BJP: వ్యూహాలు సిద్ధం.. హుజూరాబాద్‌లో గెలవాల్సిందే..

2 Oct, 2021 02:02 IST|Sakshi

ఉపఎన్నికపై రాష్ట్ర పార్టీకి బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశాలు

తదనుగుణంగా వ్యూహాలు సిద్ధం చేసిన నేతలు

సర్వశక్తులూ ఒడ్డుతూ ఓటర్లకు చేరువయ్యేందుకు యత్నాలు

ఈటల ఇమేజీ ఉపయోగపడుతుందనే భావన

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉపఎన్నిక బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ స్థానాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కైవసం చేసుకోవాలన్న పార్టీ అధినాయకత్వం ఆదేశాలతో రాష్ట్ర పార్టీ తదనుగుణ వ్యూహాలు సిద్ధం చేసింది. ఇరవై ఏళ్లకు పైగా టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతగా, కేసీఆర్‌ ఉద్యమ సహచరుడిగా కొనసాగి, ఆరు పర్యాయాలు ఎదురులేకుండా ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌ ఇమేజీ తమకు తప్పకుండా ఉపయోగపడుతుందని బీజేపీ గట్టిగా నమ్ముతోంది.

మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన ఈటల వెంట.. ఆ పార్టీ ముఖ్యనేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు చాలామంది బీజేపీలోకి రాకపోవడంతో సొంతపార్టీ కార్యకర్తలతోనే బూత్‌స్థాయి ఓటర్ల మద్దతును కూడగట్టేందుకు నడుం బిగిస్తోంది. హుజూరాబాద్‌ ప్రజల్లో ఈటలకున్న మంచిపేరును వినియోగించుకుని అధికార పార్టీగా టీఆర్‌ఎస్‌కు ఉండే అదనపు అవకాశాలను అధిగమించాలని భావిస్తోంది. వ్యూహాత్మకంగా అన్నిస్థాయిల్లో పార్టీ ఇన్‌చార్జీలను నియమించుకుని ముందుకు సాగుతోంది.

ఇప్పుడు గెలిస్తే ‘2023’కు ఊపు
అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రధానపోటీదారుగా నిలిచి గణనీయమైన సంఖ్యలో కార్పొరేటర్లు గెలుపొందారు. ఆ తర్వాత  నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ పరిస్థితిని అధిగమించి ఇప్పుడు హుజూరాబాద్‌ను చేజిక్కించుకుంటే, 2023 అసెంబ్లీ ఎన్నికల కసరత్తులో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్లేందుకు ఈ విజయం దోహదపడతుందని బీజేపీ భావిస్తోంది.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలు, నియంతృత్వ పోకడలు ఇప్పటికే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగామని అంచనా వేస్తోంది. ఈటల రాజేందర్‌ రాజీనామా తర్వాతే దళిత బంధు స్కీం ప్రకటించడం, హుజూరాబాద్‌లో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడంలోని అధికార పార్టీ ఎత్తుగడలను కూడా వివరించగలిగామని భావిస్తోంది. దళితబంధు ద్వారా హుజూరాబాద్‌ లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 లక్షలు డిపాజిట్‌ చేసినా ఆ మొత్తాన్ని డ్రా చేయకుండా స్తంభింపచేయడం (ఫ్రీజింగ్‌)తో ఏర్పడిన అసంతృప్తి, ఇంకా ఈ లబ్ధి అందని వారిలో ఉన్న వ్యతిరేకత వల్ల ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశాలున్నాయని బీజేపీ నాయకులు అంచనా వేస్తున్నారు.

వికేంద్రీకరణ వ్యూహంతో ఓటర్ల వద్దకు.. 
ఈసీ వివిధ రూపాల్లో విధించిన ఆంక్షల నేపథ్యంలో తొలుత ఎన్నికల ప్రచారానికి రావాలని భావించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇప్పుడా ఆలోచనను విరమించుకున్నారు. కేవలం వెయ్యిమందితోనే బహిరంగసభలు నిర్వహించాల్సి ఉండడంతో ఇతర ముఖ్యనేతలు సైతం ఈ ప్రచారంలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఎక్కడకక్కడ వికేంద్రీకరణ వ్యూహాన్ని అనుసరించాలని నేతలు నిర్ణయించారు. వివిధ మండలాలు, గ్రామాలుగా చిన్న చిన్న బృందాలుగా విడిపోయి వీలైనంత ఎక్కువ మంది ఓటర్లను కలుసుకునేలా కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నారు.

బూత్‌ స్థాయిలో శక్తి కేంద్రాలు 
క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్‌ సమన్వయానికి, పోలింగ్‌ బూత్‌స్థాయిలో విస్తృత ప్రచారానికి శక్తి కేంద్రాలను ఏర్పాటు చేశారు. నాలుగైదు పోలింగ్‌ బూత్‌లను కలిపి లేదా ఒకటి, రెండు గ్రామాలకు ఒకటి చొప్పున ఇప్పటికే మొత్తం 98 శక్తి కేంద్రాలకు స్థానిక ఇన్‌చార్జిల నియామకం పూర్తయింది. ఓటర్ల జాబితాలోని ఒక్కో పేజీలో ఉన్న ఓటర్లను కలిసి, సమన్వయం చేసేందుకు పన్నా ప్రముఖ్‌ (ఓటర్ల జాబితాలోని ఒక్కో పేజీ ఓటర్ల ఇన్‌చార్జి)లను నియమించారు.

దసరా తర్వాత దూకుడే... 
దసరా పండుగ దాకా ‘గ్రౌండ్‌వర్క్‌’పూర్తిచేసి ఆ తర్వాత ఒక్కసారిగా దూకుడు పెంచాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఎన్నికల తేదీ సమీపించే కొద్దీ వేడిపెంచి ప్రచారాన్ని ఉధృతం చేసే వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈనెల 15 తర్వాత రాష్ట్రపార్టీ నాయకత్వం మొదలు, అన్నిస్థాయిల్లోని నాయకులు పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రణాళికల రూపకల్పన, ప్రచారంలో నిమగ్నమై ప్రత్యక్షంగా ఆయా అంశాలను పర్యవేక్షించనున్నారు. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ పోటీపడుతుండగా, కాంగ్రెస్‌ తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.

కేసీఆర్‌ వ్యూహం ఇక్కడ పనిచేయదు
ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయం. అధికార టీఆర్‌ఎస్‌ ఎలాంటి ప్రలోభాలకు గురిచేసినా ఓటర్లు వాటికి లొంగే పరిస్థితే లేదు. హుజూరాబాద్‌ ఆత్మగౌరాన్ని ప్రజలు కాపాడుకుంటారు. కేసీఆర్‌ ఏ వ్యూహం పన్నినా ఇక్కడ పనిచేయదు. వారి అబద్ధపు అస్త్రాలన్నీ ఖర్చయిపోయాయి. తమ గుండెల్లో నిలిచి, వారిని అనేక సందర్భాల్లో, కష్టకాలంలో ఆదుకున్న ఈటల పక్షానే ప్రజలు నిలవబోతున్నారు. ఏ ఊరికి వెళ్లినా అంతా ఈటల నామస్మరణే చేస్తున్నారు. కమలం గుర్తుకే ఓటేస్తామని కరాఖండిగా చెబుతున్నారు.
 – బీజేపీ హుజూరాబాద్‌ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఏపీ జితేందర్‌రెడ్డి  

మరిన్ని వార్తలు