హరీష్‌రావుకు కూడా నా గతే పడుతుంది: ఈటల ఫైర్‌

7 Jul, 2021 12:16 IST|Sakshi
మాట్లాడుతున్న ఈటల రాజేందర్‌ 

అధికారులను మార్చినా ఓటు వేసేది మా ప్రజలే..

మాజీ మంత్రి, బీజేపీ నేత రాజేందర్‌

సాక్షి, కమలాపూర్‌ : హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని మండలాలకు వస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్య బద్ధంగా ఓట్లు అడగాలే తప్ప నీచంగా వ్యవహరించొద్దని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ హితవు పలికారు. కమలాపూర్‌ కమ్యూనిటీ హాల్‌లో మంగళవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘టీఆర్‌ఎస్‌లో చేరేటప్పటికే నాకు వందల కోట్ల ఆస్తులున్నాయి.. నేను ప్రజల గురించి ఆలోచిస్తుంటే నా మీద కుట్ర చేసి చిల్లర ఆరోపణలతో తొలగించి మంత్రి పదవి లాగేసుకున్నరు.. దమ్ముంటే రాజీనామా చేయమన్నరు చేసిన.. కానీ మీరు చేస్తున్నదేంటి.. ప్రతిపక్షం లేకుండా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు’ అని విమర్శించారు.

నేను నీతిగా హుజూరాబాద్‌ ప్రజల మీద నమ్మకంతో రాజీనామా చేసి వచ్చిన.. వారి కష్ట సుఖాల్లో నేనే ఉన్నా.. ఇప్పుడు యావత్‌ తెలంగాణ హుజూరాబాద్‌ వైపే చూస్తోన్నది.. కేసీఆర్‌ నా బొండిగ పిసుకడానికి సిద్ధమయ్యాడు.. ఆయన అహంకారాన్ని, డబ్బుని, అధికారాన్ని తొక్కి పడేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కమలాపూర్‌ ఇన్‌చార్జ్‌ అయితే ఎక్కడ, ఎలా సంపాదించాడో తెలియదు.. ఆయన డబ్బులనే నమ్ముకున్నాడు. స్కూల్‌ను బార్‌గా మార్చిన నీకు కర్రు కాల్చి వాత పెడుతం బిడ్డా.. అని హెచ్చరించారు. జమ్మికుంటలో వర్ధన్నపేటలో ఆయన తిరుగుతూ నాయకులను కొనుగోలు చేస్తున్నాడు. మీరు నాయకులను కొనవచ్చు కానీ ప్రజలను కొనలేరు.. అది మీకే కాదు కేసీఆర్‌ జేజమ్మకు కూడా సాధ్యం కాదని స్పష్టం చేశారు.

కొంత మంది ఎమ్మెల్యేలు బానిసలుగా ఉండవచ్చు.. ఇంత ఘోరంగా ఉంటారా.. మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి.. రేపు మీ నియోజకవర్గాల్లో మీ పరిస్థితి కూడా ఇంతేనని గుర్తుంచుకోండి.. నన్ను విమర్శిస్తే సూర్యుడిపై ఉమ్మేసినట్లే.. మంత్రి హరీశ్‌రావుకు ఇక్కడి నుంచి మందిని తీసుకుపోయి దావత్‌ ఇచ్చి డబ్బులు ఇయ్యడమే మీపనా.. ఆయన సీఎం దగ్గర మెప్పు పొందాలని చూస్తున్నాడు.. ఆయనకు కూడా నా గతే పడుతుంది.. అని హెచ్చరించారు. సొంత పార్టీ నాయకులకే ఖరీదు కట్టిన దుర్మార్గపు పార్టీ టీఆర్‌ఎస్‌.. ఇది చూసి దేశమంతా తల దించుకుంటోందని అన్నారు. ఇక్కడ జరిగే ఉప ఎన్నికలో మిగతా పార్టీల డిపాజిట్లు గల్లంతయ్యేలా తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరారు. పోలీసులు చట్టానికి లోబడి పని చేయకుండా మా వాళ్లను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోమని ఈటల స్పష్టం చేశారు.

అసలు మీరు చట్టాలని లోబడి పని చేస్తున్నారా? చుట్టంగా పని చేస్తున్నారా అని డీజీపీ, సీఎస్‌ను ప్రశ్నించారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు.. బానిసలుగా పని చేస్తే ఖబడ్దార్, బీ కేర్‌ఫుల్‌ అని పోలీసులను హెచ్చరించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు రావు అమరేందర్‌రెడ్డి, కరీంనగర్‌ జిల్లా ఉపాధ్యక్షుడు సంపత్‌రావు, మండల అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, సర్పంచ్‌ శ్రీనివాస్, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ వెంకట్‌రెడ్డి, నాయకులు కుమారస్వామిగౌడ్, సాంబరావు, శోభన్, రాజు తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు