Huzurabad Bypoll: ఇనుగాల పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

26 Jul, 2021 20:41 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: బీజేపీకి మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.  రాజీనామా అనంతరం పెద్దిరెడ్డి సాక్షితో సంభాషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు దగ్గరై పనిచేయలనుకున్న పరిస్థితులు బీజేపీలో లేవని ఆరోపించారు. ఈటల రాజేందర్‌  చేరేటప్పుడు తన అవసరం అక్కడ లేదని అన్నారు. ఈటల చేరిక, చేరిన క్రమంపై తనకు చెప్పలేదని విమర్శించారు. ఆయన చేరడం కాదు, చేర్చుకున్న విధానం కరెక్ట్ కాదని తప్పుబట్టారు. 

ఇంకేమన్నారో ఆయన మాటల్లోనే..‘నాకు ఆత్మ గౌరవం ఉంది. ఇది నాకు నేను తీసుకున్న నిర్ణయమే. బీజేపీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు. నేను ఒక్కడినే కాదు. అందులో నేను ఇమడలేను. టీఆర్ఎస్ నుంచి ఆహ్వానం ఉంది.. నియోజక వర్గ ప్రజల అభివృద్ధి కొసం టీఆర్ఎస్‌తోనే సాధ్యం. పోటీలో టీఆర్ఎస్ అభ్యర్థి ఉంటారు. నేను పోటి చేయాలా లేదా అనేది టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంటుంది’. అని పేర్కొన్నారు. కాగా రాజీనామా అనంతరం పెద్దిరెడ్డి వ్యాఖ్యలతో ఆయన త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్లు స్పష్టమవుతోంది. హుజురాబాద్‌ ఉప ఎన్నిక రాబోతున్న తరుణంలో మరి గులాబీ అధిష్టానం పెద్దిరెడ్డికి టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ దక్కుతుందో లేక ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డికి టికెట్‌ వస్తుందో  వేచి చూడాలి.

కాగా మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బీజేపీ చేరికతో గత కొంతకాలంగా పార్టీకి పెద్దిరెడ్డి దూరంగా ఉంటున్నారు. అంతేగాక ఈటల రాకను పెద్దిరెడ్డి వ్యతిరేకించారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా బీజేపీలో కొనసాగేందుకు నా మనసు అంగీకరించడం లేదంటూ పేర్కొన్న పెద్దిరెడ్డి ఆ పార్టీలోకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు

మరిన్ని వార్తలు