Etela Rajender: బీజేపీలో చేరికపై బండి సంజయ్‌ క్లారిటీ

28 May, 2021 08:35 IST|Sakshi

బీజేపీ చీఫ్‌ నడ్డాతో వీడియో  కాన్ఫరెన్స్‌.. ఆ తరువాత స్పష్టత

ఈటల నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నజిల్లా బీజేపీ కేడర్‌

మాజీ మంత్రి పెద్దిరెడ్డి అసంతృప్తి.. టీఆర్‌ఎస్‌ వైపు చూపు

నాలుగు వారాల్లోనే జిల్లా రాజకీయాల్లో కీలక మలుపు

సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాలో రాజకీయం కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌ భూకబ్జా ఆరోపణలతో పదవీచ్యుతుడైన నాలుగు వారాలకు ఆయన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత వచ్చింది. మంత్రిగా బర్తరఫ్‌ తరువాత  నెల రోజులకు రాజకీయంగా ఈటల ‘రంగు’ మారడం ఖాయమైంది.  ఊహాగానాలను నిజం చేస్తూ బీజేపీలో చేరడం నిశ్చయమైంది. త్వరలోనే ఆయన అధికారికంగా కాషాయ కండువా కప్పుకోనున్నారు. ‘ఎర్ర’ జెండా బ్యాక్‌ గ్రౌండ్‌ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఈటల మారిన పరిస్థితుల్లో ఆయన  ఆలోచనలకు పూర్తిగా భిన్నమైన కాషాయం నీడను ఆశ్రయించడం ఖరారైంది. ..

సుదీర్ఘ చర్చల తరువాత..
అధికార టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నుంచి ఉద్వాసన తరువాత ఈటల రాజేందర్‌ సొంత పార్టీ ఏర్పాటుపై ఊహాగానాలు సాగాయి. అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన నేతలు ఆయనను తమ పార్టీల్లోకి ఆహ్వానించారు. ఆయన మాత్రం ఏ నిర్ణయాన్ని వెల్లడించకుండా మౌనం పాటించారు. ఇప్పుడు హుజూరాబాద్‌తోపాటు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బీజేపీలో చేరడం అనివార్యంగా భావించినట్లు సమాచారం. కొద్ది రోజులుగా బీజేపీ రాష్ట్ర నాయకులతోనూ టచ్‌లో ఉన్న ఈటల.. జాతీయ నాయకులతో సైతం ఫోన్‌లో మాట్లాడారు.

బీజేపీ అగ్రనేత అమిత్‌షా సైతం ఆయనను పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిసింది. అదే సమయంలో కేంద్ర సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో జరి పిన చర్చల్లో బీజేపీలో చేరేందుకు సుముఖత వ్య క్తం చేసినట్లు తెలిసింది. గురువారం వీడియో కా న్ఫరెన్స్‌లో బీజేపీ చీఫ్‌ నడ్డాకు ఈటల రాక ఖాయమైన విషయాన్ని సంజయ్‌ తెలిపినట్లు సమాచారం. ఈటల చేరిక తేదీని ఒకటి రెండు రోజుల్లో బీజేపీ అగ్ర నాయకత్వం ఖరారు చేయనుంది. ఆ తరువాత ఆయన ఢిల్లీలో బీజేపీ అగ్రనేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు.

చదవండి: ఈటల దారి ఎటువైపు.. సొంత పార్టీ వద్దు.. బీజేపీ బెటర్‌!

టీఆర్‌ఎస్‌ గూటికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి..?
ఈటల రాజేందర్‌ను బీజేపీలోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు వస్తున్న కథనాలపై మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు. గతంలో హుజూరాబాద్‌ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా కొనసాగిన పెద్దిరెడ్డి తెలంగాణ ఉద్యమ ఊపులో 2004 టీడీపీ అభ్యర్థిగా ఓడిపోయారు. 2009లో ప్రజారాజ్యం నుంచి ఓటమి పాలు కాగా, 2014 ఎన్నికల్లో రామగుండం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో పోటీలోనే లేరు. 2018 ఎన్నికల తరువాత బీజేపీలో చేరిన ఆయన తదుపరి ఎన్నికల్లో హుజూరాబాద్‌ నుంచి పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారు.

