హుజూరాబాద్‌ బీసీలకే!.. అధిష్టానం సంకేతాలు

1 Aug, 2021 03:44 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ కేడర్‌కు అధిష్టానం సంకేతాలు

గులాబీ గూటికి చేరిన నేతలతో అధినేత స్పష్టీకరణ

ఆ బీసీ అభ్యర్థి ఎవరనేదే సస్పెన్స్‌

పార్టీ వర్గాలు, ఇంటెలిజెన్స్‌ ద్వారా ప్రజలనాడిపై ఆరా

అభ్యర్థిపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం 

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మొత్తం 2.26 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
ఇందులో బీసీలు 1.03 లక్షలు, ఓసీ ఓటర్లు 43 వేలు, ఎస్సీ ఓటర్లు 51 వేలు, ఇతర కులాలవారు మరో 33,500, ఎస్టీ ఓటర్లు 4 వేలకుపైగా, మైనార్టీ ఓటర్లు 9 వేల మంది ఉన్నారు. 

సాక్షి, ప్రతినిధి, వరంగల్‌: ఉప ఎన్నిక జరగనున్న హుజూరాబాద్‌ అభ్యర్థి ఎంపికపై అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ భారీ కసరత్తు చేస్తోంది. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అత్యధిక ఓటుబ్యాంకు కలిగిన సామాజికవర్గాలను ఆకట్టుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుండగా, తాజాగా దళితబంధును తెరపైకి తెచ్చింది. తన స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని తీవ్రంగా శ్రమిస్తున్న బీజేపీ నేత, మాజీమంత్రి ఈటల రాజేందర్‌ ప్రజాదీవెన పాదయాత్రలో బీసీ నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ సైతం బీసీ అభ్యర్థినే బరిలోకి దింపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇంటెలిజెన్స్‌ నివేదికలు, సర్వేల ద్వారా ప్రజలనాడిని పసిగట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, కేడర్‌కు సంకేతాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. 

సర్వేలు, ఇంటెలిజెన్స్‌ నివేదికలే ప్రామాణికం 
ఈటల రాజీనామా తర్వాత ఉప ఎన్నికలు ఖాయమని తేలడంతో పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు ఆ పార్టీ టికెట్‌ కోసం ప్రయత్నాలు సాగించారు. నిన్న మొన్నటిదాకా పాడి కౌశిక్‌రెడ్డి పేరు ప్రధానంగా వినిపించింది. ఆ తర్వాత ముద్దసాని పురుషోత్తంరెడ్డి, పార్లమెంట్‌ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీ కాంతరావు భార్య సరోజనమ్మ పేర్లు తెరపైకి వచ్చాయి. వరుసగా రెండు పర్యాయాలు హుజూరాబాద్‌ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన ఇనుగాల పెద్దిరెడ్డి శుక్రవారం గులాబీ కండువా కప్పుకోవడంతో ఆయన పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే సర్వేలు, ఇంటెలిజెన్స్‌ నివేదికల ఆధారంగా బీసీ సామాజికవర్గాలకు హుజూరాబాద్‌ టికెట్‌ ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని పెద్దిరెడ్డి, కౌశిక్‌రెడ్డిలకు కూడా అధినేత స్పష్టం చేసినట్లు తెలిసింది. 

బీసీల ఓట్లపై ఫోకస్‌? 
హుజురాబాద్‌ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో దాదాపు సగం మంది ఉన్న బీసీలపైనే టీఆర్‌ఎస్‌ ప్రధానంగా దృష్టి పెట్టింది. అత్యధిక జనాభా ఉన్న పద్మశాలి, ముదిరాజ్, మున్నూరుకాపు, గౌడ, యాదవ, ఇతర బీసీ కులాల ఓట్లు టీఆర్‌ఎస్‌కు పడేలా అధిష్టానం ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతో టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న గెల్లు శ్రీనివాస్‌ యాదవ్, బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బీసీ ఉద్యమాల నేపథ్యం ఉన్న కృష్ణమోహన్‌రావు గతంలో రెండు పర్యాయాలు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఈ ముగ్గురిలో ఒకరికి ఇస్తారా? లేక కొత్త బీసీ నేత పేరును తెరమీదకు తెస్తారా? అన్న చర్చ కూడా జరుగుతోంది.   

మరిన్ని వార్తలు