‘18 ఏళ్లుగా తమ్ముడిగా పిలిచి.. అరగంటలోనే దెయ్యం ఎలా అయ్యా’

10 Jul, 2021 12:28 IST|Sakshi

ప్రశ్నిస్తేనే బయటికి పంపారు..

మద్దతు పలికే వారిని భయపెడుతున్నారు

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌

సాక్షి, హుజూరాబాద్‌: ప్రజల సంక్షేమం కోసం ప్రశ్నిస్తేనే తనను బయటికి పంపారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. మండలంలోని చెల్పూర్‌ గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్‌ నేరేళ్ల మహేందర్‌గౌడ్‌తో పాటు ఆరుగురు వార్డు సభ్యులు, ఇద్దరు ప్రాథమిక సహకార సంఘం సభ్యులు, పలువురు నాయకులు బీజేపీలో చేరగా రాజేందర్‌ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 18 ఏళ్లుగా తమ్ముడిగా పిలిచి.. అర గంటలోనే దెయ్యం ఎలా అయ్యానని ప్రశ్నించారు. ‘2018 ఎన్నికల సమయంలో ఓ వ్యక్తితో నా మీద కరపత్రాలు, పోస్టర్లు కొట్టించి, నా వ్యక్తిత్వాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. నా దగ్గరకు ఎవరూ వచ్చినా నా చేతనైనా సాయం చేశాను’ అని తెలిపారు.

ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో ఏనాడూ డబ్బు, దర్పం చూపలేదన్నారు. తనకు టికెట్‌ ఇచ్చినవాళ్లే తనను ఓడగొట్టాలని చూశారని పేర్కొన్నారు. అధికార పార్టీలో ఉన్నా కూడా తన ఇంటి మీద పోలీసులతో దాడి చేయించారని విమర్శించారు. వాటన్నింటినీ భరిస్తూ వచ్చానని తెలిపారు. ప్రజల తరఫున పింఛన్లు ఇవ్వాలని అడిగానని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త ఫించన్లు, కొత్త రేషన్‌ కార్డులు కావాలని అధిష్టానాన్ని కోరానన్నారు. ఇవన్నీ అడిగినందుకే తనను బయటకు పంపారన్నారు.

తెలంగాణ ఉద్యమంలో తన మీద ఎన్నో కేసులు ఉన్నాయని.. కరీంనగర్‌ మంత్రి ఏనాడైనా జైలుకు వెళ్లాడా? అని ప్రశ్నించారు. తాను రాజీనామా చేయకుంటే ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చేవారా అని నిలదీశారు. అందరూ ఆలోచించి నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరారు. అలాగే తుమ్మనపల్లి గ్రామంలో ఉప సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఈటల సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం చెల్పూర్‌ గ్రామానికి చెందిన సలిగొమ్ముల రాజమల్లమ్మ కుటుంబాన్ని ఈటల పరామర్శించారు. 

మరిన్ని వార్తలు