Huzurabad Bypoll: ప్రభుత్వ పథకాలన్నింటికీ హుజూరాబాద్‌ కేరాఫ్‌ అడ్రస్‌!

24 Jul, 2021 15:17 IST|Sakshi

కులాల వారీగా సమావేశాలు, పంపకాలు

రోజుకో మంత్రి పర్యటన సాగేలా ప్లాన్‌

28న రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ఇక్కడే

ఆగస్టు మొదటి వారంలో సీఎం చేతుల మీదుగా దళితబంధు

26 నుంచి రేషన్‌కార్డుల పంపిణీ

సాక్షి, కరీంనగర్‌: రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన హుజూరాబాద్‌ ఉప ఎన్నికను అధికార టీఆర్‌ఎస్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ లక్ష్యంగా ఆ పార్టీ నాయకులు అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. నియోజకవర్గం నుంచి గెలిచిన సర్పంచ్‌ మొదలుకొని జెడ్‌పీటీసీ వరకు అందరినీ ఈటలకు దూరం చేసిన టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు.. ఓటర్లు ఇతర పార్టీల వైపు చూడకుండా రోజుకో స్కీంతో ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వ పథకాలన్నింటికీ హుజూరాబాద్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోతోంది. ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ రాకముందే హుజూరాబాద్‌లో నెలకొన్న ఎన్నికల వాతా వరణంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. 

సర్కారు పథకాలకు కేరాఫ్‌గా..
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తెలంగాణ దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌ నుంచే ప్రారంభించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. పైలట్‌ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో మెజారిటీ దళిత కుటుంబాలకు లబ్ధి చేకూర్చడం ద్వారా 45 వేల వరకున్న దళిత ఓటర్లను ప్రభావితం చేయబోతున్నారు. దళితబంధుపై సన్నాహక సదస్సును హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ఈనెల 26న ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. ఇందుకోసం హుజూరాబాద్‌ నుంచి 412 మంది దళితులు, మరో 15 మంది రిసోర్స్‌ పర్సన్లు కలిపి 427 మంది సదస్సులో పాల్గొంటున్నారు. ఈ సదస్సులోనే పథకాన్ని ఎప్పుడు ప్రారంభించే విషయాన్ని తెలియజేసే అవకాశం ఉంది.

అలాగే గొల్ల కురుమలకు ఆర్థికంగా పరిపుష్టిని కలిగించే ‘గొర్రెల పంపిణీ’ పథకాన్ని ఈనెల 28న పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ జమ్మికుంట నుంచే ప్రారంభించనున్నారు. కొత్త రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమం కూడా ఈనెల 26 నుంచి రాష్ట్రంలో ప్రారంభం కాబో తోంది. సంబంధిత మంత్రి గంగుల కమలాకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, అదే రోజు నుంచి కరీంనగర్‌ జిల్లాలో కూడా కార్డుల పంపిణీ జరగనుంది. జిల్లాలో 6,350 మందికి కొత్త కార్డులు జారీ చేయనున్నారు. ఇందులో హుజూరాబాద్‌లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ కార్డులు జారీ చేసినట్లు సమాచారం. 

పదవుల పందేరం సైతం..
హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఈటల వెంట వెళ్లకుండా టీఆర్‌ఎస్‌లోనే ఉన్న కొందరు నాయకులకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల పదవులను కూడా పందేరం చేస్తున్నారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బండ శ్రీనివాస్‌ను నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. 2001 నుంచి టీఆర్‌ఎస్‌లో ఉన్న ఆయనకు ప్రభుత్వ నామినేటెడ్‌ పదవికి సంబంధించిన ఉత్తర్వులను మంత్రులు గంగుల కమలాకర్, వి.శ్రీనివాస్‌ గౌడ్‌ అందజేశారు. ఇటీవల పార్టీలో చేరిన పాడి కౌశిక్‌రెడ్డి అసెంబ్లీ టికెట్టు ఆశిస్తుండగా, వివిధ సమీకరణల్లో టికెట్టు ఇవ్వకపోతే శాట్స్‌ చైర్మన్‌ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తుమ్మేటి సమ్మిరెడ్డి, గెల్లు శ్రీనివాస్‌ వంటి నియోజకవర్గ నేతలకు కూడా నామినేటెడ్‌ పదవులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

సామాజిక వర్గాల వారీగా లబ్ధి
నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఓటర్లలో సామాజికవర్గాలుగా విభజిస్తే అత్యధిక సంఖ్యలో ఎస్సీ ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గంలో 46 వేల మంది ఎస్సీ ఓటర్లు ఉన్నట్లు లెక్క తేల్చారు. ఆ తరువాత అత్యధికంగా మున్నూరుకాపు ఓటర్లు 29 వేల వరకు ఉన్నట్లు అంచనా. ఇతర సామాజిక వర్గాల్లో పద్మశాలి (26 వేలు), గౌడ (24 వేలు), ముదిరాజ్‌ (23 వేలు), యాదవ (22 వేలు)తోపాటు రెడ్డి (22,600) సామాజిక వర్గాలకు కూడా గెలుపు, ఓటములను ప్రభావితం చేసే స్థాయి ఓటర్లున్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు నాయీ బ్రాహ్మణ, ఎస్టీలు, రజక, మైనారిటీ తదితర వర్గాలకు చెందిన వారు 35 వేల వరకు ఉంటారని అంచనా. ఈ నేపథ్యంలో ఆయా సామాజిక వర్గాలకు మేలు చేసే కార్యక్రమం సాగుతోంది.

మున్నూరుకాపు, రజక సామాజిక వర్గాల ఆత్మగౌరవ భవనాలకు ఎకరా స్థలం,  రూ.50 లక్షల నిధులు చొప్పున గురువారం మంత్రులు తలసాని, గంగుల, కొప్పుల ఈశ్వర్‌ ప్రొసీడింగ్స్‌ ఇచ్చారు. శుక్రవారం గౌడ సంఘానికి ఎకరా స్థలంతో పాటు కోటి రూపాయలు మంజూరు ఉత్తర్వులను మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు గంగుల, కొప్పుల అందజేశారు. అలాగే మహిళా ఆత్మగౌరవ భవనానికి కూడా ఎకరా స్థలం, రూ.కోటి మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వీటితోపాటు గతంలో వైశ్య సామాజిక వర్గానికి భవనం కోసం ఎకరా స్థలాన్ని కేటాయించారు. పద్మశాలి, ఇతర వర్గాలకు కూడా ఇదే రీతిన వితరణ కార్యక్రమాలు చేపడుతున్నారు.  

మరిన్ని వార్తలు