బడ్జెట్‌ వాస్తవ దూరం: భట్టి

9 Feb, 2023 04:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొందరి ఆస్తులు అనూహ్యంగా పెరిగితే రాష్ట్రంలోని ప్రజలందరి ఆదాయం పెరిగినట్లు కాదని సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలోని పేదల జీవితాలేమీ మారలేదని, కొందరు పెద్దలు మాత్రమే వేల కోట్ల ఆదాయం పొందారన్నారు. బడ్జెట్‌పై అసెంబ్లీలో బుధవారం జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన, మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఆయనలాగే పొడుగ్గా ఉన్నప్పటికీ, వాస్తవానికి దూరంగా ఉందని విమర్శించారు. 2014–15 సంవత్సరంలో లక్ష కోట్లతో మొదలైన బడ్జెట్‌ 2023–24 నాటికి 2,90,396 కోట్లకు పెంచారే తప్ప బడ్జెట్‌ లెక్కలు వాస్తవాలకు దగ్గరగా లేవని అన్నారు.

కొత్త పన్నులు వేయకుండా స్వీయ పన్నుల ఆదాయం ఎలా పెరుగుతుందో చెప్పాలన్నారు. పన్నుల రాబడిలో రూ.40 వేల కోట్లు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధుల్లో రూ.30 వేల కోట్లు ఎక్కువగా చూపించారని, ఇది అనుమానాలకు తావిస్తున్నదని అన్నారు. ఈ బడ్జెట్లో రూ 46,317 కోట్లు అప్పు తేనున్నట్లు చూపారని, ఈ అప్పుతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేసిన అప్పులు రూ. 3.57 లక్షల కోట్లకు చేరుకుంటుండగా, గ్యారంటీలు, కార్పొరేషన్ల పేరిట తీసుకువచి్చన అప్పులు రూ. 1.29 కోట్లు కలిపితే మొత్తం రూ. 4.86 కోట్ల అప్పుల భారం ప్రజలపై మోపినట్లు అవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తలసరి ఆదాయం రూ. 1,40,840 నుంచి రూ. 3,17,115కు పెరిగినట్లు చెబుతున్నప్పటికీ.. అది సంపన్నులకేనన్నారు.  

కేంద్ర బడ్జెట్‌పై విమర్శలు 
కేంద్రం ప్రవేశపెట్టిన రూ. 45 లక్షల కోట్ల బడ్జెట్లో రూ. 15 లక్షల కోట్లు అప్పులుగా చూపారని, తెలంగాణకు విభజన చట్టంలో ఇచి్చన హామీలకు ఒక్కరూపాయి కూడా కేటాయించలేదని భట్టి విమర్శించారు. రాష్ట్ర విభజన హక్కుల చట్టం ప్రకారం ఖాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్‌ ప్లాంట్, గిరిజన యూనివర్సిటీ, ఐటీఐఆర్‌ తదితర ఏ ఒక్క ప్రాజెక్టుకూ నిధులివ్వలేదన్నారు.

పేదలకు పంచిన అసైన్డ్‌ భూములను స్వా«దీనం చేసుకుని ప్రభుత్వమే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే విధానం మారాలన్నారు. చైతన్య, నారాయణ విద్యాసంస్థలు ఎలాంటి వసతులు లేకున్నా వేలకువేలు ఫీజుల భారం మోపి ప్రజలను దోపిడీ చేస్తున్నాయని, ఫీజుల నియంత్రణ పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. భట్టి విక్రమార్క ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే బీజేపీ సభ్యుడు రఘునందన్‌రావు, నారాయణ, చైతన్య విద్యా సంస్థల గురించి మాట్లాడుతుంటే కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద అడ్డుకునే ప్రయత్నం చేశారు.   

మరిన్ని వార్తలు