Huzurabad Bypoll Results: జితేందర్‌ వర్సెస్‌ హరీశ్.. రెండు సార్లు పైచేయి ఒకరిదే

3 Nov, 2021 07:55 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: బీజేపీ తరఫున మహబూబ్‌నగర్‌ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ తరఫున మంత్రి హరీశ్‌రావు గతంలో దుబ్బాక ఉప ఎన్నికకు.. తాజాగా హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు ఇన్‌చార్జీలుగా వ్యవహరించారు. అన్నీ తామై వ్యవహరించిన ఆ ఇద్దరు నేతల్లో జితేందర్‌దే పైచేయి అయ్యింది. వాస్తవానికి దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ విజయం నల్లేరు మీద నడకే అనుకున్నారంతా. కానీ, జితేందర్‌ తన వ్యూహాలతో చక్రం తిప్పారు. దీంతో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు అనూహ్యంగా విజయం సాధించారు. దీంతో తొలిసారిగా మంత్రి హరీశ్‌రావుకు భంగపాటు ఎదురైంది. ఇప్పుడు హుజూరాబాద్‌లో సైతం ఈటల రాజేందర్‌ విజయం సాధించడంలో జితేందర్‌ మరోసారి హరీశ్‌పై పైచేయి సాధించారు.
చదవండి: హుజురాబాద్‌ ఫలితాలు: టీవీలో వీక్షిస్తూ మీసేవ కార్యాలయంలోనే

గిట్లెట్లాయే..
హుజూరాబాద్‌: ఉప ఎన్నిక ఉత్కంఠకు మంగళవారంతో తెరపడింది. 90 శాతం మంది ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో ఉన్నా.. చివరికి ప్రజలు మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కే పట్టం కట్టారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ స్వగ్రామం వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌లో బీజేపీకి 191ఓట్ల ఆధిక్యం రావడం చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలోని అన్నీ మండలాల్లో దాదాపు ప్రజాప్రతినిధులకు చుక్కెదురైంది.
చదవండి: Huzurabad Bypoll Result: కారుకు బ్రేకులేసిన అంశాలివే..

వీణవంకలో..
వీణవంక మండలం ఎలబాక గ్రామంలో బీజేపీకి 417 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇదే గ్రామంలో టీఆర్‌ఎస్‌ నుంచి జెడ్పీటీసీ మాడ వనమాల–సాదవరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ మవురం విజయభాస్కర్‌రెడ్డి, సర్పంచ్‌ కొత్తిరెడ్డి కాంతారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరు టీఆర్‌ఎస్‌ నుంచి ఇన్‌చార్జీలుగా వ్యవహరించినా కనీస ఓట్లు రాబట్టలేకపోయారు. అలాగే ఎంపీపీ ముసిపట్ల రేణుక స్వగ్రామం దేశాయిపల్లిలో టీఆర్‌ఎస్‌ ఘోర ఓటిమి పాలయింది.

హుజూరాబాద్‌లో..
ఎంపీపీ ఇరుమల్ల రాణి సొంత గ్రామం చెల్పూర్‌లో 86 ఓట్లు, జెడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి స్వగ్రామం కందుగులలో బీజేపీకి 467 ఓట్ల మెజార్టీ వచ్చింది. రాజాపల్లిలోపీఏసీఎస్‌ చైర్మన్‌ శ్యాసుందర్‌రెడ్డి పరిధిలో టీఆర్‌ఎస్‌ 36 ఓట్లతో లీడింగ్‌ సాధించింది. హుజూరాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందే రాధిక వార్డులో 36, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌ వార్డులో బీజేపీకి 33 ఓట్ల మెజార్టీ వచ్చింది. 

జమ్మికుంటలో..
జెడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ స్వగ్రామం ఇల్లందకుంటలో బీజేపీకి 265 ఓట్లు, జెడ్పీటీసీ శ్రీరాం శ్యామ్‌ స్వగ్రామం ఆబాది జమ్మికుంటలో 28 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఇల్లందకుంట ప్రాథమిక సహకార సంఘం చైర్మన్‌ పింగిళి రమేశ్‌ స్వగ్రామం విలాసాగర్‌లో, లక్ష్మాజిపల్లి సింగిల్‌ విండో చైర్మన్‌ ఉప్పుల తిరుపతిరెడ్డి, జమ్మికుంట ఎంపీపీ దొడ్డె మమత ఇలాఖాల్లో బీజేపీ ఆధిక్యం కనబర్చింది. ప్రముఖ నేతలైన పాడి కౌశిక్‌రెడ్డి (వీణవంక 884) కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు గ్రామాల్లో (సింగాపూర్‌ 133) టీఆర్‌ఎస్‌కు ఆధిక్యం దక్కింది.

మరిన్ని వార్తలు