Huzurabad Bypoll: పోరు పార్టీల మధ్యే.. మద్యం విషయంలో కాదు

19 Oct, 2021 14:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కరీంనగర్‌: ఏ ఎండకు ఆ గొడుగు చందంగా రాజకీయ నాయకులు పార్టీల గోడలు దూకడం తెలిసిందే. ప్రస్తుత హుజూరాబాద్‌ ఉపఎన్నిక సందర్భంగా ఆయా పార్టీలు ఓ అడుగు ముందుకేసి, జనాలనూ మార్చేస్తున్నాయి. అభ్యర్థుల ముందు ఆ సమయానికి కండువా కప్పుకుంటే చాలంటున్నారు నేతలు. ఫొటోలు క్లిక్‌మనిపిస్తూ ఆ జనసమూహాన్ని తమ సైన్యంగా చూపించుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇది సామాన్యులకూ లాభదాయకంగా మారింది.

ఆ రోజుకు బీరు, బిర్యానీతోపాటు రూ.500 ఇస్తున్నారు. తమ అధినేతల వద్ద మార్కులు కొట్టేసేందుకు కొందరు గల్లీ నాయకులు పక్క వీధిలోని అపరిచితుల్నీ పార్టీలోకి ఆహ్వానిస్తూ కండువా కప్పిస్తున్నారు. తామే ఎక్కువ మందిని పార్టీలో చేర్పించామని గొప్పల డప్పులు కొట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఒకరిచేత కండువా కప్పించుకున్న గల్లీ కార్యకర్తలు మరుసటిరోజు మరో పార్టీ కండువా కప్పుకుంటే ఎంతిస్తావ్‌ అని బేరాలాడుతున్నారు. ఇదో ఎన్నికల చిత్రం! 
చదవండి: హుజూరాబాద్‌లో దళితబంధుకు బ్రేక్‌

గరిటె తిప్పేటోళ్లు కావాలండోయ్‌ 
కరీంనగర్‌ అర్బన్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పుణ్యమాని వంట తయారీదారులకు డిమాండ్‌ పెరిగింది. ప్రచారపర్వంలో భాగంగా సమావేశాలకు హాజరయ్యే వారికి అభ్యర్థులు ఉదయం అల్పాహారంతోపాటు రెండుపూటలా భోజనం ఏర్పాటు చేయిస్తున్నారు. దీంతో గరిటె తిప్పేటోళ్లకు భలే గిరాకీ లభిస్తోంది. అభ్యర్థులు వంటవారిని ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు తమ వద్దే పనిచేసేలా ఒప్పందం చేసుకుంటున్నారు. ఏదేమైనా ఉపఎన్నిక పాక ప్రావీణ్యులకూ కలిసొచ్చిందని చెప్పవచ్చు. 

అంతటా ఒకే బ్రాండ్‌ మద్యం
కరీంనగర్‌టౌన్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు సవాలుగా తీసుకొని, గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఓటర్లను మభ్యపెట్టేందుకు మద్యం, మాంసం, డబ్బును ఎరచూపి ఓట్లు వేయించుకోవాలని ఆరాటపడుతున్నాయి. ఇందుకోసం గ్రామగ్రామాన తమ అనుచరగణాన్ని దింపి, పోలీసుల కంటపడకుండా ఇంటింటి పంపిణీకి శ్రీకారం చుట్టాయి. అయితే ప్రజలు మాత్రం పార్టీలు పంచే మందుపై ఆసక్తి చూపడం లేదు. గత కొద్ది రోజులుగా అందరూ ఒకే బ్రాండ్‌ మందు బాటిళ్లను ఇస్తుండటమే ఇందుకు కారణమని తెలిసింది. ఇదెలా సాధ్యమని ఆరా తీస్తే కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఓ ప్రధాన పార్టీకి చెందిన నాయకుడు టికెట్‌ ఆశించి, భంగపడినట్లు సమాచారం. సదరు నాయకుడు గతంలోనూ  హుజూరాబాద్‌ టికెట్‌ ఆశించినట్లు తెలిసింది.

ఆయనను శాంతింపజేసేందుకు సదరు పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత ఏకంగా విస్కీ డీలర్‌షిప్‌ దక్కేలా కృషి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ నాయకుడు తమ పార్టీతోపాటు ఇతర పార్టీలకు కూడా ఒకే బ్రాండ్‌కు చెందిన మందు బాటిళ్లు సరఫరా చేస్తున్నట్లు పలువురు అనుకుంటున్నారు. ఇతర బ్రాండ్లు తెచ్చే ప్రయత్నం చేసినా పోలీసులకు దొరికే ఛాన్స్‌ ఉండటంతో అన్ని పార్టీల నేతలు తప్పనిసరి పరిస్థితుల్లో అదే బ్రాండ్‌ మందు పంపిణీ చేయక తప్పడం లేదని సమాచారం. మొత్తమ్మీద హుజూరాబాద్‌ పోరులో పార్టీల మధ్య తేడాలున్నా మద్యం విషయంలో మాత్రం అందరూ ఒకే బ్రాండ్‌ను నమ్ముకుంటున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.

రిటైర్డ్‌ పోలీసులు పాలిటిక్స్‌లోకి.. 
కరీంనగర్‌టౌన్‌: ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలకు సేవ చేసే అవకాశం పోలీసులకు, పొలిటీషియన్లకు మాత్రమే దక్కుతుంది. అయితే రాజకీయ నాయకులు జీవితకాలం తమ సేవలను కొనసాగిస్తే, పోలీసులు మాత్రం ఉద్యోగ విరమణ పొందేవరకు మాత్రమే సేవలందించగలుగుతారు. ఆ తర్వాత ప్రజాక్షేత్రంలో ప్రత్యక్షంగా ఉండాలంటే పొలిటీషియన్‌గా మారడం ఒక్కటే మార్గంగా ఎంచుకుంటున్నారు. పూర్తిగా భిన్న ధృవాలుగా ఉండే ఈ రెండు వర్గాలు పోలీసుల రిటైర్‌మెంట్‌ తర్వాత ఒక్కటవుతున్నాయి.

ఈ క్రమంలో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నో సిత్రాలు చోటుచేసుకుంటున్నారు. మాజీ పోలీసు అధికారి దాసరి భూమయ్య గత నెలలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అదే బాటలో వరంగల్‌కు చెందిన రిటైర్డ్‌ ఎస్సై ఉపేందర్‌రావు సోమవారం కిట్స్‌ కళాశాలలో టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. గతంలో చాలా మంది పోలీసు అధికారులు పొలిటీషియన్లుగా మారి, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవుల్లో కొనసాగిన సందర్భాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే మరికొంత మంది రిటైర్డ్‌ పోలీసులు కూడా పొలిటికల్‌ కేరీర్‌ను ఎంచుకునేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.  

మరిన్ని వార్తలు