Huzurabad Bypoll: హీటెక్కిన రాజకీయం.. హరీశ్‌ వర్సెస్‌ ఈటల

12 Aug, 2021 14:32 IST|Sakshi

హీటెక్కిన హుజురాబాద్‌ రాజకీయం

పేలుతున్న మాటల తూటాలు

హరీశ్‌రావు వర్సెస్‌ ఈటల రాజేందర్‌

సాక్షి, కరీంనగర్‌: హుజురాబాద్‌లో రాజకీయం వేడెక్కింది. ఉప ఎన్నిక అభ్యర్థి ఖరారైన నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌ దూకుడు పెంచింది. గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మేనల్లుడు, ఆర్థిక శాఖా మంత్రి హరీశ్‌రావు వరుస పర్యటనలతో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి, హుజురాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై విమర్శల వర్షం గుప్పిస్తూ గెల్లును గెలిపిస్తే కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో హరీశ్‌రావు- ఈటల రాజేందర్‌ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

రైటిస్టుగా ఎందుకు మారినట్లు?
ఇల్లందకుంటలో బుధవారం ఏర్పాటు చేసిన ‘ప్రజా ఆశీర్వాద సభ’లో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘‘అన్నివర్గాల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కావాలా? నిత్యం ధరల పెంపుతో, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ వైపు నడిపిస్తున్న బీజేపీ అభ్యర్థి కావాలో..? ప్రజలు ఆలోచించాలి’’ అంటూ ఈటల రాజేందర్‌తో పాటు బీజేపీపైనా తీవ్ర విమర్శలు చేశారు.

అదే విధంగా.. ఈటల గులాబీ జెండా నీడన ఎదిగి, సీఎం కేసీఆర్‌ గుండెలపై తన్ని వెళ్లిపోయాడని మండిపడ్డారు. రైతుబంధు, దళితబంధు వంటి పథకాలను వ్యతిరేకిస్తున్న రాజేందర్‌కు ఎందుకు ఓటేయాలన్నారు. తొలి నుంచీ తాను లెఫ్టిస్టు అని ప్రకటించుకున్న రాజేందర్‌.. ఇప్పుడు ఎందుకు అకస్మాత్తుగా రైటిస్టుగా మారాడంటూ హరీశ్‌ ప్రశ్నల వర్షం కురిపించారు.

మామ దగ్గర మార్కుల కోసమే: ఈటల
ఇక ఇందుకు స్పందించిన ఈటల రాజేందర్‌ గురువారం హరీశ్‌రావుకు కౌంటర్‌ ఇచ్చారు. ‘‘మీ మామ దగ్గర మార్కుల కోసం నాపై అసత్య ప్రచారం చేయకు. హరీష్‌రావు విమర్శలపై బహిరంగ చర్చకు నేను సిద్ధం. నా ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. పార్టీలో చేరినప్పుడు, ఇప్పుడు ఉన్న ఆస్తులు లెక్క తేలుద్దాం. మీ ఆస్తులపై విచారణకు సిద్ధమా?’’ అని సవాల్‌ విసిరారు. ‘‘నేను అభివృద్ధి చేయలేదంటున్నారు. మీరు తిరుగుతున్న రోడ్లు నేను వేయించినవే’’ అంటూ తనదైన శైలిలో చురకలు అంటించారు.

ఆత్మగౌరవం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా: హరీష్‌రావు
హరీశ్‌రావు సైతం ఈటలకు గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. ‘‘ఈటలకు ఆత్మగౌరవం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా. హుజురాబాద్‌కు సీఎం కేసీఆర్ 4 వేల ఇళ్లు కేటాయించారు. మరి ఈటల వాటిని ఎందుకు పూర్తి చేయలేదు. హుజురాబాద్‌ అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటా. బీజేపీకి, ఈటలకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారు’’ అని పేర్కొన్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ.. హరీశ్‌రావు- ఈటల రాజేందర్‌ మాటల తూటాలు, పరస్పర విమర్శలు, సవాళ్లు హాట్‌ టాపిక్‌గా మారాయి. కాగా ఈటల రాజీనామాతో హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.

చదవండి: ఈటలను 6సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. కేసీఆర్‌ను ‘రా’ అంటుండు

మరిన్ని వార్తలు