Huzurabad Bypoll జీ‘హుజుర్‌’ ఎవరికో.. వారిద్దరి మధ్యే తీవ్ర పోటీ

28 Sep, 2021 12:24 IST|Sakshi

ఉప ఎ‍న్నిక షెడ్యూల్‌ విడుదలతో వేడెక్కిన రాజకీయం

ఇప్పటికే రంగంలోకి దిగిన పార్టీలు

టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యే తీవ్ర పోటీ!

వెబ్‌ ప్రత్యేకం: మరో ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలవడంతో తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు మంగళవారం ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. అయితే ఈ ఎన్నికలో ఎవరు విజయం సాధిస్తారనే చర్చ సర్వత్రా జరుగుతోంది. ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు రావడంతో మంత్రివర్గం నుంచి ప్రభుత్వం బర్తరఫ్‌ చేసింది. అయితే తనను పొమ్మనలేక పొగబెట్టారని పేర్కొంటూ ఈటల టీఆర్‌ఎస్‌ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో హుజురాబాద్‌ అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ప్రస్తుతం షెడ్యూల్‌ విడుదలవడంతో ఆ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో.. హజురాబాద్‌ ఎవరికీ ‘జీ హుజుర్‌’ అంటుందో చూద్దాం..
చదవండి: కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. బీజేపీలో చేరనున్న మాజీ సీఎం?

అయితే ఈ ఎన్నిక పార్టీల పరంగా కాదు ఈటల రాజేందర్‌ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌గా మారింది. అయితే ఇప్పటివరకైతే ఒక్క టీఆర్‌ఎస్‌ పార్టీ మినహా ఏ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయలేదు. టీఆర్‌ఎస్‌ నుంచి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ గులాబీ పార్టీ బరిలోకి దింపింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్‌ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. అయితే బీజేపీ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం అభ్యర్థి విషయంలో ఇంకా ఓ ‍స్పష్టత రాలేదు. 

బీజేపీ (ఈటల రాజేందర్‌)
ఈ ఉప ఎన్నికల ఈటల రాజేందర్‌ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌ మధ్య ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. బీజేపీ తనను అభ్యర్థిగా ప్రకటించపోయినప్పటికీ ఈటల బరిలో దిగనున్నారు. రాజీనామా చేసిన నాటి నుంచి ఈటల ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. కొన్ని రోజులు పాదయాత్ర చేపట్టారు. అస్వస్థతకు గురవడంతో పాదయాత్రకు ముగింపు పలికి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గవ్యాప్తంగా రెండుసార్లు చుట్టేశారు. 2004 కమలాపూర్‌ నియోజకవర్గం నుంచి, 2009, 10 (ఉప ఎన్నిక), 2014, 2018 ఎన్నికల్లో హుజురాబాద్‌ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో అర్బన్‌ ‘తెలంగాణలో..’

ఐదు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం.. ప్రజలందరికీ చేరువ కావడం ఈటలకు కలిసొచ్చే అంశం. అన్ని మండలాలు ఆయనకు సుపరిచితమే. ప్రతిఒక్కరినీ పేరుపేరున పలకరించేంత ప్రజల్లో కలిసిపోయారు. పైగా స్థానికుడు. ఈటలపై ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం బహిష్కరించిందనే సానుభూతి ప్రజల్లో ఏర్పడడం, నరేంద్ర మోదీ హవా కూడా కనిపించే అవకాశం ఉంది. బలహీనతల విషయానికి వస్తే హుజురాబాద్‌ అభివృద్ధిలో వెనకపడి ఉండడం.. అవినీతి ఆరోపణలు రావడం వంటివి ఈటలకు చేటు చేసేలా ఉంది. బీజేపీ నాయకత్వం సహకరించపోవడం కూడా కొంత ప్రభావం చూపనుంది. ఈ ఎన్నిక ఈటలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఎన్నిక ఆయనకు చావో రేవోగా పేర్కొంటున్నారు. 

