది. రాజకీయ పార్టీల నేతలు–విధుల్లో పాల్గొనే అధికారులు సెకండ్‌ డోస్‌ సర్టిఫికేట్‌ లేకుండా అనుమతించరు. 
►   ఇప్పటికే హుజూరాబాద్‌ వ్యాప్తంగా దాదా పు 80శాతం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన వారికి కూడా అధికారులు త్వరలోనే పూర్తి చేయనున్నారు.ఈ నేపథ్యంలో ప్రధానపార్టీల రాజకీయ నేతలు, కార్యకర్తల్లో చాలామంది డబుల్‌ డోస్‌ వేసుకోలేదు. దీంతో రెండో డోస్‌ కోసం మధ్యాహ్నం నుంచి ఉరుకులు పరుగులు తీస్తున్నారు.

30న అభ్యర్థిని ప్రకటించనున్న కాంగ్రెస్‌?
►  ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి హుజూరాబాద్‌ రాజకీయం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. 
►  ఇప్పటికే టీఆర్‌ఎస్‌ తమ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను ప్రకటించింది. బీజేపీ నుంచి రాజేందర్‌ పోటీ చేస్తారు. ఇక ప్రధా న ప్రతిపక్షాల్లో ఒకటైన కాంగ్రెస్‌ పార్టీ మాత్రం హుజూరాబాద్‌ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయక పోగా.. ఈనెల 30న అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నారు.
 దామోదర రాజనర్సింహ నేతృత్వంలోని కమిటీ నలుగురు పేర్లను తెరపైకి తీసుకొ చ్చింది. వీరిలో కొండా సురేఖ, పత్తి కృష్ణారెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, ప్యాట రమేశ్‌ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. 
► మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టాక దూకుడుగా వెళుతున్నా రు. ఆయన సభలకు హాజరవుతున్న ఉమ్మడి జిల్లా నేతలు తమ అనుచరులను తరలించడంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి. 

చదవండి: వేడెక్కిన రాజకీయం: హుజూరా‘బాద్‌షా’ ఎవరో?

మరిన్ని వార్తలు