గెలుపే లక్ష్యం.. తెలంగాణపై మరింత ఫోకస్ పెట్టిన బీజేపీ హైకమాండ్‌

7 Mar, 2023 12:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీః రానున్న తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే విస్తృత కార్యాచరణ మొదలు పెట్టిన బీజేపీ హైకమాండ్‌ గెలుపే లక్ష్యంగా వ్యూహాల అమలుకు సీనియర్‌ నేతలతో ఎన్నికల కమిటీని నియమించింది. తెలంగాణ ఇంచార్జీలుగా ఉన్న సునీల్‌ బన్సల్, తరుణ్‌ఛుగ్‌లు సహా మరో నలుగురిని కమిటీలో సభ్యులుగా చేర్చింది. తెలంగాణ సహా ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, హరియాణా వంటి రాష్ట్రాల్లో గుర్తించిన 160 లోక్‌సభ పార్లమెంట్‌ స్థానాల్లో పార్టీ విస్తరణ, నిర్దేశిత కార్యక్రమాల అమలును పర్యవేక్షించే బాధ్యతలను కమిటీ చూడనుంది.  

బూత్‌స్థాయి నేతలే లక్ష్యంగా చేరికలు.. 
వచ్చే డిసెంబర్‌లో జరిగే ఎన్నికల్లో పార్టీని ఎలాగైనా అధికారంలోకి తేవాలని గట్టి పట్టుదలతో ఉన్న బీజేపీ ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి మార్గనిర్దేశం చేసిన విషయం తెలిసిందే. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సహా ఇతర పెద్దలంతా రాష్ట్ర నేతలతో మాట్లాడి మార్చి నుంచి సెప్టెంబర్‌ వరకు వరుసగా నియోజకవర్గ స్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రజా ఉద్యమాలపై పలు సూచనలు చేశారు. ఈ భేటీకి కొనసాగింపుగా పార్టీ కార్యక్రమాల అమలును పర్యవేక్షించేందుకు వీలుగా ఆరుగురు సభ్యుల కమిటీని పార్టీ నియమించింది.

ఇందులో సునీల్‌ బన్సల్, తరుణ్‌ఛుగ్‌తో పాటు పార్టీ ముఖ్య నేతలు వినోద్‌ తావ్డే, నరేశ్‌ బన్సల్, హరీశ ద్వివేది, జే పాండా సభ్యులుగా ఉండనున్నారు. వీరంతా తెలంగాణతో పాటు గుర్తించిన 160 లోక్‌సభ నియోజకవర్గాలపై దృష్టి సారించనున్నారు. ఈ నియోజకవర్గాల్లో బూత్‌స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడం, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటాలు వంటి అంశాలను పర్యవేక్షించనున్నారు. తెలంగాణలో చాలా నియోజకవర్గాల్లో కొత్త, పాత నేతల మధ్య అంతర్గత విభేధాలున్నాయని, ముఖ్యంగా ఇతర పార్టీల నేతల చేరిక విషయంలో అభిప్రాయ భేదాలు పారీ్టకి నష్టం చేస్తున్నాయని గుర్తించిన నేపథ్యంలో వాటిని సరిదిద్దే బాధ్యతలను కమిటీ చూసుకుంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు.

చదవండి: ఉప్పు‌‌-నిప్పు: ఔను..! వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు!!

>
మరిన్ని వార్తలు