Huzurabad Bypoll: కౌశిక్‌ చేరిక వాయిదా.. రమణ రాక.. ఏం చేద్దాం?

14 Jul, 2021 07:27 IST|Sakshi

హుజూరాబాద్‌ అభ్యర్థిపై ఏమీ చెప్పలేని స్థితిలో టీఆర్‌ఎస్‌ నేతలు

16న ఎల్‌.రమణ మెడలో గులాబీ కండువా..

కౌశిక్‌ చేరిక వాయిదా

టీఆర్‌ఎస్‌లో చేరికపై నిర్ణయం తీసుకోలేదన్న కౌశిక్‌

మరోవైపు ప్రత్యామ్నాయంపై మల్లగుల్లాలు

నేడు తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ అధ్యక్షతన కీలక సమావేశం

కౌశిక్‌ వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశం

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ఒక్కరోజులో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలతో గులాబీదళం మౌనం దాల్చింది. మాజీమంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్‌లో కారుదే జోరు అని తిరిగిన టీఆర్‌ఎస్‌ నేతల కాళ్లకు బ్రేక్‌ పడింది. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటలపై కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పాడి కౌశిక్‌ రెడ్డి ‘టీఆర్‌ఎస్‌ టికెట్టు నాకే కన్ఫర్మ్‌ అయింది’ అని మాట్లాడిన కాల్‌ రికా ర్డులు వైరల్‌ కావడమే ఇందుకు కారణం. రెండు నెలలుగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరనే విషయంలో గోప్యత పాటిస్తూ వచ్చిన ఆ పార్టీ నాయకులు కౌశిక్‌రెడ్డి కమలాపూర్‌ మండలం మాదన్నపేట యువకుడు విజేందర్‌కు స్వయంగా ఫోన్‌చేసి చెప్పుకున్న ఆడియో లీక్‌ కావడంతో కంగుతి న్నారు.

కౌశిక్‌ మాటల్లో  మాదన్నపేట గ్రామ సర్పంచ్, కాంగ్రెస్‌ నాయకుడు చరణ్‌ దగ్గరున్న యూత్‌ ను లాగాలని, అందుకోసం రూ.3వేల నుంచి రూ.5వేల వరకు ఇవ్వాలని చెప్పడం తెలిసిందే. రిఫరెన్స్‌గా చెప్పిన మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజిరెడ్డి కూడా అదే యువకుడికి ఫోన్‌ చేసి ‘చరణ్‌ పటేల్‌ దగ్గరున్న ఒక్కొక్కరికి రూ.5వేలు, మందు, ఖర్చులకు పైసలు ఇస్తాం. అందరినీ గుంజుకు రావాలె..’ అనడం వివాదాస్పదమైంది. డబ్బులతో కాంగ్రెస్‌ కార్యకర్తలను కొనుగోలు చేసుకుని కౌశిక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లోకి వెళుతున్నారనే ప్రచారం సోషల్‌మీడియా వేదికగా సాగింది.

ఈ పరిణా మంతో గులాబీ నేతల్లో అంతర్మథనం మొదలైనట్లు సమాచారం. ఈ క్రమంలో 16న కేసీఆర్‌ సమక్షంలోఎల్‌.రమణతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరుతారని భావించిన కౌశిక్‌ రెడ్డి కూడా తన అంతరంగీకులతో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తున్నారు. తాను 16న టీఆర్‌ఎస్‌లో చేరడం లేదని, నియోజకవర్గంలోని సన్నిహితులతో మాట్లాడిన తరువాతే నిర్ణయం తీసుకుంటానని ‘సాక్షి’కి తెలిపారు. 

నేటి కార్యనిర్వాహక సమావేశంలో స్పష్టత?
రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించేందుకు బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సమావేశం జరగనుంది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఆరు అంశాలపై చర్చిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే సమావేశంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అనుమతితో ‘ఇతర వ్యవహారాలపై’ కూడా చర్చించనున్నారు.

ఆ వ్యవహారాల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవహారంతోపాటు కౌశిక్‌రెడ్డి ఎపిసోడ్, హుజూరాబాద్‌ ఉప ఎన్నిక గురించి కూడా చర్చించే అవకాశం ఉందని సమాచారం. కౌశిక్‌రెడ్డి పార్టీలో చేరుతారా..? పార్టీలో చేరినా టికెట్టు ఆయనకే ఇస్తారా..? ప్రత్యామ్నా య ఆలోచనలు ఏమిటనే విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా.. 16న కేసీఆర్‌ సమక్షంలో టీడీపీ మాజీ నేత ఎల్‌.రమణ టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోనున్నారు. ఇతర పార్టీల్లోని మరికొందరు ముఖ్య నేతలు కూడా జిల్లా నుంచి వెళ్లి టీఆర్‌ఎస్‌లో చేరేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. 

కౌశిక్‌ వ్యవహారంపై నోరెత్తని అధికార పార్టీ ఏం చేద్దాం..?
కాంగ్రెస్‌లో కొనసాగుతూనే తనకే టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఖరారైందని పాడి కౌశిక్‌రెడ్డి చేసిన ఫోన్‌ సంభాషణ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్‌ కావడం.. ఆ వెంటనే ఆయన కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయడం.. కాంగ్రెస్‌ ఆయనను బహిష్కరించడం వంటి పరిణామాలను టీఆర్‌ఎస్‌ నాయకత్వం క్షుణ్ణంగా పరిశీలించింది. కౌశిక్‌రెడ్డి, ఆ యన అనుచరుడు రాజిరెడ్డి ఫోన్‌ సంభాషణలతో పార్టీ ఇమేజ్‌కు ఏమైనా నష్టం కలిగిందా..? అనే కోణంలో కూడా పార్టీ నేతలు ఆరా తీస్తున్నారు. కౌశిక్‌ను టీఆర్‌ఎస్‌లోకి తీసుకుని టికె ట్టు ఇస్తే హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ నామరూపాల్లేకుండా పోతుందని, కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు కూడా తమకే అనుకూలంగా మారుతుందని టీఆర్‌ఎస్‌ అధిష్టానం భావించింది.

ఉప ఎన్నిక కోసం చేయించిన ఇంటలిజెన్స్, వ్యక్తిగత సర్వేల్లో కూడా ఈటలకు పోటీగా కౌశిక్‌రెడ్డి బలమై న నాయకుడిగా నివేదికలు వచ్చాయి. ఈ మే రకు సాక్షాత్తు ముఖ్యమంత్రే ఆదివారం నాటి హుజూరాబాద్‌ సమావేశంలో ‘కౌశిక్‌ రెడ్డి వస్తానంటున్నాడు.. ఎలా ఉంటది’ అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పు ల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు వంటి నేతలు చేస్తున్న ప్రచారానికి కూడా పార్టీ యంత్రాంగం నుంచి పాజిటివ్‌ స్పందనే కనిపించింది. ఈ పరిణామాల క్రమంలో కౌశిక్‌రెడ్డి ఫోన్‌ సంభాషణ టీఆర్‌ఎస్‌ నేతల ఉత్సాహాన్ని నీరుగార్చినట్లయింది.మంగళవారం హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీష్‌ మినహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర పెద్ద నాయకులెవరూ నియోజకవర్గంలో కనిపించకపోవడం  గమనార్హం. 
 

మరిన్ని వార్తలు