టీఆర్‌ఎస్‌తోనే హుజూరాబాద్‌ నాయకులు: గంగుల

25 May, 2021 08:27 IST|Sakshi

ఈటల బెదిరించడంతోనే తొలుత మద్దతు

కేసీఆర్‌తోనే స్థానికంగా అభివృద్ధి

95 శాతం ప్రజాప్రతినిధులు, పార్టీ క్యాడర్‌ మా వెంటే

బెదిరించడం లేదు.. భయపెట్టడం లేదు

కొనుగోలు చేస్తున్నామని ఆరోపించడం అర్థరహితం

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌

సాక్షి, కరీంనగర్‌: హుజూరాబాద్‌ నియోజకవర్గమంతా సీఎం కేసీఆర్‌ వెంటే నిలిచిందని, టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు 95 శాతం పార్టీకి బాసటగా నిలిచారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. సోమవారం హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన వివిధ మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సింగిల్‌ విండో చైర్మన్లు, ఏఎంసీ చైర్మన్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ముఖ్య నాయకులు సోమవారం మంత్రి గంగుల కమలాకర్‌ను కలిసి తాము పార్టీని వీడేది లేదని, సీఎం కేసీఆర్‌ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ హుజూరాబాద్‌ నియోజకవర్గం నాయకులు పూర్తిగా కేసీఆర్‌కు విధేయులుగా ఉంటామని స్పష్టం చేసినట్లు చెప్పారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అసైన్డ్‌ భూములు కబ్జా చేశారన్న ఫిర్యాదు మేరకు సీఎం కేసీఆర్‌ విచారణకు ఆదేశించి, మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేశారని గుర్తు చేశారు. దీంతో ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌లో పార్టీని, క్యాడర్‌ను గందరగోళంలో పడేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులకు తెరదించేందుకే పార్టీ అధిష్టానం దృష్టి సారించిందన్నారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ అయిన ఈటల రాజేందర్‌ వెంట పార్టీ నాయకులెవరూ లేరని, టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు 95 శాతం పార్టీ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. తన వర్గీయులను బెదిరిస్తున్నారని, కొనుగోలు చేస్తున్నారని ఈటల రాజేందర్‌ విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

ప్రజాప్రతినిధులు, పార్టీ క్యాడర్‌ ఎలాంటి నిరుత్సాహానికి గురికావద్దని, వారికి అండగా ఉండి రెట్టింపు అభివృద్ధి చేసి చూపిస్తామని మంత్రి గంగుల భరోసా ఇచ్చారు. పార్టీ గుర్తుపై గెలిచిన ప్రజాప్రతినిధులు ఒక్కతాటిపై నిలిచి సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపర్చడం గర్వంగా ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో వర్గాలు లేవని.. ఉన్న క్యాడర్‌ అంతా కేసీఆర్‌ వర్గమేనని స్పష్టం చేశారు. 60 ఏళ్లుగా దగా పడ్డ తెలంగాణను సీమాంధ్ర నేతల నుంచి విముక్తి చేయడమేకాక రాష్ట్రాన్ని సాధించి కాళేశ్వరం లాంటి ఎన్నో ప్రాజెక్టులను నిర్మించి భూములను సస్యశ్యామలం చేసిన సీఎం కేసీఆర్‌ వెంటే పార్టీ క్యాడర్‌ ఉంటుందని అన్నారు.

ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో వ్యవసాయాన్ని పండుగ చేసి చూపిస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజలు బాసటగా నిలుస్తున్నారని, ఇటీవలి ఎన్నికల ఫలితాలు మరోసారి చూపించాయని అన్నారు. ఈటల రాజేందర్‌ కాంగ్రెస్, బీజేపీ నాయకులతోపాటు టీఆర్‌ఎస్‌ అంటే గిట్టని వ్యక్తుల్ని కలుస్తుండడంతో హుజూ రాబాద్‌ పార్టీ క్యాడర్‌ విసిగిపోయిందని అన్నారు. 

