Huzurabad Bypoll: టీఆర్‌ఎస్‌కు ఓట్లేయకుంటే పింఛన్లు కట్‌ చేస్తామంటున్నారు 

26 Oct, 2021 14:03 IST|Sakshi

ఎస్‌ఈసీకి టీపీసీసీ వికలాంగుల విభాగం ఫిర్యాదు

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌కు ఓట్లేయకపోతే వికలాంగుల పింఛన్లు తొలగిస్తామని ఆ పార్టీ నేతలు బెదిరిస్తున్నారని టీపీసీసీ వికలాంగుల విభాగం చైర్మన్‌ ముత్తినేని వీరయ్యవర్మ తెలిపారు. ఇల్లందకుంట మండలం వంతడుపుల గ్రామంలో జరిగిన వికలాంగుల సమావేశంలో టీఆర్‌ఎస్‌కు ఓట్లేయకుంటే పింఛన్లు కట్‌ చేస్తామని వికలాంగుల కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ వాసుదేవరెడ్డి చెప్పారన్నారు.

ఓటర్లను ప్రలోభపెట్టడంతో పాటు వికలాంగులను భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ), డీజీపీలకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసినట్లు సోమవారం ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. వెంటనే   ఆయనపై తగిన చర్యలు తీసుకుని వికలాంగ ఓటర్లకు మనోధైర్యం కల్పించాలని ముత్తినేని కోరారు.  
చదవండి: హుజురాబాద్‌ ఉప పోరు: పెరిగిన పోలింగ్‌ సమయం.. ఎప్పటివరకంటే!

‘వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ను వెంటనే తొలగించాలి’ 
సాక్షి, హైదరాబాద్‌: ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేయకుంటే పింఛన్లు కట్‌ చేస్తామన్న వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వాసుదేవరెడ్డిని వెంటనే పదవి నుంచి తొలగించాలని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. హుజూరాబాద్‌ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఇల్లందకుంట మండలం వంతడుపుల గ్రామంలో వికలాంగులతో సమావేశమై టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేయాలని హెచ్చరిస్తూ.. ఓటు వేయని వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని బెదిరించడం గర్హనీయమన్నారు. వాసుదేవరెడ్డి తక్షణమే వికలాంగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. వికలాంగులపై బెదిరింపులకు పాల్పడిన వాసుదేవరెడ్డిపై వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.  
చదవండి: Huzurabad Bypoll: 100 కోట్లు దాటిన బెట్టింగ్‌..?

>
మరిన్ని వార్తలు