టీఆర్‌ఎస్‌ (గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌)
హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ బలంగా ఉంది. అభ్యర్థిని కొన్ని నెలల ముందటే ప్రకటించారు. స్థానికుడైన గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను వ్యూహాత్మకంగా అభ్యర్థిగా ప్రకటించి బీసీ ఓటర్లకు గాలం వేసింది. పైగా కాంగ్రెస్‌లో కీలక నాయకుడిగా ఉన్న పాడి కౌశిక్‌రెడ్డిని పార్టీలోకి చేర్చుకోవడం.. ఈ నియోజకవర్గానికే చెందిన వ్యక్తికి ఎస్పీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి కట్టబెట్టింది. వీటికితోడు దేశంలోనే ప్రప్రథమంగా రూ.10 లక్షల నగదు సాయం పథకం ‘దళితబంధు’ ప్రకటించడం టీఆర్‌ఎస్‌కు కలిసొచ్చే అంశం. నియోజకవర్గ బాధ్యతలు పార్టీ అప్పగించడంతో మంత్రి హరీశ్‌ రావు హుజురాబాద్‌లోనే కొన్ని నెలలుగా ఉంటున్నారు. తరచూ పర్యటనలు.. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోనే తిష్ట వేశారు. ఈ గెలుపు టీఆర్‌ఎస్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. నాగార్జునసాగర్‌, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో ఊపు మీదున్న టీఆర్‌ఎస్‌.. హుజురాబాద్‌తో విజయయాత్ర కొనసాగించాలని భావిస్తోంది. అయితే ప్రతికూలతలు ఏమున్నాయంటే.. ఈటలను అకారణంగా మంత్రివర్గం నుంచి తొలగించారని స్థానికుల్లో ఆగ్రహం. ఏడున్నరేళ్ల ప్రభుత్వంపై వ్యతిరేకత చేటు చేసేలా ఉంది.

దృష్టి సారించని కాంగ్రెస్‌
ఈ ఉప ఎన్నికపై కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటివరకు దృష్టి సారించలేదు. ఈ నియోజకవర్గంపై ఓ కమిటీ ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకుంది. ఇప్పటివరకు పార్టీ అభ్యర్థినే ఖరారు చేయలేదు. ఇక్కడ పార్టీకి నాయకులు కరువయ్యారు. ఉన్నగానొక్క పాడి కౌశిక్‌రెడ్డి పార్టీని వీడడం హస్తం పార్టీకి ఊహించని దెబ్బ తగిలింది. ఇక పార్టీ శ్రేణులంతా కౌశిక్‌ వెంట తరలివెళ్లారు. పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై ఈ నియోజకవర్గంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పార్టీ అభ్యర్థిగా పరిశీలనలో ఉన్న మాజీ మంత్రి కొండా సురేఖ పోటీపై విముఖంగా ఉన్నారు. అయితే భవిష్యత్‌ దృష్ట్యా పార్టీ ఆదేశాల మేరకు పోటీ చేసేందుకు సంసిద్ధత వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌ నామమాత్ర పోటీ కూడా ఇవ్వదని సొంత పార్టీ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది.

బరిలో మరికొందరు
ఇక తెలుగుదేశం పార్టీ గురించి అసలు చర్చించనవసరం లేదు. రాష్ట్రంలో ఉన్న మాదిరే హుజురాబాద్‌లో ఆ పార్టీకి దిక్కూదివానం లేదు. ఇక మరికొన్ని చిన్న పార్టీలు కూడా ఈ ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం ఉంది. మరికొందరు రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ భారీ సంఖ్యలో స్వతంత్రులుగా నిలిచేందుకు సిద్ధమవుతున్నారట. నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికలో జరిగినట్టు హుజురాబాద్‌ ఉప ఎన్నికకు భారీగా అభ్యర్థులు పోటీలో ఉంటారని వార్తలు వస్తున్నాయి. అది జరిగితే ఈ ఎన్నిక మరోసారి దేశవ్యాప్త చర్చ జరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న ఉప ఎన్నిక కొద్ది రోజుల్లో రానుంది.

మరిన్ని వార్తలు