కేసీఆర్‌తో హుజూరాబాద్‌ నేతల భేటీ 

12 Jul, 2021 01:12 IST|Sakshi

తాజా పరిస్థితులను ఆరా తీసిన ముఖ్యమంత్రి  

టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్‌నేత కౌశిక్‌రెడ్డి? 

ఖండించిన కాంగ్రెస్‌ నేత  

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు ఆదివారం సాయంత్రం ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. నియోజకవర్గం పరిధిలోని జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ అధ్యక్షులు, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, పీఏసీఎస్‌ చైర్మన్లు, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్‌ చైర్మన్లు ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పరిస్థితి, స్థానిక రాజకీయాలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌ ఆరా తీసినట్లు సమాచారం. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు, బీజేపీ, టీఆర్‌ఎస్‌కు మధ్య ఉన్న తేడాలను వివరించాలని సీఎం కేసీఆర్‌ పార్డీ నేతలకు సూచించారు.

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందని సీఎం కేసీఆర్‌ పార్టీ నేతలను ప్రశ్నించగా,‘ మీరు ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా మద్దతు ఇస్తాం‘ అని నాయకులు స్పష్టంచేశారు. కాగా, కాంగ్రెస్‌ నేత పాడి కౌశిక్‌ రెడ్డికి నియోజకవర్గంలో ఎలాంటి పేరు ఉందని అడగటంతో పాటు అతను పార్టీలోకి వస్తే ఎలా ఉంటుందని సీఎం ఆరా తీసినట్లు తెలిసింది. కౌశిక్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ లో చేరినా అతనితో కలసి పనిచేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పార్టీ నాయకులు చెప్పినట్లు సమాచారం. ఎలాంటి షరతులు లేకుండా కౌశిక్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు ఈ భేటీలో కేసీఆర్‌ సూచనప్రాయంగా వెల్లడించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా కౌశిక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరతారని స్థానికంగా కూడా ప్రచారం జరుగుతోంది. కానీ ఆదివారం ఈ ప్రచారాన్ని కౌశిక్‌రెడ్డి ఖండించారు. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ఆయన స్పష్టంచేశారు.    

మరిన్ని వార్తలు