Huzurabad Bypoll: గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలని మంత్రి గంగుల విజ్ఞప్తి

2 Oct, 2021 07:58 IST|Sakshi

హుజూరాబాద్‌లో నామినేషన్‌ అనంతరం గెల్లు శ్రీనివాస్‌

తొలిరోజు రెండు సెట్ల నామినేషన్‌ దాఖలు

నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మన్సూర్‌ అలీ మరో నామినేషన్‌

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/ హుజూరాబాద్‌:  ‘హుజూరాబాద్‌ బరిలో పోటీ చేస్తున్న మీ ఉద్యమబిడ్డను ఆశీర్వదించండి’అని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రజలను కోరారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, మంత్రి గంగుల కమలాకర్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డిలతో కలసి నామినేషన్‌ వేసేందుకు హుజూరాబాద్‌ ఆర్డీఓ కార్యాలయానికి వచ్చారు.

తొలిరోజు గెల్లు శ్రీనివాస్‌ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన అనంతరం గెల్లు శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లోని ప్రతీ ఒక్క ఓటరును వ్యక్తిగతంగా కలసి తనకు ఓటేయాల్సిందిగా కోరుతానని.. తాను గెలిచిన తరువాత నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని చెప్పారు.

ఈటల ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిందో.. 
అనంతరం రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచి తెలంగాణ కోసం పోరాడిన బడుగు బలహీనవర్గాల బిడ్డ గెల్లు శ్రీనివాస్‌ సేవలు గుర్తించి సీఎం కేసీఆర్‌ బీఫామ్‌ ఇచ్చారన్నారు. అన్నంపెట్టిన పార్టీకి వెన్నుపోటు పొడిచిన ఈటల రాజేందర్, ఆత్మగౌరవం పేరుతో భారతీయ జనతా పార్టీ పంచన చేరారని విమర్శించారు.

వ్యవసాయ చట్టాల పేరుతో రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన పార్టీ బీజేపీ అని మండిపడ్డారు. మాట్లాడితే ఆత్మగౌరవం అంటున్న ఈటల రాజేందర్‌.. ఎక్కడ ఆయన ఆత్మగౌరవానికి భంగం కలిగిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. 2001 నుంచి తెలంగాణ ఉద్యమాల్లో పాలుపంచుకున్న గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు. కాగా అన్న వైఎస్సార్‌ పార్టీ నుంచి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మహ్మద్‌ మన్సూర్‌ అలీ అనే వ్యక్తి హుజురాబాద్‌ నుంచి పోటీకి నిలబడ్డారు. ఆయన ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.

మరిన్ని వార్తలు