Huzurabad Bypoll: అభ్యర్థిగా గెల్లు; రంగంలోకి హరీష్‌.. సై అంటే సై

11 Aug, 2021 12:35 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: హుజురాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌ దూకుడు పెంచింది. ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను సీఎం కేసీఆర్‌ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఇక గెలుపు బాధ్యతలు తీసుకున్న మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్‌ బుధవారం హుజురాబాద్‌లో బైక్‌ ర్యాలీలో పాల్గొన్నారు. గెల్లుతో కలిసి నియోజకవర్గంలో పర్యటించారు. 

కాగా ఈనెల 16న హుజురాబాద్‌ మండలం శాలపల్లిలో గులాబీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభ నేపథ్యంలో.. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌ ఈ సందర్భంగా పరిశీలించారు. ఇక ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ను వీడిన ఈటల.. మంత్రి పదవితో పాటు హుజురాబాద్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. బీజేపీలో చేరిన ఈటల.. నియోజకవర్గంలో పర్యటిస్తూ టీఆర్‌ఎస్‌ తీరును ఎండగడుతున్నారు. అయితే, ఇంతవరకు బీజేపీ తరఫున ఈటల అభ్యర్థిత్వం అధికారికంగా ఖరారు కాకపోగా.. గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను టీఆర్‌ఎస్‌ తమ అభ్యర్థిగా ప్రకటించడం గమనార్హం. 

చదవండి: అందుకు భార్య సమ్మతి అవసరం లేదు: హైకోర్టు

మరిన్ని వార్తలు