నిరుద్యోగ భృతి ఏమైంది?.. టీఆర్‌ఎస్‌ పార్టీపై ఈటల ఫైర్‌

9 Jun, 2021 14:47 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: అధికార టీఆర్‌ఎస్‌ పార్టీపై మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తీవ్రంగా మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ కుట్రలను హుజూరాబాద్ ప్రజలు తిప్పికొడతారని విమర్శించారు. నాయకుడంటే అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల హృదయాల్లో నిలిచి పోవలసి వస్తుందని హితవు పలికారు.ఈ మేరకు ఇల్లందకుంటలో ఈటల రాజేందర్‌ బుధవారం పర్యటించారు. నియోజకవర్గంలోని సమస్యలపై ప్రెస్ మీట్ పెట్టి టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపఎన్నిక వస్తుందంటే అక్కడ కేసీఆర్‌ వరాలు ప్రకటిస్తారని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్‌ నిరుద్యోగ భృతి హామీ ఏమైందని ప్రశ్నించారు. 

తన రాజీనామాతో సీఏం కొత్త రేషన్ కార్డు మంజూరు చేశారని ఆదే విధంగా రెండేళ్లుగా నిలిచిపోయిన కొత్త పెన్షన్లు, తెల్లరేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 57 సంవత్సరాలు నిండిన వారికి తక్షణమే పెన్షన్ మంజూరు చేయాలని తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని వావిలాల, చల్లూరు కొత్త మండలాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.గతంలో హుజూరాబాద్ జిల్లా కావాలని కోరినట్లు గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సౌలభ్యం కోసం కొత్త మండలాలతో పాటు జిల్లా ఏర్పాటు అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు.

ఎక్కడ ఉప ఎన్నిక వచ్చిన వరాల జల్లు కురిపించే సీఎం కేసీఆర్, హుజురాబాద్‌కు విరివిగా నిధులు, పనులు మంజూరు చేయాలని ఈటల డిమాండ్‌ చేశారు. చిన్న గ్రామాలకు 50 లక్షలు, పెద్ద గ్రామాలకు కోటి రూపాయల చొప్పున వెంటనే మంజూరు చేయాలని పేర్కొన్నారు. గొర్రెల మందపై తోడేలు పడ్డట్లు కొందరు వ్యవహరిస్తూ పచ్చని సంసారంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నంగనాచి మాటలతో నియోజకవర్గ ప్రజలను ప్రలోభ పెడుతున్నారని, రాజభక్తి చాటుకుంటే చాటుకొని కానీ తనపై విమర్శలు చేస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు.

ప్రభుత్వం ప్రకటించే తాయిలాలకు డబ్బు సంచులకు ప్రజలు లొంగరని, ప్రజల గుండెల్లో తాను ఉన్నానని ఈటల పేర్కొన్నారు. ధర్మ యుద్ధం కురుక్షేత్రం జరుగుతుందని, ఆనాడు పాండవులు గెలిచినట్లు రాబోయే ఉప ఎన్నికలో హుజూరాబాద్ ప్రజలు గెలుస్తారని అన్నారు. పిడికెడు మంది కల్లబొల్లి మాటలు చెప్పినా, హుజూరాబాద్ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని హెచ్చరించారు. భావజాలం, ఆత్మ గౌరవం ఎవరికీ ఉందో హరీష్ రావే చెప్పాలని, తాను అక్రమంగా ఒక్క ఎకరం ఆక్రమించుకున్న ముక్కు నేలకు రాస్తానని ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు.

చదవండి: హుజూరాబాద్‌ నుంచే మరో ఉద్యమం
Etela Rajender: రాజీనామా ప్రకటన తరువాత తొలిసారి..

మరిన్ని వార్తలు