టీఆర్‌ఎస్‌లోకి కౌశిక్‌ రెడ్డి.. 2 నెలల క్రితమే  చెప్పిన ‘సాక్షి’

13 Jul, 2021 08:01 IST|Sakshi

 ఫోన్‌ సంభాషణల లీక్‌తో  కాంగ్రెస్‌కు కౌశిక్‌ రాజీనామా

‘హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ టికెట్టు నాకే’ నన్న కాంగ్రెస్‌ ఇన్‌చార్జి

టీపీసీసీ షోకాజ్‌ నోటీస్‌.. పార్టీకి రాజీనామా

త్వరలో అధికారికంగా టీఆర్‌ఎస్‌లో చేరిక

 ఈటల ఎపిసోడ్‌ నుంచే టీఆర్‌ఎస్‌ మౌత్‌పీస్‌గా కౌశిక్‌

ప్రైవేటు కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో రహస్య చర్చలు

టీఆర్‌ఎస్‌ టికెట్‌ అంశాన్ని ముందే చెప్పిన ‘సాక్షి’

సాక్షి, కరీంనగర్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో సోమవారం వైరల్‌ అయిన ఈ ఆడియో సంభాషణలు కాంగ్రెస్‌ పార్టీని ఇరకాటంలో పెట్టా యి. కమలాపూర్‌ మండలం మాదన్నపేటకు చెందిన విజయేందర్‌తో హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి పాడి కౌశిక్‌ రెడ్డి, ఆ వెంటనే కౌశిక్‌ అనుచరుడు కమలాపూర్‌ మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు బొల్లం రాజిరెడ్డి మాట్లాడిన ఫోన్‌ సంభాషణ లీకై రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ పరిణామం ఇప్పటివరకు కాంగ్రెస్‌ అభ్యర్థిని తానేనని చెప్పుకుంటూ వస్తున్న కౌశిక్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ గుట్టును రట్టు చేసింది. ఈ వ్యవహారంతో జిల్లా, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్‌ నాయకులు ఖంగుతిన్నారు.

కౌశిక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లోకి వెళతారని, ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. తాను కాంగ్రెస్‌ నుంచే పోటీ చేస్తానని పదేపదే చెప్పే కౌశిక్‌ రెడ్డి మాటలతో కాంగ్రెస్‌ నేతలకు ఎక్కడో చిన్న ఆశ ఉండేది. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యాక ఆయన నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం ఇవ్వడం, కాంగ్రెస్‌ టికెట్టుపై పోటీ చేస్తానని, మరోసారి అవకాశం ఇవ్వాలని ఆయన్ను కోరడం వంటి చర్యలతో కౌశిక్‌ కాంగ్రెస్‌ నుంచే పోటీ చేస్తారని భావించారు. అయితే.. సోమవారం నాటి ఫోన్‌ సంభాషణతో కాంగ్రెస్‌ పార్టీ నాయకుల కళ్లు బైర్లు కమ్మాయి. టీఆర్‌ఎస్‌ నుంచి స్పష్టమైన హామీతోనే ‘టికెట్టు నాకే ఖరారైంది’ అని కౌశిక్‌రెడ్డి చెపుతున్నారని ఆ పార్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు. కౌశిక్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయడంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి హుజూరాబాద్‌ కోసం కాంగ్రెస్‌ అభ్యర్థిని వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. 

రెండు నెలల క్రితమే టీఆర్‌ఎస్‌ క్యాంప్‌లోకి కౌశిక్‌..?
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు వెలుగు చూసిన మరుసటి రోజు నుంచే కౌశిక్‌ రెడ్డి హుజూరాబాద్‌ సీన్‌లోకి వచ్చారు. టీఆర్‌ఎస్‌ క్యాంప్‌ సూచనల మేరకు రెండు నెలల నుంచే కౌశిక్‌రెడ్డి హుజూరాబాద్‌పై ‘మైండ్‌గేమ్‌’ ఆడుతున్నారని తాజా ఫోన్‌ సంభాషణతో తేటతెల్లమైంది. మంత్రివర్గం నుంచి ఈటలను తొలగించడాన్ని తప్పుపడుతూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు జీవన్‌రెడ్డి మొదలుకొని వీహెచ్‌ వరకు ఆయనకు మద్దతుగా నిలవగా, కౌశిక్‌ రెడ్డి ఒక్కరే ఈటలపై ధ్వజమెత్తారు.

అందులో భాగంగానే మేడ్చల్‌ మండలం రావల్‌కోల్‌లో ఈటల తనయుడు నితిన్‌రెడ్డి కొనుగోలు చేసిన 31 ఎకరాల భూమి దస్తావేజులో తండ్రి పేరును ఈటల రాజేందర్‌ రెడ్డిగా పేర్కొనడం వంటి అంశాలను సాక్షాలతో మీడియా ముందు పెట్టారు. అలాగే రూ.600 కోట్ల విలువైన 700 ఎకరాల భూములు ఈటల వద్ద ఉన్నాయని, వాటిపై విచారణ జరపాలని ముఖ్యమంత్రిని కోరుతూ మరోసారి మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. టీఆర్‌ఎస్‌ క్యాంపు నుంచి వచ్చిన సూచనలు, ఆధారాల మేరకే మాజీ మంత్రి ఈటలపై కౌశిక్‌రెడ్డి సాక్ష్యాధారాలతో ఆరోపణలు చేశారని ఇప్పుడు తేటతెల్లమైంది. 