చదవండి: పట్టుబిగిస్తున్న అధిష్టానం.. ఈటల ఒంటరేనా?!

95 శాతం ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌లోనే.. 
హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మండలాల వారీగా ఈటలతో సంబంధం లేకుండా పార్టీతోనే ఉంటామని చెప్పిన ప్రజాప్రతినిధుల జాబితాను గంగుల పత్రికలకు విడుదల చేశారు. హుజూరాబాద్‌ మున్సిపాలిటీలోని మున్సిపల్‌ చైర్మన్, వైస్‌ చైర్మన్‌తోపాటు పార్టీకి చెందిన 23 మంది కౌన్సిలర్లు పార్టీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. హుజూరాబాద్‌ మండలంలోని పార్టీకి చెందిన 11 మంది ఎంపీటీసీల్లో 9 మంది, 19 మంది సర్పంచుల్లో బీజేపీ, కాంగ్రెస్‌ గెలిచిన ఒక్కో స్థానాన్ని వదిలేస్తే మిగతా 16 మంది పార్టీతోనే ఉన్నారని చెప్పారు. జమ్మికుంట మున్సిపాలిటీలోని 21 మంది టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లలో చైర్మన్, వైస్‌ చైర్మన్లతో సహా అందరూ టీఆర్‌ఎస్‌ వైపు ఉన్నారని, కో ఆప్షన్‌ సభ్యులు, ప్యాక్స్‌ చైర్మన్‌తో సహా మండలంలోని సర్పంచుల్లో 15 మంది, 10 మంది ఎంపీటీసీల్లో అందరూ పార్టీతోనే ఉన్నారని వెల్లడించారు. ఇల్లందకుంట మండలంలో జెడ్పీటీసీ, జడ్పీ చైర్‌పర్సన్, ఎంపీపీతోపాటు 9 మందిలో ముగ్గురు ఎంపీటీసీలు, 18 మంది సర్పంచుల్లో 12 మంది టీఆర్‌ఎస్‌ పార్టీతోనే ఉన్నారన్నారు.

వీణవంక మండలంలో జెడ్పీటీసీ, ఎంపీపీలతోపాటు 14 మంది ఎంపీటీసీల్లో 11 మంది పార్టీతో ఉన్నారుని, 26 మంది సర్పంచుల్లో ముగ్గురు కాంగ్రెస్‌ వారు కాగా, మిగతా 23 మందిలో 20 మంది పార్టీ వైపే ఉంటామని చెప్పారని తెలిపారు. ఈటల సొంత మండలమైన కమలాపూర్‌ జెడ్పీటీసీ కళ్యాణి, ఎంపీపీ రాజయ్య పార్టీలోకి వచ్చారని, 18 మంది ఎంపీటీసీల్లో 13 మంది టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారని పేర్కొన్నారు. 24 మంది సర్పంచుల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుతో గెలిచిన 22 మంది పార్టీ నాయకత్వంలోనే పనిచేస్తామని అంటున్నారని, వారి పేర్లతో సహా వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా  హుజూరాబాద్‌ నియెజకవర్గం ప్రజాప్రతినిధులు వారి అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు.

కేవలం ఈటల చేసిన ఒత్తిడి, బెదిరింపులతోనే తొలుత ఆయనకు మద్దతుగా మాట్లాడామని, కానీ.. తమకు ఓటేసిన ప్రజలు నిలదీయడంతో పార్టీతోనే ఉండాలని నిర్ణయించుకున్నామని తెలియజేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, కరీంనగర్‌ మేయర్‌ వై.సునీల్‌ రావు, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, పార్టీ నాయకులు వకులాభరణం కృష్ణ మోహన్‌ రావు, పిర్యాల రవీందర్‌ రావు, డిప్యూటీ మేయర్‌ చల్లా స్వరూపహరిశంకర్, హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు