కేసీఆర్‌ వెంటే మేము.. స్పష్టం చేసిన కమలాపూర్‌ నాయకులు

23 May, 2021 02:57 IST|Sakshi

మంత్రి హరీశ్, మాజీ ఎంపీ వినోద్‌కు స్పష్టం చేసిన కమలాపూర్‌ నేతలు 

పార్టీలో కొనసాగితేనే భవిష్యత్తు ఉంటుందని కౌన్సెలింగ్‌  

సాక్షి, హైదరాబాద్‌/కమలాపూర్‌: టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోనే కొనసాగుతామని హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని కమలాపూర్‌ మండలానికి చెందిన ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ మేరకు వారు మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌లతో శనివారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. భేటీ అయినవారిలో కమలాపూర్‌ ఎంపీపీ తడక రాణీ శ్రీకాంత్, పీఏసీఎస్‌ చైర్మన్‌ పేరాల సంపత్‌రావు, డీసీసీబీ డైరక్టర్‌ పి.కృష్ణప్రసాద్‌ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారికి హరీశ్, వినోద్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ‘పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న మీరందరూ అధినేత కేసీఆర్‌ నిర్ణయాన్ని గౌరవించి టీఆర్‌ఎస్‌ వెంటే నడవండి.

పార్టీ మీకు అన్నివిధాలా అండగా నిలబడుతుంది. ఈటల రాజేందర్‌ పట్ల ఎవరికీ వ్యక్తిగతంగా ద్వేషం లేదు. కానీ, పార్టీకి నష్టం చేసే కార్యకలాపాలు చేసినందు వల్లే ముఖ్యమంత్రి ఆయనను మంత్రి పదవి నుంచి భర్తరఫ్‌ చేశారు’అని పేర్కొన్నారు. అనంతరం కమలాపూర్‌ నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆవిర్భావం నుంచి టీఆర్‌ఎస్‌లో ఉన్నామని, రెండో ఆలోచనకు తావు లేకుండా తాము టీఆర్‌ఎస్‌ నీడలోనే పనిచేస్తామని స్పష్టం చేశారు. పార్టీ కేడర్‌ అంతా కేసీఆర్‌ వెంటే నడుస్తుందని, నియోజకవర్గ అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.  

కొనసాగుతున్న మంతనాలు 
పార్టీ అధినేత కేసీఆర్‌ ఆదేశాల మేరకు హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఇన్‌చార్జీలుగా పనిచేస్తున్న నేతలు కేడర్‌తో మంతనాలను ముమ్మరం చేశారు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావులు పార్టీ ప్రజాప్రతినిధులు, వివిధ స్థాయిల నేతలెవరూ మాజీమంత్రి ఈటల వైపు వెళ్లకుండా కౌన్సెలింగ్‌ చేస్తున్నారు. జిల్లాస్థాయిలో మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్రస్థాయిలో హరీశ్, వినోద్‌కుమార్‌లు నేతలతో మాట్లాడి నచ్చచెబుతున్నారు. ఇదిలా ఉండగా, శుక్రవారం సీఎం కేసీఆర్‌ వరంగల్‌ పర్యటన సందర్భంగా ఎంపీ కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు నివాసానికి వెళ్లారు. వారి మధ్య హుజూరాబాద్‌ నియోజకవర్గ రాజకీయాలు ప్రస్తావనకు వచ్చి ఉంటాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.   

మరిన్ని వార్తలు