మంత్రి కేటీఆర్‌తో భోజనం, రహస్య చర్చలు
సరిగ్గా నెలరోజుల క్రితం హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావుతోపాటు కౌశిక్‌ రెడ్డి కూడా హాజరయ్యారు. భోజనాల అనంతరం మంత్రి కేటీఆర్, కౌశిక్‌ రహస్య సమావేశం జరిగినట్లు సమాచారం. మంత్రి కారెక్కుతుంటే కారు దగ్గరికి వెళ్లి రహస్యంగా మాట్లాడుకున్న ఫొటోలు కూడా వైరల్‌ అయ్యాయి. దీనిపై వివరణ ఇచ్చిన కౌశిక్‌ రెడ్డి స్నేహితుడి తండ్రి పెద్ద కర్మకు హాజరైన కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశానే తప్ప వేరే ఉద్దేశమేదీ లేదని స్పష్టం చేశారు.

అనంతరం టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత స్వయంగా వెళ్లి ఆయనను కలిసిన కౌశిక్‌ రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా తాను పోటీ చేస్తే రేవంత్‌రెడ్డి నెలరోజుల పాటు హుజూరాబాద్‌లో ఉంటానని చెప్పినట్లు తెలిపారు. ఈ పరిణామాలతో కౌశిక్‌ రెడ్డి కాంగ్రెస్‌ వీడరని ఆ పార్టీ నేతలు భావించారు. కానీ.. తాజా సంభాషణ కలకలం రేపింది.

రెండునెలల క్రితమే  చెప్పిన ‘సాక్షి’
ఈటల రాజేందర్‌ ఎపిసోడ్‌ వెలుగులోకి వచ్చిన మే నెలాఖరు నుంచే హుజూరాబాద్‌లో పోటీ చేసే అభ్యర్థిపై టీఆర్‌ఎస్‌ ఫోకస్‌ పెట్టింది. వివిధ సర్వేల ప్రకారం యువకుడైన కౌశిక్‌రెడ్డినే ప్రత్యామ్నాయంగా భావించింది. ఈ మేరకు ఆయనతో టీఆర్‌ఎస్‌ పెద్దలు టచ్‌లోకి వచ్చారు. ప్రగతి భవన్‌ నుంచి వచ్చే ఆదేశాలు జిల్లా మంత్రి గంగుల కమలాకర్‌ ద్వారా కౌశిక్‌ రెడ్డికి చేరేవని సమాచారం. ఈ విషయాన్ని ‘సాక్షి’ సరిగ్గా రెండు నెలల క్రితమే వెలుగులోకి తెచ్చింది.

మే 11వ తేదీన కరీంనగర్‌ జిల్లా (7వ పేజీ)లో ‘యుద్ధం మొదలైంది’ శీర్షికన ప్రచురితమైన కథనంలో ‘కౌశిక్‌ రెడ్డి ద్వారా సరికొత్త రాజకీయం’ తెరపైకి వస్తున్న విషయాన్ని వెల్లడించింది. ప్రగతి భవన్‌ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మరుసటి రోజు కరీంనగర్‌లో కౌశిక్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారనే విషయాన్ని ‘సాక్షి’ పసిగట్టి కథనంలో పేర్కొన్నట్లుగానే జరిగింది. ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రూ.600 కోట్ల విలువైన 700 ఎకరాల భూముల గురించి కొన్ని పత్రాలను విడుదల చేశారు.

‘టీఆర్‌ఎస్‌ టికెట్‌ నాకు కన్‌ఫం అయింది. అందరిని సెట్‌ చెయ్యాలె. ఖర్చుల మందం యూత్‌ను చూసుకుంట.. యూత్‌కు 3 వేల నుంచి 5 వేల వరకు ఇచ్చుకుంట ఎళ్లిపో.. నిన్ను నేను చూసుకుంట, బొల్లం రాజిరెడ్డితో టచ్‌లో ఉండు’’
– కాంగ్రెస్‌ నేత పాడి కౌశిక్‌ రెడ్డి

‘చరణ్‌ పటేల్‌ దగ్గరున్న యూత్‌ను లాగాలె.. అన్న జాయినింగ్‌ రోజు అందరు వచ్చెటట్టు చూడాలె.. ఒక్కొక్కరికి 5 వేలు, మందుకు, ఖర్చులకు వేరే ఇత్తం’’   
కౌశిక్‌ రెడ్డి అనుచరుడు, బొల్లం రాజిరెడ్డి

మరిన్ని వార్తలు