అమరుల ఆశయాలకు మరో ఉద్యమం

15 Aug, 2022 02:28 IST|Sakshi
సదస్సులో మాట్లాడుతున్న ఆర్‌.కృష్ణయ్య 

రాజ్యసభ సభ్యుడు ఆర్‌. కృష్ణయ్య

సుందరయ్య విజ్ఞానకేంద్రం/కాచిగూడ (హైదరాబాద్‌): తెలంగాణ ఉద్యమంలో ప్రజలు దేనికోసం అమరులయ్యారో ఆ అమరుల ఆశయాల సాధనకోసం మరోసారి ఉద్యమాలు చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ నేడు నిరుద్యోగుల ఆకాంక్షలు కూడా నెరవేరలేదని ఆవేదన వ్యక్తంచేశారు.

పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా ఇవ్వటం లేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారుల గురించి పార్లమెంట్‌లో చర్చిస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ తెలంగాణ కోసం చైతన్యవంతంగా పని చేసిన సంఘాలు తెలంగాణ వచ్చాక రద్దయ్యాయని విమర్శించారు. ఉద్యమకారుల కుటుంబాలకు గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.

ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడుతూ అనేక మంది ఉద్యమకారుల బలిదానం వల్లనే తెలంగాణ ఏర్పడిందని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు చెరుకు సుధాకర్‌ మాట్లాడుతూ ఉద్యమకారులను అనాథలను చేయటంలో అన్ని పార్టీలు ముందున్నాయని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కాచం సత్యనారాయణ డిమాండ్‌ చేశారు.

అనంతరం పలువురు ఉద్యమకారులను సత్కరించారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్‌ చీమ శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుభాష్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు దిలీప్‌కుమార్, రాములు నాయక్, వేముల మారయ్య, సీనియర్‌ జర్నలిస్టు పల్లె రవికుమార్, ప్రొఫెసర్‌ అన్వర్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు. 

50 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరు  
పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం కాచిగూడలోని అభినందన్‌ గ్రాండ్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన బీసీ సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఆయన 
ముఖ్యఅతిథిగా ప్రసంగించారు.

దీర్ఘకాలికంగా, అపరిష్కృతంగా ఉన్న బీసీల డిమాండ్లను సాధించే వరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలు జరుగుతున్న సమయంలో దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పదిరోజులుగా వేలాది మందితో ఢిల్లీలో పార్లమెంట్‌ వద్ద ధర్నాలు, ర్యాలీలు, ప్రదర్శనలు, పార్లమెంట్‌ ముట్టడి కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు.  

బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో జనాభా ప్రకారం సమాన వాటా ఇవ్వాలని కోరారు. త్వరలో జరిగే జనగణనలో కులగణన చేపట్టాలని డిమాండ్‌ చేశారు. బీసీల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రీమీలేయర్‌ను తొలగించాలని కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు