Huzurabad Bypoll: దూకుడుగా టీఆర్‌ఎస్‌, బీజేపీ.. కాంగ్రెస్‌ సైతం!

8 Jul, 2021 09:09 IST|Sakshi

ఉప ఎన్నికపై కన్నేసిన పార్టీలు.. జనంలోకి వెళ్తున్న నేతలు

ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడి

క్యాడర్‌తో టీఆర్‌ఎస్‌..  సానుభూతితో ఈటల

అభ్యర్థి ఖరారుకాకున్నా  జోరుగా ప్రచారం

ఈటలకు వ్యతిరేకతను  మూటగట్టే పనిలో నేతలు\

టీఆర్‌ఎస్‌ ప్రచారాన్ని  తిప్పికొడుతున్న బీజేపీ

సీన్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న కాంగ్రెస్‌

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుందో తెలియదు. ప్రధాన పార్టీల అభ్యర్థులపై స్పష్టత లేదు. కానీ.. ముందస్తుగానే ఎన్ని కల వాతావరణం వచ్చేసింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రధాన పక్షాలు బలగాలను మోహరించాయి. అధికార పార్టీ తరఫున మంత్రులు మొదలుకొని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, స్థానిక ప్రజాప్రతినిధులు మండలాల వారీగా మకాం వేశారు. అటు ఈటలకు మద్దతుగా కాషా యదళం క్షేత్రస్థాయిలో ప్రచారం సాగిస్తోంది. టీఆర్‌ఎస్, బీజేపీల తరఫున ఇన్‌చార్జిలు, నాయకులు కార్యక్షేత్రంలో కూర్చొని వ్యూహాలు రచిస్తున్నారు. స్థూలంగా ప్రస్తుతం హుజూరాబాద్‌ నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితి ఇది. 

ఈటలను టార్గెట్‌ చేసిన టీఆర్‌ఎస్‌
టీఆర్‌ఎస్,ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల బరిలో నిలిచి చరిత్ర సృష్టించాలని భా విస్తున్న ఈటల రాజేందర్‌ను అష్టదిక్కుల దిగ్బంధం చేసే పనిలో అధికార పార్టీ ఉంది. కొన్నేళ్లుగా ఈటల వెంట ఉన్న టీఆర్‌ఎస్‌ నాయకులను, స్థా నిక ప్రజాప్రతినిధులను దూరం చేసే క్రతువును ఇప్పటికే విజయవంతంగా ఆ పార్టీ నాయకులు పూర్తి చేశారు.మంత్రి గంగుల కమలాకర్‌ టీఆర్‌ఎస్‌ క్యాడర్‌ను పూర్తిస్థాయిలో ఈటల నుంచి లా క్కోవడంలో విజయం సాధించారు. తాజాగా.. జమ్మికుంట మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ తు మ్మేటి సమ్మిరెడ్డి కూడా ఈటలకు గుడ్‌బై చెప్పారు.వార్డు మెంబర్ల నుంచి మొదలు కొని సర్పంచుల వరకు, ఎంపీటీసీల నుంచి ఎంపీపీలు, జె డ్పీటీసీల వరకు పార్టీతోనే ఉండేలా చక్రం తిప్పారు.

ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్నారని ఈటలతో పాటు బీజేపీ నాయకులు గగ్గోలు పెడుతున్నా, టీఆర్‌ఎస్‌ నాయకులు బీజేపీలోకి వెళితే కొనుగోలు చేసినట్లు తప్ప సొంతపార్టీలో ఉంటే కొనుగోలు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ టలను క్షేత్రస్థాయిలో దెబ్బకొట్టేందుకు మంత్రులు హరీశ్‌రావు,కమలాకర్,ఈశ్వర్‌ ప్రణాళికలు చేస్తున్నారు. వీరికి వరంగల్‌ నుంచి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సోషల్‌ మీడియా ప్రచారానికి బాల్క సుమన్‌ తోడయ్యారు. 

ఈటలతోపాటు గడపగడపకూ కమలదళం
ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన తన వెంట క్లిష్ట సమయంలో కలిసి రావాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఈటల సతీమణి జమున గ్రామాల్లో పర్యటిస్తూ సానుభూతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.బీజేపీ శ్రేణులు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు సాగుతున్నారు. బీజేపీ ఇన్‌చార్జిగా నియమితులైన మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌ రెడ్డి, ఇతర నాయకులు పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ మండలాల వారీగా ఈటలకు మద్దతును పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

ఈటలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టే పనిలో ఉన్నారు. రైతుబంధును వద్దన్నారని, కొన్ని కులాల ఓట్లు తనకు అక్కర్లేదన్నట్లుగా సోషల్‌ మీడియాలో సాగుతున్న ప్రచారాన్ని ఈటల మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డితో కలిసి బుధవారం ఖండించారు. మరోవైపు కరీంనగర్, వరంగల్‌ నుంచి దిగిన బీజేపీ శ్రేణులు, ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీ పీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో జనంలోకి చొచ్చుకొని పోతున్నారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ పూర్తయిన నేపథ్యంలో కేబినెట్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జి.కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావ్‌ వంటి నేతలు పూర్తిస్థాయిలో హుజూరాబాద్‌లో మకాం వేసే పనిలో ఉన్నారు.

త్వరలో రంగంలోకి రేవంత్‌రెడ్డి
పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి ఈ ఎన్నిక అత్యంత కీలకం కానుంది. తనను తాను రుజువు చేసుకునేందుకు హుజూరాబాద్‌ను వేదికగా మలచుకుంటారని అని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ మేరకు ఆయన స్వయంగా హుజూరాబాద్‌కు వచ్చి పరిస్థితిని సమీక్షించే అవకాశం ఉంది. అదే సమయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

  • ప్రస్తుత పార్టీ ఇన్‌చార్జి పాడి కౌశిక్‌ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఎంతవరకు కొనసాగిస్తారనే అంశం చర్చనీయాంశమైంది.
  • రేవంత్‌రెడ్డికి మద్దతు ప్రకటించిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఆయన అనుయాయులు పాడి కౌశిక్‌రెడ్డి అభ్యర్థిత్వం పట్ల సుముఖంగా లేరు. 
  • కౌశిక్‌ ముఖ్య అనుచరులు ఇప్పటికే టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారని, ఆయన కూడా కారెక్కడం ఖాయమని కాంగ్రెస్‌లోని ఓ వర్గం ప్రచారం చేస్తోంది. 
  • ఈటలకు వ్యతిరేకంగా ప్రగతిభవన్‌ నుంచి వచ్చిన స్క్రిప్ట్‌నే కౌశిక్‌ రెడ్డి చదివారని, కేటీఆర్‌ను కలిసి రహస్యంగా మాట్లాడడమే అందుకు నిదర్శనమని చెపుతున్నారు. 
  • పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి కజిన్‌ అయిన కౌశిక్‌ రెడ్డిని రేవంత్‌రెడ్డి ఎంత మేర పరిగణనలోకి తీసుకుంటారనేది ప్రశ్నగా     మిగిలింది. 
  • ఒకవేళ కౌశిక్‌ను కాదంటే ఎవరిని బరిలోకి దింపుతారనేది కూడా కాంగ్రెస్‌ ముందున్న సవాల్‌.
  • రెండేళ్ల క్రితం పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరువాత రెండోస్థానంలో నిలిచిన పార్టీ కాంగ్రెస్‌ కావడంతో ఆచితూచి వ్యవహరించాలని రేవంత్‌ భావిస్తున్నారు. 
మరిన్ని వార్తలు