హాట్‌హాట్‌గా హుజూరాబాద్‌

20 Jul, 2021 01:38 IST|Sakshi

ఉప ఎన్నిక ఎప్పుడో తెలియదు 

పార్టీల అభ్యర్థులపైనా స్పష్టత లేదు 

టీఆర్‌ఎస్‌ ముమ్మర ప్రచారం 

బీజేపీలో ఈటల జమున వ్యాఖ్యల కలకలం 

క్షేత్రస్థాయిలో మొదలుకాని కాంగ్రెస్‌ కార్యక్రమాలు 

సాక్షి, హైదరాబాద్‌: ఉప ఎన్నిక షెడ్యూల్‌పై స్పష్టత లేదు. ప్రధాన పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులెవరో తెలియదు. కానీ రోజూ ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తూ సభలు, సమావేశాలు.. కుల సంఘాలతో భేటీలు.. గడియారాలు, కుట్టుమిషన్ల పంపిణీతో ప్రలోభాలు.. ఫలానా గుర్తుకు ఓటేయాలంటూ ప్రచారాలు.. ఇదీ హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని తాజా పరిస్థితి. ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేసిన మరునాటి నుంచే టీఆర్‌ఎస్‌ ఆ నియోజకవర్గంపై దృష్టి కేంద్రీకరించింది. ఈటల చేరికతో బీజేపీ కూడా ఎన్నికల ప్రచారాన్ని తలపించే రీతిలో నియోజకవర్గాన్ని చుట్టబెడుతోంది. మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్‌ ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకున్నా, హుజూరాబాద్‌ ఉప ఎన్నిక లక్ష్యంగా వ్యూహ రచనపై కసరత్తు చేస్తోంది.  

టీఆర్‌ఎస్‌తో పోటీగా బీజేపీ 
హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌తో పోటాపోటీగా బీజేపీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సోమవారం నుంచి ఈటల పాదయాత్ర ప్రారంభించారు. అయితే బీజేపీ తరఫున రాజేందర్‌ లేదా తాను ఎవరో ఒకరు పోటీలో ఉండే అవకాశముందంటూ ఆయన భార్య జమున చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమయ్యా యి. ఇదెలా ఉన్నా తాజాగా ఈటల పాదయాత్రతో బీజేపీ ప్రచారం మరింత జోరందుకోనుంది.  

దీటైన అభ్యర్థి కోసం కాంగ్రెస్‌ అన్వేషణ 
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో ఇక్కడ కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. టీపీపీసీ ఎన్నికల కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహకు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక బాధ్యతలు అప్పగించారు. అయితే నియోజకవర్గంలో ఆ పార్టీ కార్యకలాపాలు ఇంకా ప్రారంభం కాలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి 60 వేల పైచిలుకు ఓట్లు సాధించిన పాడి కౌశిక్‌రెడ్డి ఆ పార్టీకి దూరమయ్యారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్, బీజేపీలకు ధీటైన అభ్యర్థిని వెతకడంపై కాంగ్రెస్‌ దృష్టి సారించింది.  

టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రోజుకో పేరు 
పార్టీ అభ్యర్థి ఎవరనే విషయంతో సంబంధం లేకుండానే టీఆర్‌ఎస్‌ ప్రచారాన్ని కొనసాగిస్తోంది. ఓ వైపు పార్టీ కేడర్‌ చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే మరోవైపు ఇతర పార్టీల ముఖ్య నేతలు, స్థానికంగా పలుకుబడి కలిగిన కుటుంబాలను టీఆర్‌ఎస్‌ గూటికి చేర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మాజీమంత్రి దామోదర్‌రెడ్డి కుమారుడు కశ్యప్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరగా, గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన పాడి కౌశిక్‌రెడ్డి ఈ నెల 21న పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి కుమారుడు రాజప్రతాప్‌రెడ్డి, ప్రవాస భారతీయుడు పాడి ఉదయనందన్‌రెడ్డితో టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యం లో పార్టీ అభ్యర్థిగా టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్, ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి ఎల్‌.రమణ, స్థానిక నేతలు చొల్లేటి కిషన్‌రెడ్డి, కంకణాల విజయారెడ్డి.. ఇలా రోజుకో పేరు తెరమీదకు వస్తోంది.  

మరిన్ని వార్తలు