అయితే.. ఈటల కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమైందని తెలి యగానే ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీలో తనకు ఒక్క మాట చెప్పకుండా ఈటలను ఎలా చేర్చుకోవాలని నిర్ణయిస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల బీజేపీలో చేరిన పక్షంలో పెద్దిరెడ్డి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడం ఖాయమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈటల మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ అయిన నాటి నుంచే పెద్దిరెడ్డి టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసేందుకు ఆ పార్టీలో చేరతారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఫైనల్‌గా పెద్దిరెడ్డి గులాబీ జెండా కప్పుకోవడమే మిగిలింది. 

చదవండి: బీజేపీలో చేరికపై తొందరొద్దు..! ఊగిసలాటలో ఈటల...

నాలుగు వారాల్లో మారిన సీన్‌
గత నెల 30వ తేదీన ఈటల ఎపిసోడ్‌ తెరపైకి వచ్చింది. మెదక్‌ జిల్లా మాసాయిపేట అసైన్డ్‌ భూముల ఆక్రమణ ఆరోపణలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ విచారణకు ఆదేశించారు. మరుసటి రోజు మే 1న ఆయన నిర్వహిస్తున్న వైద్యారోగ్య శాఖను ముఖ్యమంత్రి తన పరిధిలోకి తీసుకున్నారు. మే 2న ఏకంగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఈటల ఎపిసోడ్‌ రోజుకో మలుపు తిరుగుతూ వస్తోంది. హుజూరాబాద్‌లో తొలుత టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులలో 70 శాతం మంది ఈటలకు మద్దతుగా నిలవగా, టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఆదేశాలతో మంత్రి గంగుల కమలాకర్‌ రంగ ప్రవేశం చేశారు. ప్రజాప్రతినిధులను ఈటలకు దూరం చేయడంలో గంగుల విజయం సాధించారు.

గంగులకు తోడుగా సీనియర్‌ మంత్రి హరీశ్‌ రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ రంగప్రవేశం చేయడంతో హుజూరాబాద్‌ సీన్‌ మారింది. తనకు తాను సొంతంగా తయారు చేసుకున్న కేడ ర్‌ మినహా పార్టీ ద్వారా పదవులు పొందిన వారి లో 90 శాతం మంది ఆయనకు దూరమయ్యారు. ఈ పరిస్థితుల్లో ఈటల అడుగులు కాషాయం వైపు మళ్లాయి. తద్వారా హుజూరా బాద్‌లోనే గాక, భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా సానుకూల ఫలితాలు దక్కుతాయని ఆయన భావిస్తున్నారు. ఈటల ఎపిసోడ్‌ వెలుగులోకి వచ్చిన నాలుగు వారాలకు కథ కీలక మలుపు తిరిగింది.  

ఈటల రాక బీజేపీకి కొత్త కళ
కమలాపూర్, హుజూరాబాద్‌ నియోజకవర్గాల నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై తెలంగాణ ఏర్పాటు తరువాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా వ్యవహరించిన ఈటల రాజేందర్‌ను బీజేపీలోకి ఆహ్వానించడంలో ఉమ్మడి జిల్లా నేతలదే ముఖ్య పాత్ర. జిల్లాకు చెందిన పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈటల రాకతో ఉమ్మడి జిల్లాలో బీజేపీ బలపడుతుందని ఆయన విశ్వసించారు. ఆయనతోపాటు పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వివేక్‌ కూడా ఈటలతో సంప్రదింపులు జరిపి బీజేపీ వైపు అడుగులు వేయించడంలో కీలకపాత్ర పోషించారు. ఇటీవల హైదరాబాద్‌లోని వివేక్‌ గెస్ట్‌ హౌజ్‌ నుంచే బీజేపీ రాష్ట్ర, జాతీయ నేతలతో మంతనాలు సాగినట్లు సమాచారం.

అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గంగాడి కృష్ణారెడ్డి సైతం హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన వారే. పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అగ్ర నాయకత్వం తీసుకునే నిర్ణయాలకు పార్టీ నాయకులందరూ కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన ‘సాక్షి’తో చెప్పారు. కాగా.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇప్పటికే జిల్లా నాయకులను మానసికంగా సిద్ధం చేసిన నేపథ్యంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు కూడా ఈటల రాకను ఆహ్వానిస్తున్నారు. 

మరిన్ని వార్తలు