Huzurabad: రమణ రాకతో బీసీ వర్గాల్లో పాజిటివ్‌ ఇమేజ్‌ పెరుగుతుందా?

10 Jul, 2021 10:58 IST|Sakshi

హుజూరాబాద్‌లో జనంలోకి టీఆర్‌ఎస్‌

అధికారిక కార్యక్రమాల  ద్వారా ఈటలపై ధ్వజం

సమస్యలపై యుద్ధ ప్రాతిపదికన  స్పందన

ఈటలే వెనుకబాటుకు  కారణమంటూ వ్యాఖ్యలు

మరోవైపు సామాజిక వర్గాల వారీగా సమావేశాలు

రంగంలోకి దిగనున్న టీడీపీ మాజీ నేత ఎల్‌.రమణ

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: అందరి దృష్టిని ఆకర్షిస్తున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కోసం అధికార టీఆర్‌ఎస్‌ దూకుడు పెంచింది. మాజీ మంత్రి ఈటలను అష్టదిగ్బంధం చేసేందుకు అవకాశం ఉన్న అన్ని వనరులను వాడుతోంది. ఇప్పటికే నియోజకవర్గంలో మోహరించిన మంత్రులు, ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ క్యాడర్‌ ఈటల వెంట వెళ్లకుండా చూడడంలో తొలి విజయం సాధించారు. అదే ఊపులో మండల కేంద్రాలు, గ్రామాల వారీగా స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమవుతూ ప్రజలు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెడుతున్నారు. ఇంటర్నల్‌ రోడ్లు, భగీరథ నీళ్లు మొదలుకొని డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల వరకు జనం కోరికలు తీర్చేందుకు హామీలు గుప్పిస్తున్నారు. గ్రామాల్లో ఇంకా సమస్యలు రాజ్యమేలడానికి ఇన్నాళ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌ కారణమని తమ ప్రసంగాల ద్వారా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

శుక్రవారం హుజూరాబాద్‌లో పర్యటించిన మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌ రావు నియోజకవర్గ వెనుకబాటుకు ఈటలే కారణమని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు అవసరమైన అన్ని వనరులు సమకూర్చే అవకాశం ఉండి కూడా ఏమీ చేయలేదని, తన ఆస్తులు పెంచుకునేందుకు మాత్రమే ఈటల ప్రయత్నించారని విమర్శించారు. మంత్రి గంగుల కమలాకర్‌ కలెక్టర్‌ శశాంకతో కలిసి సిరసపల్లిలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించారు. హుజూరాబాద్‌లో అర్హులైన వారందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని, ముందుగా సిరిసపల్లిలోని రెండు ప్రాంతాల్లో నిర్మిస్తున్న 500 ఇళ్లను అర్హులకు అందించి, మిగతా వారికి కూడా దశలవారీగా ఇళ్లు ఇప్పిస్తామని మంత్రి గంగుల హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలను కలుస్తూ, స్థానిక సమస్యలను ఎత్తి చూపుతున్నారు. ఆరుసార్లు గెలిచిన ఈటల రాజేందర్‌ కారణంగానే వెనుకబాటుకు గురైనట్లు స్థానికులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. 

అధికార యంత్రాంగం అండతో..
మండలాలు, గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు తీసుకొచ్చిన పెండింగ్‌ సమస్యలను వీలైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించేలా మంత్రులు యాక్షన్‌లోకి దిగుతున్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర అధికారులకు ఫోన్‌లు చేసి సంబంధిత సమస్యను తక్షణమే పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రావడం లేదన్న సర్పంచుల ఫిర్యాదులు, రైతుబంధు, పట్టా భూముల విషయంలో రెవెన్యూ తిరకాసులు, పింఛన్లు, సీఎంఆర్‌ఎఫ్, కళ్యాణలక్ష్మి వంటి ఏ సమస్యనైనా తక్షణమే పరిష్కారమయ్యేలా అధి కార యంత్రాంగాన్ని ఆదేశిస్తున్నారు. ‘మీరు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నాయకుడు ఈ చిన్న సమస్యలను కూడా పరిష్కరించలేదు’ అంటూ ఈటలకు వ్యతిరేక భావన కలిగేలా వ్యవహరిస్తున్నారు. 

ఎల్‌.రమణతో బీసీల్లోకి..
నియోజకవర్గంలో బీసీ కులాలపై ప్రధానంగా అధికార పార్టీ దృష్టి పెట్టింది. ఇక్కడ పద్మశాలి వర్గం ఓట్లు అధికంగా ఉండడంతో టీటీడీపీకి రాజీనామా చేసిన అధ్యక్షుడు ఎల్‌.రమణను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం టీడీపీకి రాజీనామా చేస్తూ పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖ పంపిన రమణ రెండు రోజుల్లో టీఆర్‌ఎస్‌లో అధికారికంగా చేరనున్నారు. ఆయనను పద్మశాలి వర్గానికే పరిమితం చేయకుండా మంత్రి గంగులతోపాటు బీసీ నాయకుడిగా జనంలోకి తీసుకెళ్లాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. రమణ రాకతో బీసీ వర్గాల్లో కొంత పాజిటివ్‌ ఇమేజ్‌ పెరుగుతుందని అధికార పార్టీ అంచనా.

సామాజిక సమీకరణాలతో..
గతంలో ఎన్నడూ లేని విధంగా హుజూరాబాద్‌లో ఈసారి సామాజిక సమీకరణల అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. బీసీ, ఎస్సీ వర్గానికి చెందిన మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌ ఆయా కులాలకు చెందిన ముఖ్య నాయకులు, సంఘాలతో సమావేశమై ఈటల తీరును విమర్శిస్తున్నారు. ఈటలను ‘దొర’గా అభివర్ణిస్తున్న మంత్రి గంగుల బీసీ వర్గానికి చెందిన ఒక్కో సామాజికవర్గంతో సమావేశమై తాయిలాలు ప్రకటిస్తున్నారు. మంత్రి కొప్పుల సైతం ఎస్సీ వర్గాలను ఒకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని మండలాలకు చెందిన కుల సంఘాల నాయకులతో మంత్రులు సమావేశాలు జరిపారు. స్థానిక ఎంపీపీలు, జెడ్పీటీసీల సహకారంతో కులాల వారీగా గ్రామాల్లో కూడా ఓటర్లను ఆకర్షించేందుకు పలు తాయిలాలు ప్రకటిస్తున్నారు. 

మరిన్ని వార్తలు